– సర్వేలో 3వేల మంది అనర్హుల గుర్తింపు
– మానవీయ కోణంలో భూ సమస్యలకు పరిష్కారం చూపాలి
– రెవెన్యూ, అటవీ అధికారులు సమన్వయంతో పనిచేయాలి
– రెవెన్యూ, హౌసింగ్ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: పేద ప్రజలు దశాబ్దాల కాలంగా సాగుచేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పించే విషయంలో మానవీయ కోణంలో ఆలోచన చేయాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. డాక్టర్ బి.ఆర్, అంబేద్కర్ సచివాలయంలో నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో భూ సమస్యలపై అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పొంగులేటి మాట్లాడుతూ చిన్నచిన్న సమస్యలను సాకుగా చూపి సమస్యలను జఠిలం చేయవద్దని అటవీ శాఖ అధికారులకు సూచించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 40-50 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న భూములపై గిరిజనులకు హక్కులు కల్పించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, అయితే వివిధ నిబంధనలు చూపుతూ ఆ భూములు అటవీ శాఖకు చెందినవని అటవీ అధికారులు కొర్రీ వేస్తున్నారని అన్నారు. ఈ అంశంపై రెవెన్యూ, ఫారెస్ట్ విభాగాలు సమన్వయంతో పనిచేసి వీలైనంత త్వరగా పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూభారతి పైలట్ ప్రాజెక్టులో భాగంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి(సాగర్) మండలాన్ని ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా సర్వే నిర్వహించినట్లు, ఈ పైలట్ ప్రాజెక్టు కోసం 235 సర్వే నెంబర్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. మొత్తం 23వేల ఎకరాలో సర్వే నిర్వహించగా అందులో 12వేల ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తించినట్లు, ఇందులో ఎనిమిదివేల ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. వీటిలో నాలుగు వేల ఎకరాలు పాస్‌పుస్తకాలతో సాగులో ఉన్నాయని వివరించారు. మిగిలిన 4037 ఎకరాలకు సంబంధించి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాల్సి ఉందని అన్నారు. సర్వేలో 2936 ఎకరాలకు సంబంధించి 3069మంది వద్ద బోగస్ పాస్ పుస్తకాలు ఉన్నట్లు గుర్తించి వాటిని రద్దు చేశామని తెలిపారు. వీరికి రైతు భరోసా, రైతు బీమా తదితరాలను రద్దు చేశామన్నారు. ఈ భూములకు సంబంధించిన వివాదాలను వీలైనంత త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు మంత్రి పొంగులేటి సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





