– హామీలు ఎగ్గొట్టి అటెన్షన్ డైవర్షన్ గేమ్‌లు
– బొగ్గు కుంభకోణాలు బయటపెడితే సిట్ నోటీసులిచ్చారు
– స్కామ్ పై ఆధారాలు చూపినా కేంద్రం పట్టించుకోదు
– ఇప్పుడు ఫోన్లు ట్యాప్ కావడంలేదని డీజీపీ చెప్పగలరా?
– ఏతప్పూ చేయలేదు.. సిట్‌కు హాజరవుతా
– బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సిరిసిల్ల, ప్రజాతంత్ర, జనవరి 22: రేవంత్ రెడ్డి సిట్ ఒక డెయిలీ సీరియల్ అని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. సిరిసిల్లలో గురువారం మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి పరిపాలన రాదు, చేతగాదు, అసమర్థుడు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే తెలివి లేదు. 420 హామీలు ఇచ్చి అడ్డగోలు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఏదో ఒక రూపంలో అటెన్షన్ డైవర్షన్ గేమ్స్ ఆడాలి. అందులో భాగంగా కాళేశ్వరం కుంభకోణం అని కొన్ని రోజులు డ్రామా, తర్వాత ఫోన్ ట్యాపింగ్. అట్లనే కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అని డ్రామా. కొన్ని రోజులు ఫార్ములా-ఇ అని అన్నారు. ఈ రెండేళ్లు ఈ డ్రామాలు తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాధించింది, ప్రజలకి ఇచ్చింది ఏమి లేదన్నారు. రేవంత్ రెడ్డి బావమరిది ఆధ్వర్యంలో సింగరేణిలో బొగ్గు కుంభకోణాలు ఎట్లా జరుగుతున్నాయో మొన్న హరీష్ రావు బయటపెడితే సాయంత్రంకల్లా సిట్ నోటీసు ఇచ్చారన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వారి కొడుకు గుండాగాళ్లను తీసుకొనిపోయి భూములు కబ్జా చేస్తా ఉన్నాడు.. వారి మీద సిట్ వేయండన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి డైరెక్ట్ గా బొగ్గు కుంభకోణాలు చేస్తున్నాడని ఆధారాలతో చూపెడితే వారి మీద సిట్ ఉండదు, ఏ విచారణ ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం కంప్లైంట్ చేస్తే కేంద్రం సిబిఐ విచారణకు ఆదేశిస్తుందని కిషన్‌రెడ్డి చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. దోపిడీ చేసిన దొంగ నేను దొంగతనం చేసినాను అని చెబుతాడా పోలీస్ స్టేషన్ లో? దొంగ అని చెప్పి మేము ఆధారాలతో సహా చూపెడుతుంటే కాదు దొంగనే ఫిర్యాదు చేయాలి, చేస్తే మేము విచారణకు ఆదేశిస్తామనడం ఎబ్బెట్టుగా వున్నదన్నారు. సృజన్ రెడ్డి కంపెనీకి అర్హత లేకపోయినా కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ లో కాంట్రాక్టులు ఏవైతే దక్కించుకున్నారో ఆధారాలతో ఢిల్లీకి పోయి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ఇచ్చాను. దాని మీద సిట్ వేయండని కోరారు. గచ్చిబౌలి భూముల్లో 10 వేల కోట్ల కుంభకోణం జరిగింది, దీని మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేయమని సుప్రీం కోర్ట్ అపాయింట్ చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేసింది. ఎందుకు కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు? ఎందుకు రేవంత్ రెడ్డిని కాపాడుతున్నదని ప్రశ్నించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చిన ప్రతిసారి చెప్తారు ఇక్కడ ‘ఆర్ఆర్ టాక్స్’ అమలవుతుంది అంటారు. దీనిపై సిట్ ఉండదు, దాని మీద విచారణ ఉండదు. బొగ్గు కుంభకోణం జరిగిందయ్యా అని ఆధారాలు ఇస్తే దాని మీద సిట్ ఉండదు. మమ్మల్ని మాత్రం పిలుస్తున్నారు. మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి మేము ఏ రకంగా కూడా ఎవరికీ నష్టం చేయలేదు కాబట్టి ముమ్మాటికీ విచారణకు వెళ్తాం అని కేటీఆర్ చెప్పారు.
మా ఎమ్మెల్యేలను కొంటూ రూ.50 లక్షలతో 2015లో ఒక సన్నాసి దొరికిండు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అని జర్నలిస్టులకు చెప్తే జర్నలిస్టులు దాని మీద వార్తలు రాస్తే ఇంతవరకు ప్రభుత్వం ఖండించలేదని కేటీఆర్ విమర్శించారు. ఇప్పుడు ఫోన్లు ట్యాప్ కావడంలేదని డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీ రూఢీగా చెప్పగలరా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ దేశ భద్రతకు, శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రభుత్వాల స్థిరత్వానికి సంబంధించి పోలీసులు రొటీన్ గా చేసే కార్యక్రమం. ఇందులో రాజకీయ నాయకులకు పాత్ర వుండదన్నారు. గతంలో ఇంటెలిజెన్స్ ఐజీగా పని చేసి ప్రస్తుతం డిజిపిగా ఉన్న శివధర్ రెడ్డిని పిలవాలి.. ఆయనకు తెలుస్తది ఎవరి ఫోన్లు ట్యాప్ చేశారో, మాకేం తెలుస్తది.. గతంలో డిజిపిగా పని చేసిన మహేందర్ రెడ్డికి తెలుస్తది. మొన్నటిదాకా డిజిపిగా పని చేసిన జితేందర్.. ఆయన గతంలో హోం సెక్రటరీ.. ఆయనకు తెలుస్తది. ఎవరిని పిలవాలో వాళ్ళని పిలవకుండా ఇందులో మాకేదో సంబంధం ఉన్నట్టు కార్తీక దీపం సీరియల్ లాగా ఒడవని అంతులేని కథ లాగా కేవలం టైం పాస్ కోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మొన్న హరీష్ రావుని పిలిస్తే కొత్త విషయాలు ఏమో చెప్తారేమో అనుకున్నా. అడిగిందే అడుగుడు, తిర్లమర్ల చేసి అడుగుడు. రేపు బరాబర్ పోతా, బరాబర్ మళ్ళా చెప్పి వస్తా. నేను సిట్ వాళ్ళను మీరు నా ఫోన్ ఇవాళ ట్యాప్ అవుతుందో లేదో చెప్పరి ముందు అని అడుగుతానన్నారు. రెండేళ్లయింది ఈ కేసు విచారణ ప్రారంభించి. ఎవరైనా ఒక అధికారి ప్రెస్ మీట్ పెట్టిండా? ఎవరైనా మంత్రి మాట్లాడిండా? ఎడికెళ్లి వస్తున్నాయి ఇవన్నీ అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఈ హౌల పనులు బంద్ చేయమని చెప్తున్నానన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





