– ఇరాన్‌పై యుద్దంలో తుది దశకు చేరుకున్నాం
– సైనిక చర్యలను తగ్గించే విషయం పరిశీలిస్తున్నాం
– ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్
– ఇరాన్ చమురు అమ్మకాలపై ఆంక్షలు ఎత్తివేత
వాషింగ్టన్, మార్చి 21 : పశ్చిమాసియాలో కొనసాగుతోన్న యుద్ధంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆయిల్, గ్యాస్ నిల్వలు తగ్గడం, రవాణా ఆగిపోవడంతో ప్రపంచ దేశాల ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో యుద్దం ఆగాలని ప్రపంచం అంతా కోరుకుంటోంది. ఈ క్రమంలో ఇరాన్‌తో యుద్ధం ముగించే విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై సైనిక చర్యను క్రమంగా తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అయితే కాల్పుల విరమణకు మాత్రం తాను సిద్ధంగా లేనని పేర్కొనడం గమనార్హం. ఇరాన్‌పై సాధించిన సైనిక విజయాలను వివరిస్తూ ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఒక పోస్టు పెట్టారు. ఇరాన్‌పై తమ లక్ష్యాలను చేరుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నామన్నారు. తమ సైనిక చర్యను ముగించే విషయంపై ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆ దేశ క్షిపణి సామర్థ్యాలను, వైమానిక, నావికా వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఆ దేశం మరోసారి అణ్వాయుధాలను తయారు చేయకుండా అమెరికా చూసుకుంటుందన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే తాము తగినవిధంగా స్పందిస్తామని హెచ్చరించారు. ఇక, అమెరికా దాని మిత్ర దేశాలకు భద్రత కల్పించిందని ట్రంప్ అన్నారు. ’ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ సహా పశ్చిమాసియాలోని మిత్ర దేశాలకు అత్యున్నత స్థాయిలో రక్షణ కల్పిస్తున్నాం అని అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా హర్మూజ్ జలసంధి గురించి కూడా ట్రంప్ కీలక ప్రకటన చేశారు. దీనిపై ఆధారపడిన దేశాలు నౌకల సురక్షిత ప్రయాణానికి బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. అమెరికా రక్షణ కల్పించదని స్పష్టం చేశారు. ఒకవేళ తమ సాయం కోరితే సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇరాన్ ముప్ప్పు తొలగిపోయిన తర్వాత ఆ అవసరం ఉండదన్నారు. సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ చమురుపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ దేశ చమురు అమ్మకాలకు 30 రోజుల మినహాయింపు జారీ చేసింది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఈ విషయాన్ని ప్రకటించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు సరఫరాను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ తాత్కాలిక చర్యతో 14 కోట్ల బ్యారెళ్ల ఇరాన్ చమురు ప్రపంచ మార్కెట్లలోకి వస్తుందన్నారు. ఇప్పటికే సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ చమురు విక్రయించ డానికి మాత్రమే ఈ అనుమతులు వర్తిస్తాయని స్పష్టం చేశారు. అమెరికా మినహాయింపులపై ఇరాన్ స్పందించింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేసేందుకు తమ వద్ద అదనపు ముడి చమురు లేదని టెహ్రాన్ తెలిపింది. ఈమేరకు ఇరాన్ ఇంధన మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎక్స్‌లో పోస్టు పెట్టారు. చమురు సరఫరాపై ఆందోళనలు తగ్గించేందుకే యూఎస్ ఇలాంటి ప్రకటన చేసిందన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



