– ట్రాన్స్‌జెండర్లకు సీపీ సజ్జనార్ హెచ్చరిక
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్13: ట్రాన్స్‌జెండర్లు బెదిరింపులకు దిగి వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ అవకాశాలను వాడుకుని సమాజంలో గౌరవంగా బతకాలని సూచించారు. గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వారి సమస్యల పరిష్కారానికి ‘ప్రైడ్ ప్లేస్’ ఏర్పాటు చేశామని సజ్జనార్ తెలిపారు. ఇటీవలి కాలంలో ట్రాన్స్‌జెండర్ల ఆగడాలకు సంబంధించిన వార్తలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. వేడుక జరిగితే చాలు.. అది చిన్నది, పెద్దది అనే తేడా లేకుండా గుంపులుగా అక్కడకు చేరి బెదిరించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. గతంలో కొందరు నెటిజనులు ఈ సమస్యను సీపీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో తాజాగా సజ్జనార్ ట్రాన్స్‌జెండర్లకు పైవిధంగా హెచ్చరిక చేశారు. తాజాగా అమీర్‌పేటలోని సెస్ ఆడిటోరియంలో సుమారు 250 మంది ట్రాన్స్‌జెండర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలవంతపు వసూళ్లకు పాల్పడితే ట్రాన్స్‌జెండర్ల మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందని, వాటిని వినియోగించుకుని గౌరవప్రదంగా జీవనం సాగించాలని సూచించారు. తమ చేష్టలతో సామాన్యులను ఇబ్బంది పెట్టవద్దన్నారు. సీఐడీ, మహిళా భద్రతా విభాగ అడిషనల్ ఏడీజీ చారు సిన్హా మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్ల సమస్యలను పరిష్కరించడానికి మహిళా భద్రతా విభాగంలో ‘ప్రైడ్ ప్లేస్’ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. ట్రాన్స్‌జెండర్లకు ఎలాంటి సమస్యలు ఎదురైనా, వారిని ఎవరైనా వేధింపులకు గురిచేసినా వెంటనే ఈ వింగ్‌ను సంప్రదించవచ్చని సూచించారు. ట్రాన్స్‌జెండర్ల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి మహిళా భద్రతా విభాగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


