– ఆన్‌లైన్ గేమ్‌కు బానిసలై అక్కాచెల్లెళ్ల బలవన్మరణం
లక్నో, ఫిబ్రవరి 4: ఉత్తరప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆన్‌లైన్ కొరియన్ గేమ్ ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణం తీసింది. ఆన్‌లైన్ గేమ్ ఆడవద్దని తల్లిదండ్రులు మందలించటంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు 9వ అంతస్తు నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకున్నారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి 2.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఘజియాబాద్‌కు చెందిన 16 ఏళ్ల నిషిక, 14 ఏళ్ల ప్రాచి, 12 ఏళ్ల పఖి ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అన్ని పనులు కలిసే చేసేవారు. కోవిడ్ సమయంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు టాస్క్ బేస్డ్ కొరియన్ ఆన్‌లైన్ గేమ్ ’కొరియన్ లవర్’కు బానిసలుగా మారారు. గంటలు, గంటలు గేమ్ ఆడుతూ గడిపేవారు. అంతేకాదు.. తమ పేర్లు మార్చుకుని కొరియన్ పేర్లు పెట్టుకున్నారు. గేమ్ అడిక్షన్ కారణంగా స్కూలుకు కూడా సరిగా వెళ్లేవారు కాదు. పిల్లలు పూర్తిగా గేమ్‌కు బానిసలుగా మారటంతో తల్లిదండ్రులకు కోపం వచ్చింది. వారిని ఇకపై గేమ్ ఆడవద్దని మందలించారు. దీంతో ముగ్గురూ మనస్తాపానికి గురయ్యారు. గేమ్ ఆడకుండా బతకలేమని భావించారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురూ కలిసి చనిపోవాలని నిశ్చయించుకున్నారు. మంగళవారం 8 పేజీల సూసైడ్ నోట్ రాశారు. రాత్రి 2.30 గంటల ప్రాంతంలో 9వ అంతస్తులో ఉన్న తమ ప్లాట్ కిటికీ నుంచి ఒకరి తర్వాత ఒకరు కిందకు దూకి ప్రాణాలు తీసుకున్నారు. బిల్డింగ్ దగ్గర పెద్ద శబ్దం రావటంతో స్థానికులు అక్కడికి వచ్చారు. నేలపై రక్తపు మడుగులో పడి ఉన్న వారిని చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురిని హాస్పిటల్‌కి తరలించారు. అప్పటికే వారు చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. అక్కాచెళ్లెళ్ల గదిలోకి వెళ్లి పరిశీలించగా అక్కడ సూసైడ్ నోట్ దొరికింది. అందులో వారు తమ బాధనంతా వివరంగా రాసుకొచ్చారు. తల్లిదండ్రులకు క్షమాపణ సైతం చెప్పారు. ప్రాచీ విపరీతంగా మొబైల్ ఫోన్ వాడేది. ఆమె కారణంగానే మిగిలిన ఇద్దరూ ఆన్‌లైన్ గేమ్ ’కొరియన్ లవర్’కు బానిసలుగా మారారు. చివరకు గేమ్ అడిక్షన్ కారణంగానే ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



