ధరల స్థిరీకరణ ప్రణాళికలు ఉండాలి

బడ్జెట్‌ అం‌టే పన్నులతో పీక్కు తినడం అన్న భావన రూఢీ అయ్యింది. ఎక్కడి నుంచి ఏ రూపంలో ఎంత వసూలు చేయవొచ్చు అన్న లెక్కలు కట్టి..దానికి కొంత జోడించి…కొన్ని పనులను కొంత కేటాయింపులు చేసి చూపడమే బడ్జెట్‌. ఈ ‌లెక్కల ప్రకారం వొచ్చే ఆదాయానికి, చెల్లించే ఖర్చులకు లెక్కల పొంతన కుదరాలి. నిజానికి ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని దేశాన్ని నడపడానికి ఉపయోగించాలి. జీతాలు, హాస్పిటల్స్ , విద్యా, రైలు, రోడ్డు తదితర అభివృద్ది పనులకు వినియోగించాలి. అంతేగాని ఉచిత పథకాలతో దుబారా చేయరాదు. పన్నులు కూడా హేతుబద్దంగా ఉండాలి. ప్రజల నడ్డి విరిచేలా పన్నులు ఉంటే…వారు పన్నులు కట్టలేని దుస్థితి ఏర్పడుతుంది. ఇకపోతే ప్రజలు సంపాదించుకున్న డబ్బుల్లో నేరుగా 30 శాతం ప్రభుత్వం లాగేసుకుంటుంది. ఉద్యోగుల నుంచి కూడా టిడిఎస్‌ ‌ద్వారా నేరుగా లాగేసుకుంటుంది. అంటే మనం ఎంత సంపాదించినా ముందుగా 30 శాతం విదిలించుకోవలసిందే .

అలాగే మనం పెట్టుకునే ఖర్చులకు లెక్కలు చెప్పుకోవాలి. ఇలా ఏటా మన సంపాదన నుంచి కాబూలీవాలా వడ్డీ లాగా చెల్లించుకోవాల్సిందే. తేడా వొస్తే ప్రభుత్వం వారు దాడి చేసి, కేసులు పెట్టి వేధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా మన ఆర్థిక చట్టం నిర్దేశించుకున్నాం. అందుకే ఇన్‌కమ్‌ ‌ట్యాక్స్ అనగానే ఉద్యోగులు,  వ్యాపారులు భయపడుతుంటారు. నిజానికి ఇలాంటి భయాలు లేని ఆదాయపు చట్టం రావాలి. పెరుగుతున్న ధరల నేపథ్యంలో వాటిని ఎలాగో  కంట్రోల్‌ ‌చేయడం లేదు. కనీసం పన్నుల భారం అయినా తగ్గుతుందా అంటే అదీ ఉండడం లేదు. కట్టిన డబ్బులతో అధికారంలో ఉన్న నేతలు వారి జల్సాలకు ఎక్కువగా వినయోగిస్తున్నారు. మంత్రులు, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలకు కూడా మనం చెల్లించే పన్నుల నుంచే  జీతభత్యాలు చెల్లించాలి. ఉద్యోగులకు కూడా జీతాలు, పెన్షన్లు కూడా ఇందులో నుంచే ఇవ్వాలి. ఇవి గాకుండా దేశంలో ఏ పని చేపట్టాలన్నా ఇందులో నుంచే ఖర్చు చేయాలి. ఇవన్నీ సమతూకం పాటించేలా, లెక్కలు బేరీజు వేసుకుని బడ్జెట్‌ ‌రూపొందిస్తారు.

          దేశ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న బడ్జెట్‌ ‌సమావేశాలు ప్రారంభం అయ్యాయి. శుక్రవారం రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్‌ ‌సమావేశాలు ప్రారంభం అయ్యాయి.ఫిబ్రవరి 1న అంటే శనివారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ‌వరసగా 8వ సారి బడ్జెట్‌ ‌ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఏటా లాగానే పేద, మధ్యతరగతి ప్రజలు తమకు చేకూరే లబ్ది గురించి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే చాలా మందికి బడ్జెట్‌ ‌లెక్కలు పెద్దగా అర్థం కావు. బడ్జెట్‌లో దేనికి పెంచారు..దేనికి తగ్గించారు అని చూస్తుంటారు. సిగరెట్లు, మద్యం వంటి వాటికి ఏటా పన్నుపోటు తప్పదు. ఎలక్టాన్రిక్స్ ‌తదితర దిగుమతి వస్తువలపైనా సుంకాలు పెంచుతూనే ఉంటారు. ఇలా పత్రికల్లో వొచ్చిన, లేదా టీవీల్లో వొచ్చిన వార్తల ఆధారంగా ప్రజలు బడ్జెట్‌ ‌గురించి బేరీజు వేసుకుంటారు. తమ జేబులకు ఎంత చిల్లు పడబోతున్నదో లేక్కలేసుకుంటారు. స్థూలంగా చెప్పాలంటే బడ్జెట్‌ ఇదే. కొన్ని ప్రధాన అంశాలపై దృష్టి పెట్టగలిగితే బ్జడెట్‌ ‌గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుంది. వాటిలోని గణాంకాలను అర్థం చేసుకోగలిగితే ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేందుకు దేనిపై దృష్టి పెట్టాలో అర్థమవుతుంది.
రుణాలు కాకుండా ప్రభుత్వ మొత్తం ఖర్చులు దాని ఆదాయాన్ని మించిపోయినప్పుడు ఆర్థికలోటు ఏర్పడుతుంది. అప్పులు తెచ్చి వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ 2024 ‌నుంచి మార్చి 2025 వరకూ ఉంటుంది. ఇందులో రాబడి ఎంత..ఖర్చులు ఎంత అన్నది లెక్కలు వేస్తారు.బడ్జెట్ లో ఆర్థికలోటును జీడీపీలో 4.9 శాతంగా కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. దీంతో వొచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక లోటుపై కేంద్రం ఏం చెప్తుందోనని మార్కెట్‌ ‌వర్గాలు ఆసక్తిగా ఎదరుచూస్తున్నాయి. అంటే ఈ లోటు ఎలా పూర్తి చేస్తారన్నదే ఇక్కడ ప్రశ్న. అందుకు పన్నులు వేయడం వంటివి ప్రధానంగా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం తన ఆర్థిక లోటును తీర్చుకునేందుకు పలు రకాలుగా రుణాలు సేకరిస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం స్థూల రుణ బడ్జెట్‌ ‌రూ. 14.01 లక్షల కోట్లుగా ఉంది. కాగా, వొచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన స్థూల రుణ బ్జడెట్‌ ‌గురించి మార్కెట్‌ ‌వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కేంద్రం పన్నుల ద్వారా ప్రభుత్వ నిర్వహణకు అవసరమయ్యే ఆదాయం సమకూర్చుకుంటుంది. 2024-25 బ్జడెట్‌లో స్థూల పన్ను ఆదాయాన్ని రూ.38.40 లక్షల కోట్లుగా కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది.
దీంట్లో ప్రత్యక్ష పన్నుల ద్వారా రూ.22.07 లక్షల కోట్లు, పరోక్ష పన్నుల ద్వారా రూ.16.33 లక్షల కోట్లు వొస్తాయని అంచనా వేశారు.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం రూ.11.1 లక్షల కోట్లుగా కేంద్రం అంచనా వేసింది. అయితే లోక్‌సభ ఎన్నికల సందర్భంగా 2024 మొదట్లో ఖర్చులు బాగా నెమ్మదించాయి. దీనికి ఎన్నికల కోడ్‌ ‌కారణమనే చెప్పొచ్చు. కాగా, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్లో మూలధన వ్యయం ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది కేంద్రం వివిధ పథకాలు, అభివృద్ధి పనుల కింద ఎంత ఖర్చు చేయనుందో బడ్జెట్‌ ‌సమావేశాల్లో తెలియనుంది. 2024లో సాధారణ ప్రభుత్వ రుణం- జీడీపీ నిష్పత్తి 85 శాతం ఉండగా.. అందులో ఒక్క కేంద్ర ప్రభుత్వ రుణమే 57 శాతంగా ఉంది. నిర్మలా సీతారామన్‌ 2024-25 ‌బడ్జెట్‌ ‌ప్రసంగంలో 2026-27 నుంచి జీడీపీలో ద్రవ్యలోటు తగ్గించేందుకు నిరంతరం ప్రయత్నిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.
వస్తు, సేవల పన్ను అంటే జీఎస్టీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.10.62 లక్షల కోట్లకు చేరుకుంటుందని అధికార వర్గాలు అంచనా వేశాయి.  2025-26 ఆర్థిక సంవత్సరానికి జీఎస్టీ రాబడి భారీగానే ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారతదేశ జీడీపీ వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 10.5 శాతంగా కేంద్రం అంచనా వేసింది. కాకపోతే వాస్తవ జీడీపీ వృద్ధి 6.4 శాతంగా ఉంటుందని ఆర్థిక పండితులు చెబుతున్నారు. అయితే జీఎస్టీ పన్నులు తలకు మించిన భారం గా ఉన్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్, ‌జనరల్‌ ఇన్సూరెన్స్ ‌లాంటి వాటిపైనా 18శాతం జిఎస్టీ విధించడం వల్ల సామాన్యులు గగ్గోలు పెట్టినా కేంద్రం పట్టించుకోలేదు. మొత్తంగా పన్నుల హేతుబద్దీకరణ పాటు, ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేసినప్పుడే ప్రజలకు ఊరట కలుగుతుంది. అలాగే ధరల స్థిరీకరణకు  చర్యలు కూడా అవసరం. ఈ రకమైన చర్యలు లేకుండా ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజలకు ఒనగూరే ప్రయోజనం ఉండదు.
-ప్రజాతంత్ర డెస్క్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *