ఆ మాటల అర్థం తెలంగాణ ద్రోహం, నిరంకుశత్వం!

“కొన్ని పదవులు అధిరోహించిన వ్యక్తులు కనీసం ఆ పదవికి ఉండే గౌరవాన్ని కాపాడడానికి, ఆ పదవికి ఉండవలసిన తటస్థ, ప్రజాస్వామిక స్థాయిని నిలపడానికి తమ నోటిని అదుపులో పెట్టుకోవలసి ఉంటుంది. తమ వాచాలత్వాన్ని సమయ సందర్భాలను బట్టి తగ్గించుకోవలసి ఉంటుంది. ఒక ప్రజాస్వామిక ప్రభుత్వంలో అధినేతగా ఉండే వ్యక్తి తన లోలోపల ఎంత దౌర్జన్య, నిరంకుశ ప్రవృత్తి ఉన్నా సౌమనస్యంగా, ప్రజాస్వామికంగా మాట్లాడవలసి ఉంటుంది. తనకు ప్రతిపక్షాలను తొక్కివేయాలని, పాతర వేయాలని కోరిక ఉన్నా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్రను గౌరవించవలసి ఉంటుంది. తాను ఏ సమాజానికి నాయకత్వం వహిస్తున్నాడో ఆ సమాజానికి తీరని ద్రోహం చేసిన వ్యక్తుల పట్ల తనకు వ్యక్తిగతంగా ఎంత అభిమానం ఉన్నా దాన్ని బహిరంగంగా ప్రకటించి ఆ సమాజాన్ని అవమానించకుండా ఉండవలసి ఉంటుంది. అయితే ఇవన్నీ నైతిక సూత్రాలు. ఇవాళ మన రాజకీయ రంగం నైతికత అంటే ఏమిటని ప్రశ్నించే స్థితిలో ఉంది.”

ఒక వ్యక్తి మాటలు వివాదాస్పదం అయినప్పుడు చాలా తరచుగా సామాజిక చర్చలలో అవి ఆ పదవికి తగిన మాటలు కావు అని ఆ మాటలన్న వ్యక్తినీ, ఆ వ్యక్తి కూచుని ఉన్న స్థానాన్నీ వేరు చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. అలా వ్యక్తినీ పదవినీ వేరు చేయడానికి వీలు లేదు. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదు అని సామెత చెప్పినట్టు కుర్చీ ఎక్కగానే స్వభావం ఏమీ మారిపోదు. కాని కనీసం స్వభావం మారకపోయినా మారినట్టు కనిపించవలసిన, ప్రదర్శించవలసిన, నటించవలసిన సందర్భాలు కొన్ని ఉంటాయి. కొన్ని పదవులు అధిరోహించిన వ్యక్తులు కనీసం ఆ పదవికి ఉండే గౌరవాన్ని కాపాడడానికి, ఆ పదవికి ఉండవలసిన తటస్థ, ప్రజాస్వామిక స్థాయిని నిలపడానికి తమ నోటిని అదుపులో పెట్టుకోవలసి ఉంటుంది. తమ వాచాలత్వాన్ని సమయ సందర్భాలను బట్టి తగ్గించుకోవలసి ఉంటుంది. ఒక ప్రజాస్వామిక ప్రభుత్వంలో అధినేతగా ఉండే వ్యక్తి తన లోలోపల ఎంత దౌర్జన్య, నిరంకుశ ప్రవృత్తి ఉన్నా సౌమనస్యంగా, ప్రజాస్వామికంగా మాట్లాడవలసి ఉంటుంది. తనకు ప్రతిపక్షాలను తొక్కివేయాలని, పాతర వేయాలని కోరిక ఉన్నా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్రను గౌరవించవలసి ఉంటుంది. తాను ఏ సమాజానికి నాయకత్వం వహిస్తున్నాడో ఆ సమాజానికి తీరని ద్రోహం చేసిన వ్యక్తుల పట్ల తనకు వ్యక్తిగతంగా ఎంత అభిమానం ఉన్నా దాన్ని బహిరంగంగా ప్రకటించి ఆ సమాజాన్ని అవమానించకుండా ఉండవలసి ఉంటుంది. అయితే ఇవన్నీ నైతిక సూత్రాలు. ఇవాళ మన రాజకీయ రంగం నైతికత అంటే ఏమిటని ప్రశ్నించే స్థితిలో ఉంది.

ఖమ్మం జిల్లా మద్దులపల్లిలో ఒక బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నమాటలు వినగానే ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి అటువంటి మాటలు అనవచ్చునా, అసలు తెలంగాణకు చెందిన వ్యక్తిగానైనా అటువంటి మాటలు అనవచ్చునా అని ప్రశ్నలు తలెత్తాయి. తెలంగాణ తన మౌనంతో ఎవరైనా ఒకరు ఇటువంటి మాటలు అనే ధైర్యాన్ని ఇస్తున్నదా అనిపించింది. ఆయన అన్నమాటలు తెలంగాణ అస్తిత్వానికీ, ఆత్మగౌరవానికీ, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్రకూ మాత్రమే కాదు, సాధారణ పౌర మర్యాదలకు కూడా అవమానకరమైనవి, అభ్యంతరకరమైనవి. తెలంగాణ గురించి కనీసమైన చరిత్ర తెలిసినవారెవరూ అంగీకరించదానికి వీలు లేనివి. తెలంగాణ సమాజానికి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు, తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదకరమైన రాజకీయ విధానాలు నడిపిన తెలంగాణ ద్రోహులను ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కీర్తించే ఒక దుస్థితి దాపురించింది.

రాజకీయ నాయకులందరికీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డికీ అటువంటి మాటలు అనడం వదులుకోలేని అలవాటుగా మారింది గనుక, అటువంటి మాటలే, ఎంత ఎక్కువ దిగజారిన మాటలైతే అంత సాధారణమైనవిగా, ఆకర్షణీయమైనవిగా భావించబడే దుస్థితిలోకి మన రాజకీయ రంగం చేరింది గనుక ఈ మాటలు కూడా ఒకటి రెండు రోజుల వివాదం తర్వాత మరుగున పడిపోతాయి. ప్రజా జ్ఞాపకం కురచది అయినందువల్ల మాత్రమే కాదు, రాజకీయ నాయకులు ఇంతకు మించిన అవమానకరమైన మాటలు మాట్లాడబోతారు గనుక.

“ఆనాడు పచ్చ జెండాను అణిచివేసిన బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు సమూలంగా వంద మీటర్ల గొయ్యి తీసి పాతిపెట్టాలి. ఆ పార్టీ నాయకులు గద్దెలు దిగాలి, గ్రామాల్లో ఆ పార్టీ దిమ్మలు కూలిపోవాలి’ అనడం అనేకరకాలుగా అర్థ రహితం, దుర్మార్గం, అప్రజాస్వామికం. నిజానికి తెలుగుదేశం పార్టీని తెలంగాణ నుంచి పంపించినది ఒక పార్టీ కాదు, మొత్తంగా తెలంగాణ సమాజం చైతన్యయుతంగా ఆ పని చేసింది. శాసనసభలో తెలంగాణ పేరు ఎత్తనీయకుండా, తెలంగాణ ఆకాంక్షలను గుర్తించకుండా, అంగీకరించకుండా తాత్సారం చేసిన స్వయంకృతాపరాధం వల్ల తెలుగు దేశం పార్టీ తెలంగాణ ప్రజలకు దూరమయింది. నిజం చెప్పాలంటే టి ఆర్ ఎస్ – బి ఆర్ ఎస్ తెలుగు దేశం వారసత్వాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా కొనసాగించింది. బి ఆర్ ఎస్ మీద ఎన్ని విమర్శలైనా ఉండవచ్చు, దాన్ని శిక్షించమని అడగవచ్చు (నిజానికి ఇప్పటికే తెలంగాణ ప్రజలు దాన్ని శిక్షించారు), కాని తెలుగుదేశంను లేకుండా చేయడం అనే చేయని పనికి దాన్ని శిక్షించమనడం ముఖ్యమంతి అవగాహనా రాహిత్యాన్ని మాత్రమే కాదు, చచ్చిపోయిన తెలుగు దేశం పార్టీ మీద మూఢ భక్తిని బహిరంగంగా ప్రదర్శించుకోవడం కూడా.”

telanganardham venugopalరాజకీయాలంటే సామాజిక వాస్తవాలు, సామాజిక సమస్యలు చర్చకు పెట్టి, వాటికి సృజనాత్మక పరిష్కారాలు సూచించడం అనే రాజనీతిశాస్త్ర అర్థం ఎప్పుడో మారిపోయి, ఆత్మస్తుతి, పరనింద, అబద్ధాలు, అర్ధసత్యాలు మాత్రమే రాజకీయాలుగా మిగిలాయి. ఆత్మస్తుతిలో తన పార్టీ గురించి ఎంత ఎక్కువ గొప్పలు చెప్పుకుంటే, ఎన్ని ప్రగల్భాలు పలికితే అంత గొప్ప రాజకీయ నాయకుడుగా గుర్తింపు వస్తుంది. పైగా తన పార్టీ అంటే కూడా తాను ఆ క్షణానికి ఉన్న పార్టీ అనే అర్థం. మొన్న ఏ పార్టీలో ఉన్నాడో, నిన్న ఏ పార్టీలో ఉన్నాడో, రేపు ఏ పార్టీలో ఉండబోతాడో తెలియని స్థితి ఉంది గనుక ఎప్పటికకెయ్యది ప్రస్తుతంబొ అన్నట్టు ఆక్షణం గురించి మాత్రమే, ఆ క్షణాన ఉన్న పార్టీ గురించి మాత్రమే మాట్లాడాలి. ఇక పర నింద అంటే మర్యాదపూర్వకమైన విమర్శ కాదు, ప్రజా ప్రయోజనాలు కాదు, అవతలి పార్టీని, ప్రత్యర్థిని ఎంత బండబూతులు తిడితే దాన్ని అంత పరనిందగా లెక్కిస్తారు. అబద్ధాలకూ అర్ధసత్యాలకూ అయితే లెక్కే లేదు. అసలు రాజకీయాల్లో ఉండడం అంటేనే నిర్లజ్జగా, రెండు వందల శాతం నిజం చెపుతున్న ముఖ కవళికలతో వెయ్యి శాతం అబద్ధాలు చెప్పడం అనే అర్థం స్థిరపడిపోయింది.

ముఖ్యమంత్రి మద్దులపల్లి ఉపన్యాసంలో ఈ సంప్రదాయాన్ని అక్షరాలా పాటించారు. ఆ సభ జరిగిన రోజు యాదృచ్ఛికంగా ఎన్ టి రామారావు వర్ధంతి కావచ్చు. కాని సభ ప్రత్యేకంగా అందుకోసం ఏర్పాటు చేసినట్టుగా లేదు. ఆ మండలంలో ఏవో అభివృద్ధి పనులకు శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి ముఖ్యమంత్రి వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభ అది. ఆ సభలో తెలుగు దేశం జెండాలతో కార్యకర్తలు పాల్గొన్నారంటే, అది ప్రభుత్వ సభ, కాంగ్రెస్ సభ అయినప్పటికీ ముందస్తుగానే కాంగ్రెస్ వ్యతిరేక ఎన్ డి ఎ భాగస్వామి తెలుగుదేశంతో లోపాయకారీ ఒప్పందం ఉండి ఉండవచ్చు. లేదా అక్కడికక్కడ తెలుగుదేశం జెండాలు చూడగానే, ఆ రోజు ఎన్ టి రామారావు వర్ధంతి కూడా గనుక రేవంత్ రెడ్డికి పాత వాసనలు రేకెత్తి ఉత్సాహం వచ్చి ఉండవచ్చు. ఒకప్పటి తన నాయకుడుగా, ఉమ్మడి రాష్ట్రపు ముఖ్యమంత్రిగా ఎన్ టి రామారావు వర్ధంతి సందర్భంగా లాంఛనప్రాయమైన నివాళి అర్పించడం కూడా తప్పకపోవచ్చు.

కాని ఆ సందర్భం తీసుకుని రేవంత్ రెడ్డి అన్న మాటలు మితిమీరినవి, అనవసరమైనవి, అవాంఛనీయమైనవి, తెలంగాణ సమాజమంతా తీవ్రంగా ఖండించవలసినవి. మొదటి స్థాయిలో ఆయన ఎన్ టి రామారావుకు మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడుకు, తెలుగు దేశం పార్టీకి తెలంగాణలో లక్షలాది అభిమానులున్నారనే ఒక అర్ధ సత్యం చెప్పారు. రెండో స్థాయిలో, ఆ తెలుగు దేశం పార్టీని లేకుండా చేయడానికి తెలంగాణ రాష్ట్ర సమితి లేదా భారత రాష్ట్ర సమితి కక్ష గట్టి, లేకుండా చేసిందని, అందువల్ల బి ఆర్ ఎస్ ను సమూలంగా వందమీటర్ల గొయ్యి తవ్వి పాతి పెట్టాలని, గ్రామాల్లో ఆ పార్టీ దిమ్మలు కూలగొట్టాలని పిలుపు ఇచ్చారు. బి ఆర్ ఎస్ పార్టీని రాజకీయంగా సమాధి చేసినప్పుడే ఎన్ టి రామారావుకు నివాళి అన్నారు. మూడో స్థాయిలో ఎన్టీఆర్, వైఎస్సార్ లను ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం అన్నారు.

ఎన్ టి రామారావుకు సినిమా నటుడిగా తెలంగాణలో అభిమానులు మిగిలి ఉండవచ్చు, లేదా చివరిరోజులలో అల్లుడి చేత వెన్నుపోటు తిని, అవమాన భారంతో మరణించారనే సానుభూతి ఉండవచ్చు. అటువంటి అభిమానులనూ, చంద్రబాబు నాయుడుకు తెలంగాణలో ఉన్నారని చెప్పే “సహచరులనూ అనుచరులనూ” ఒకే వాక్యంలో కలిపి చెప్పడం ఒక అబద్ధం. ఎన్ టి రామారావు పట్ల క్రూరమైన పరిహాసం. అసలు ఎన్ టి రామారావు వర్ధంతి రోజున చంద్రబాబు నాయుడు పేరు కలిపి చెప్పడమే ఒక పరిహాసం.

“వ్యక్తిగా రేవంత్ రెడ్డి అభిప్రాయాలు ఏవైనా కావచ్చు. ఆరు దశాబ్దాలు కలలతో, పోరాటాలతో, త్యాగాలతో తెలంగాణ ప్రజలు సాకారం చేసుకున్న రాష్ట్రపు ముఖ్యమంత్రిగా ఆయనకు తెలంగాణ ద్రోహులను కీర్తించే హక్కులేదు. ప్రజాస్వామిక ప్రభుత్వం అని చెప్పుకుంటున్న చోట ఇంత అప్రజాస్వామిక మాటలు మాట్లాడే హక్కు లేదు.”

సరే, అది తన పాత గురువులకు గురుదక్షిణ చెల్లించుకోవడంలో భాగం కావచ్చు. కాని “తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా చేయాలని కక్ష కట్టి, ఆ పార్టీ నాయకత్వాన్ని తీవ్రంగా దెబ్బతీసింది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. టీడీపీని తుడిచిపెట్టడానికి వారు చేయని ప్రయత్నం లేదు. ఆనాడు పచ్చ జెండాను అణిచివేసిన బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు సమూలంగా వంద మీటర్ల గొయ్యి తీసి పాతిపెట్టాలి. ఆ పార్టీ నాయకులు గద్దెలు దిగాలి, గ్రామాల్లో ఆ పార్టీ దిమ్మలు కూలిపోవాలి’ అనడం అనేకరకాలుగా అర్థ రహితం, దుర్మార్గం, అప్రజాస్వామికం. నిజానికి తెలుగుదేశం పార్టీని తెలంగాణ నుంచి పంపించినది ఒక పార్టీ కాదు, మొత్తంగా తెలంగాణ సమాజం చైతన్యయుతంగా ఆ పని చేసింది. శాసనసభలో తెలంగాణ పేరు ఎత్తనీయకుండా, తెలంగాణ ఆకాంక్షలను గుర్తించకుండా, అంగీకరించకుండా తాత్సారం చేసిన స్వయంకృతాపరాధం వల్ల తెలుగు దేశం పార్టీ తెలంగాణ ప్రజలకు దూరమయింది. నిజం చెప్పాలంటే టి ఆర్ ఎస్ – బి ఆర్ ఎస్ తెలుగు దేశం వారసత్వాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా కొనసాగించింది. బి ఆర్ ఎస్ మీద ఎన్ని విమర్శలైనా ఉండవచ్చు, దాన్ని శిక్షించమని అడగవచ్చు (నిజానికి ఇప్పటికే తెలంగాణ ప్రజలు దాన్ని శిక్షించారు), కాని తెలుగుదేశంను లేకుండా చేయడం అనే చేయని పనికి దాన్ని శిక్షించమనడం ముఖ్యమంతి అవగాహనా రాహిత్యాన్ని మాత్రమే కాదు, చచ్చిపోయిన తెలుగు దేశం పార్టీ మీద మూఢ భక్తిని బహిరంగంగా ప్రదర్శించుకోవడం కూడా.

సరే, తెలంగాణకు వ్యతిరేకంగా ఉండిన పార్టీ ఉనికి లేకుండా చేయడం అనేదాన్ని తప్పుగా చూపి, ఆ తప్పు చేసినందుకు భారత రాష్ట్ర సమితి ఉనికి లేకుండా చేయాలనడం అదే తప్పు చేయాలనడమే అవుతుంది గదా? అయినా ఒక పార్టీని గొయ్యి తీసి పాతి పెట్టండి, బొంద పెట్టండి అనే మాటలు ప్రజాస్వామిక రాజకీయాలలో తీవ్రంగా అభ్యంతరకరమైనవి. రేవంత్ రెడ్డి వెనక వచ్చిన కొమ్ముల తెలుగు దేశం పార్టీకి జరిగిన అవమానం గురించి మాట్లాడుతున్నప్పుడు, వాస్తవంగా ముందు వచ్చిన చెవుల వంటి తన మొదటి రాజకీయ మజిలీ ఆర్ ఎస్ ఎస్ భావజాలం గుర్తొచ్చినట్టుంది. సరిగ్గా సంఘ్ పరివార్ మావోయిస్ట్ ముక్త్ భారత్, కాంగ్రెస్ ముక్త్ భారత్ అని ప్రతిపక్ష రహిత భారత సమాజం గురించి పగటి కలలు కంటున్నది. అదే భావజాలంతో బి ఆర్ ఎస్ అనే ప్రతిపక్ష రహిత తెలంగాణ గురించి రేవంత్ రెడ్డి కలలు కంటున్నట్టున్నారు. ఇంకా విచిత్రంగా “బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా సమాధి చేసినప్పుడే నందమూరి తారక రామారావు గారికి మనము నిజమైన నివాళి అర్పించిన వాళ్లమవుతాము.. అప్పుడే తెలంగాణ రాజకీయాల్లో ప్రజాస్వామ్యం నిలబడుతుంది” అని ప్రతిపక్షం లేకపోవడమే ప్రజాస్వామ్యం అని తలకిందుల అభిప్రాయం ప్రకటించారు.

వర్ధంతి రోజు గనుక ఎన్ టి రామారావు ను తలచుకోవడంలోనైనా ఎంతో కొంత ఔచిత్యం ఉన్నదేమో గాని, వైఎస్సార్ ను తలచుకోవడం తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి అవమానం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులందరూ తెలంగాణకు అన్యాయం చేసినవారే, తెలంగాణ ద్రోహులే. ఆ జాబితాలో ఎన్ టి రామారావు, చంద్రబాబు నాయుడు, వై ఎస్ రాజశేఖర రెడ్డి అగ్రభాగాన నిలుస్తారు. ఆ ముగ్గురినీ పొగిడి తెలంగాణ ముఖ్యమంత్రి తానేమిటో చెప్పకనే చెప్పుకున్నారు.

వ్యక్తిగా రేవంత్ రెడ్డి అభిప్రాయాలు ఏవైనా కావచ్చు. ఆరు దశాబ్దాలు కలలతో, పోరాటాలతో, త్యాగాలతో తెలంగాణ ప్రజలు సాకారం చేసుకున్న రాష్ట్రపు ముఖ్యమంత్రిగా ఆయనకు తెలంగాణ ద్రోహులను కీర్తించే హక్కులేదు. ప్రజాస్వామిక ప్రభుత్వం అని చెప్పుకుంటున్న చోట ఇంత అప్రజాస్వామిక మాటలు మాట్లాడే హక్కు లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *