ఎప్పుడైతే తర్కంతో సమర్థించుకోవడం సాధ్యంకాదో అప్పుడు విమర్శకుల నోరు మూయించడానికి బెదిరింపే ఆయుధంగా మారుతుంది. ప్రస్తుత పాలనకు ఈ సాధారణ సూత్రం తప్పక వర్తిస్తుంది. అంటే ఎప్పుడైతే నాయకుల వద్ద వాస్తవాలు కొరవడుతాయో అప్పుడు బలప్రయోగానికి సిద్ధమవుతారు. ఎప్పుడైతే ప్రభుత్వం సహేతుక చర్చనుంచి సంస్థాగత బెదిరింపు వైపు మళ్లుతుందో అది తన తప్పును మౌనంగా అంగీకరించినట్టే. అటువంటి ప్రభుత్వం మరెంతోకాలం తన తప్పులను సమర్థించుకోజాలదు. చరిత్రలో ఇటువంటి ఉపమానాలు కోకొల్లలు. రష్యాను పాలించిన జార్ చక్రవర్తుల కాలనుంచి యూరప్‌ను పాలించిన నిరంకుశ రాజుల వరకు తమను విమర్శించేవారిని కుట్రదారులుగా ముద్రవేయడమనే ఒకే విధానాన్ని అనుసరించడం కనిపిస్తుంది. ముఖ్యంగా తమ విధాన వైఫల్యాలకు సమాధానం లేనప్పుడు, ఈవిధంగా చేయడం పరిపాటి.
ఇవ్వాళ సరిగ్గా ఇదే మాదిరి నాటకం మన పార్లమెంట్‌లో ఆవిష్కృతమవుతోంది. భారత్-అమెరికా ఒప్పందం విషయంలో ప్రస్తుతం పార్లమెంట్‌లో చర్చల యుద్ధం కొనసాగుతున్నది ! జాతి ప్రయోజనాలను పూర్తిగా అమెరికాకు తాకట్టు పెట్టారనేది విపక్షనేత రాహుల్ గాంధీ ఆరోపణ! ఆర్థిక అంశాలపై ఆయన లేవనెత్తిన భయాలకు సరైన సమాధానాలు ఇవ్వాల్సిందిపోయి ప్రభుత్వం నిరంకుశంగా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టడం విచిత్రం. విపక్ష నేత స్పష్టంగా పేర్కొంటున్న అంశాలను సమాధిచేసే ప్రకియగా దీన్ని భావించాలి.
లోక్‌సభలో విపక్షనేత చేసిన హెచ్చరికలు కేవలం రాజకీయపరమైనవి కావనేది గమనించాలి. వీటిల్లో భారతీయ రైతుల్లో నెలకొన్న ఉద్వేగాలు వీటిల్లో ప్రతిబింబిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్న తరుణంలో, భారత్ తమ దేశ వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులపై టారిఫ్ లను పూర్తిగా ఎత్తివేయడానికి అంగీకరించిందని వాషింగ్టన్ నుంచి వొస్తున్న ప్రకటనలపై, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా అమెరికా నుంచి చౌకధరలో దిగుమతి అయ్యే జన్యు పరివర్తన విత్తనాలతో పండించిన పంట ఉత్పత్తులు మన మార్కెట్లను వెల్లువలా ముంచెత్తక మానవవని వారు హెచ్చరిస్తున్నారు. ఇది లక్షలాది మన రైతుల జీవనోపాధిని దారుణంగా దెబ్బతీస్తుందని కూడా వారు స్పష్టం చేస్తున్నారు.ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, విపక్షనేత సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తూ ఆయనపై హక్కుల తీర్మానం పేరుతో శిక్షించడం ఎంతవరకు సమంజసం ? కేవలం పార్లమెంట్ విధివిధానాల్లో ని సాంకేతిక అంశాలను అడ్డంపెట్టుకొని ప్రభుత్వం, అతి కీలకమైన అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చ ను పక్కదోవ పట్టించడం గర్హనీయం. దీన్ని కేవలం ఒక సంఘటనామాత్రంగా పరిగణించడానికి వీల్లేదు. వ్యూహాత్మకంగా పక్కదోవ పట్టించే వైనం. రిటైర్డ్ ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె రాసిన ఆత్మకథ పుస్తకం విషయంలో కూడా ఇదే రకమైన వివాదాన్ని మనం చూసాం. ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే పేరుతో తాను రాసిన పుస్తకంలో నరవణె పేర్కొన్న ఇబ్బంది కలిగించే వాస్తవాలపై ప్రభుత్వం బదులివ్వాల్సింది పోయి, ఆ చేతివ్రాత ప్రతి ఏవిధంగా బయటకు వొచ్చిందో తెలుసుకోవడంపై దృష్టిపెట్టి, పోలీసు దర్యాప్తునకు ఆదేశించడం విచిత్రం!
విపక్ష ఎంపీలు ఇచ్చిన హక్కుల తీర్మానాలను స్పీకర్ కేవలం కుట్రపూరితమైనవిగా వర్ణించారు. వీటన్నింటిని చూస్తుంటే ప్రభుత్వం తన జవాబుదారీతనం నుంచి దూరంగా వైదొలగి, పోలీసింగ్ వైపునకు మళ్లడం వర్తమాన పరిణామం! హడావిడిగా తొందరపాటుతో ఇటువంటి ఒప్పందం కారణంగా మనదేశ ప్రతిష్టను, స్వేచ్ఛను పణంగా పెట్టడం ఎంతవరకు సబబు? మనం చమురు ఎవరివద్ద కొంటున్నామన్నది ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అధికారం యు.ఎస్.కు ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? అన్న పదునైన ప్రశ్నలు లేవనెత్తడం ద్వారా విపక్షనేత రాహుల్ గాంధీ రాజకీయ వేడిని రగిల్చారనే చెప్పాలి. ఒకవైపు ఒప్పందం పూర్తిగా తమకు అనుకూలంగా కుదిరిందంటూ అమెరికా అధికార్లు పండుగ చేసుకుంటుంటే, మన ప్రభుత్వం ఇస్తున్న వివరణలు విస్పష్టంగా లేకపోవడం విచారకరం.
ఒప్పంద పత్రం మనం పూర్తిగా లొంగిపోయామన్నది స్పష్టం చేస్తోంది. కానీ భారత ప్రభుత్వం దీనిపై మౌనం వహిస్తోంది తప్ప పెదవి విప్పడంలేదు. ఒక ప్రభుత్వం నిబంధనలు లేదా అసమ్మతిని నేరంగా చూపించడం వంటి చర్యల మాటున తనను తాను కాపాడుకోవడానికి ప్రయత్నించడం, చరిత్రగతిలో తమ తప్పిదాలకు భయపడిన పెద్ద నాయకులు అనుసరించిన వైఖరికి ప్రతిబింబంగా ఉంది . ఈ దావానలం మరింత విస్తరిస్తున్న కొద్దీ సమాధానం లేని ఒక ప్రధాన ప్రశ్న అట్లాగే ఉండిపోయింది. అసలు ఈ ఒప్పందం విజయమా? లేక లొంగుబాటా? అనేదే ఆ ప్రశ్న. ప్రభుత్వం దీనికి సమాధానమివ్వకుండా, ఎవరు, ఎందుకు ప్రశ్నించినా, వారిపై దాడులకు దిగడ మంటే ప్రజాస్వామ్యం ముట్టడిలో ఉన్నట్టే భావించాలి!





