ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ దందాకు పాల్పడతే సహించం
రైతుల నుంచి సేకరించిన భూములు తిరిగి ఇచ్చేయండి
మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ హెచ్చరిక
రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: హైదరాబాద్ ఫార్మా సిటీ రద్దు వెనుక వేల కోట్ల కుంభకోణం జరుగుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది పక్కా రియల్ ఎస్టేట్ దందా అని ఆరోపించారు. ఫ్యూటచర్ సిటీ పేరుతో రియల్ దందాకు సిఎం రేంవత్ తెరలేపారన్నారు. ఫార్మా సిటీని రద్దు చేస్తే ఆ భూములను తిరిగి రైతులకు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్లలోని బీఆర్‌ఎస్ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఫార్మా సిటీని రద్దు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఎన్నికలకు ముందు చెప్పిందని, ఇబ్రహీంపట్నం, మహేశ్వరంతో పాటు ఇతర వేదికల ద్వారా రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తదతరులు స్పష్టంగా చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఫార్మా సిటీ రద్దు అని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటనలు చేశారు.
అయితే ఫార్మా సిటీ ఉన్నదా..? పోయిందా..? అని కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా సిటీ రద్దు కాలేదు.. అలాగే ఉందని బుధవారం హైకోర్టులో పిటిషన్ వేసింది. సీఎం ఎక్కడ మాట్లాడినా ఉన్న సిటీ గురించి మాట్లాడడం లేదు. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఫోర్త్ సిటీ అని మాట్లాడుతున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పు చేతనైతే.. నీ భాషలో చెప్పాలంటే మొగోడివి అయితే చెప్పు.. నీవు చెప్పే ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ కోసం ఒక్క ఎకరమైనా భూసేకరణ చట్టం కింద సేకరించావా..? మీరు ఒక్క ఎకరం భూమి సేకరించకపోతే, మేం గతంలో ప్రతిపాదించిన ఫార్మా సిటీ భూమే అయితే దాన్ని ఇతర అవసరాలకు ఎలా మళ్లిస్తావు..? చివరకు న్యాయమూర్తులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నావు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు అని కేటీఆర్ తెలిపారు. నువ్వు గతంలో చెప్పిన మాట ప్రకారం.. ఫార్మా సిటీని రద్దు చేసిన మాట నిజమే అయితే.. ఆ భూములను రైతులకు తిరిగిచ్చే పని చేయాలని డిమాండ్ చేశారు. ఫార్మా సిటీని కొనసాగిస్తే 14 వేల ఎకరాల్లో ఉండాలి లేదా రద్దు చేస్తే ఆ భూమి రైతులకు తిరిగి ఇవ్వాలన్నారు.
అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లా, కార్యకర్తల మాదిరి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చిన్న చిన్న పల్లెలను గ్రామపంచాయతీలుగా మార్చి 54 కొత్త రేషన్ దుకాణాలు ఏర్పాటు చేశామని. ఆ రేషన్ దుకాణాలను స్థానికంగా ఉండే పొదుపు సంఘాలకు అప్పజెప్పామనిన్నారు. కానీ ఇక్కడున్న కాంగ్రెస్ నాయకుడు తానే రాజు, తానే మంత్రి అన్నట్టు.. తానే ప్రభుత్వాన్ని నడుపుతున్న అన్నట్టు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. . ఆయనకు అధికారులు వంతపాడుతూ ఆగమాగం అవుతున్నార తెలిపారు. చట్టం ప్రకారం కాకుండా ఇష్టమొచ్చినట్టు చేస్తాం అంటే తప్పకుండా ఫలితం అనుభవిస్తారని తెలిపారు. చట్టం ప్రకారం, ఒళ్లు దగ్గర పెట్టుకోని పని చేయండి. ఇష్టమొచ్చినట్లు చేస్తామంటే ఊరుకోం. మరో నాలుగేండ్లలో మళ్లీ కేసీఆర్ తిరిగి వొస్తారు. సంగతి తప్పకుండా చూస్తాం అని కేటీఆర్ హెచ్చరించారు.




