ఇది రైతులు సాధించిన విజయం

విత్తన రైతులకు పరిహారం పంపిణిలో మంత్రి సీతక్క

ములుగు, ప్రజాతంత్ర, జులై 7: మల్టీనేషనల్‌ కంపెనీలతో పోరాడి విత్తన రైతులకు నష్టపరిహారం చెల్లించేలా చూశామని, ఐదారు నెలలుగా ఈ సమస్యపై రైతులు పోరాటం చేశారని, చాలా కష్టపడి పనిచేసిన కలెక్టర్‌ దివాకర్‌ను అభినందిస్తున్నానని మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్‌, గ్రామీణాబివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. ములుగు జిల్లా వాజేడు మండలం నాగారం గ్రామంలోని ఐటీడీఏ స్కిల్‌ డెవలప్మెంట్‌ సెంటర్లో విత్తన రైతులకు పరిహార చెక్కుల పంపిణి కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఇక్కడ ఐదారు కంపెనీలు ఉన్నాయని, వారందరినీ ఒప్పించి నష్టపరిహారం చెల్లించేలా చూశామని చెప్పారు. సీడ్‌ రైతులు కంపెనీలతో జాగ్రత్తగా ఉండాలని, అన్ని అనుమతులు ఉన్న కంపెనీలతోనే ఒప్పందాలు చేసుకుని కలిసి పనిచేయాలని, నష్టపోయి ఆత్మహత్యలు చేసుకోవద్దు అని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నదని, రుణ మాఫీ, భరోసా, సన్నాలకు బోనస్‌ వంటివి తెచ్చిందని, దళారులను నమ్మి మోసపోవద్దు అని రైతులకు సూచించారు. రైతులను మోసం చేసి ఆర్గనైజర్లు బాగా సంపాదించుకున్నారంటూ ఆర్గనైజర్ల ముసుగులో బీఆర్‌ఎస్‌ నేతలున్నారు.. రైతులను మోసం చేసే ఆర్గనైజర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం అని మంత్రి హెచ్చరించారు. ఆర్గనైజర్లు రైతులకు డబ్బులు ఇవ్వకుండానే ఇచ్చినట్లు రాసుకున్నారని, అలాంటి దందాలు ఇక మానుకోండి లేదంటే బాగోదు అని అన్నారు.  ట్రైబల్‌ ప్రాంత ఎమ్మెల్యేలంతా సీఎంను కలిసి తమ ప్రాంతంలో అదనంగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కోరితే ఇచ్చారు అని చెప్పారు.  గిరిజన ప్రాంతంలో నకిలీ పదం వినిపిస్తే సహించేది లేదు అని మంత్రి సీతక్క హెచ్చరించారు.

దొరంకారంతో కేటీఆర్‌ రాజకీయాలు : మీడియాతో  సీతక్క

ములుగు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను తట్టుకోలేక బీఆర్‌ఎస్‌ కుట్రలు చేస్తోందని, కేటీఆర్‌ ప్రొద్బలంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అట్టడుగు వర్గాల బిడ్డల నాయకత్వాన్ని దొరలు సహించలేకపోతున్నారని కేటీఆర్‌పై మంత్రి సీతక్క ఫైర్‌ అయ్యారు. దురహంకారంతో, దొరంకారంతో తనలాంటి అట్టడుగు వర్గాల బిడ్డను టార్గెట్‌ చేస్తూ రాజకీయాలు చేస్తున్నారన్నారు. సీడ్‌ రైతులకు పరిహారం పంపిణీ కార్యక్రమానికి ముందుగా ఆమె మీడియాతో మాట్లాడారు. ‘పక్క నియోజకవర్గాల నుంచి లీడర్లను దింపి ధర్నాలు చేయిస్తున్నారు.. నా మీద తప్పుడు ఆరోపణ చేసిన వాళ్ళు ఎవరూ బాగుపడలేదు.. మీ బిడ్డ జైలుకు వెళ్లింది.. నేను ఎవరి జోలికి వెళ్ళను. నా జోలికొస్తే ఆ తల్లి సమ్మక్క దయతో రాజకీయంగా నాశనమవుతారు’ అని హెచ్చరించారు. తన ఫోన్‌ ట్యాప్‌ చేశారంటూ నీ సొంత చెల్లెలే బాధపడుతోంది.. సొంత చెల్లి ఫోనును ట్యాప్‌ చేసిన నీకు నీతి ఉందా అని ప్రశ్నించారు. సొంత చెల్లిని వేధించిన కేటీఆర్‌కు ఆదివాసీి అటవీబిడ్డ ఒక లెక్కనా? అందుకే తన మీద దొంగ లేఖలు రాయిస్తూ తన ఇమేజ్‌ను దెబ్బతీయాలని కుట్రలు పన్నుతున్నారన్నారు. చావులపై రాజకీయాలు చేయడమే బీఆర్‌ఎస్‌ పని.. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ రెచ్చగొట్టి పేదలను చావులపాలు చేశారు.. వీళ్ళు మాత్రం దర్జాగా బతికారు.. ఇప్పుడు అదే చేస్తున్నారు.. బీఆర్‌ఎస్‌ తీరును ప్రజలు గమనిస్తున్నారు’ అని సీతక్క పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రేరేపించడం వల్లే గతంలో నాగయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.. బీఆర్‌ఎస్‌ హయాంలో పేదలకు ఇండ్లివ్వలేదు.. మేం ఇస్తే ర్వలేకపోతున్నారు.. అన్ని నియోజకవర్గాలలో 3500 ఇండ్లు ఇసే ములుగు నియోజకవర్గంలో ఐదు వేల ఇండ్లను మంజూరు చేయించానన్నారు.  తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై కేసులు నమోదు చేయలేదన్నారు. పదేళ్లలో రైతులు నష్టపోతే నయా పైసా పరిహారం ఇవ్వలేదు.. తమ ప్రభుత్వం విత్తన కంపెనీల మెడలు వంచి రూ.5ు కోట్ల నష్టపరిహారాన్ని రైతులకు అందిస్తున్నాం.. రైతులను ఆదుకునే కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు డ్రామాలు చేస్తున్నారు.. తమలాంటి బిడ్డలు ఎదగొద్దు అని దొరలు కుట్రలు పన్నుతున్నారంటూ దొరల కుట్రలను తిప్పికొడతాం అని సీతక్క అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *