* ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చి దిద్దడంపై మేధోమథనం
* ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కు ధీటుగా సర్కార్ బడులను మార్చాలి
* ‘విద్యా రంగంలో సంస్కరణలు’ మంత్రి వర్గ ఉప సంఘం భేటీలో మంత్రి శ్రీధర్ బాబు
గత పదేళ్లలో రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థ ముఖ చిత్రాన్ని మార్చాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఇది ప్రజల కోసం పని చేసే ప్రభుత్వమని, మాటల్లో కాదు చేతల్లో మార్పును చూపిస్తామని స్పష్టం చేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై తల్లిదండ్రులు, సంబంధింత యాజమాన్యాల అభిప్రాయాలు సేకరించామని, త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని వివరించారు. సోమవారం ఆయన అధ్యక్షతన ‘విద్యా రంగంలో సంస్కరణలు’ అనే అంశంపై నియమించిన మంత్రివర్గ ఉప సంఘం సచివాలయంలో తల్లిదండ్రులు, ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యం, విద్యా శాఖాధికారులతో సుమారు అయిదు గంటల పాటు సుదీర్ఘంగా భేటీ అయ్యింది. ఈ సమావేశంలో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై ప్రధానంగా చర్చించారు. అలాగే.. రాబోయే రోజుల్లో తెలంగాణ విద్యా వ్యవస్థ దేశంలోనే ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా ఉండేందుకు తీసుకోవాల్సిన కార్యాచరణపై మంత్రి వర్గ ఉప సంఘం చర్చించింది.
ఇతర రాష్ట్రాల అధికారులు మన దగ్గరికొచ్చి అధ్యయనం చేసేలా మార్పు తీసుకరావాలని సంబంధిత యంత్రాంగానికి సూచించింది. ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి సంకల్పమని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. సర్కార్ బడులపై తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని పెంపొందించి, వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఇక్కడి విద్యార్థులను చిన్నతనం నుంచే ఏఐ లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో నిపుణులు తీర్చి దిద్దేలా కరిక్యులమ్ లో మార్పులు చేస్తున్నామన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సర్కార్ బడుల్లో పని చేసే ఉపాధ్యాయులను అత్యుత్తమ నైపుణ్య మానవ వనరులుగా తీర్చి దిద్దేందుకు కావాల్సిన శిక్షణపై సమావేశంలో చర్చించామన్నారు. ఇప్పటికే డీఈవోలకు మూడ్రోజుల పాటు ప్రత్యేక క్యాంప్ నిర్వహించామని, సత్ఫలితాలొచ్చాయని ఈ సందర్భంగా అధికారులు వివరించారని తెలిపారు. డీఈవో, ఎంఈవోలు క్షేత్రస్థాయిలో నిరంతరం తనిఖీలు నిర్వహించి లోపాలను సరి చేయాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ప్రైవేట్ విద్యా సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.
విద్యార్థుల భద్రత ముఖ్యమని, ఆ అంశంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో గ్రేడింగ్ కొనసాగిస్తారా… మార్కులు ఇస్తారా.. లేదా ఈ ఏడాది మాదిరిగానే రెండింటిని కొనసాగిస్తారా అనే అంశంపై తల్లిదండ్రులు, విద్యార్థులకు ముందు నుంచే అవగాహన కల్పించాలని విద్యా శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలిచ్చే విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. రైట్ టూ ఎడ్యూకేషన్ యాక్ట్(ఆర్టీఈ)ను తప్పనిసరిగా అమలు చేస్తామని, ఇందుకోసం ఎంత బడ్జెట్ అయినా కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విద్యార్థులకు మరింత పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యూనివర్సిటీల్లో కామన్ డిటెన్షన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు ప్రారంభించామన్నారు. ఒకే రకమైన ఎగ్జామ్ ఫీజును కూడా రూపొందిస్తామన్నారు. 2025-26 నుంచి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా వేయి ప్లే స్కూల్స్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రారంభించబోతున్నట్లుగా చెప్పారు. ప్రైవేట్ సంస్థలను భాగస్వామ్యం చేసి సీఎస్ఆర్ నిధులతో వీటిని దేశంలోనే రోల్ మోడల్ గా తీర్చి దిద్దుతామన్నారు. ఇక్కడి కరిక్యులమ్, ట్రైనింగ్ మెటీరియల్ ను ఎస్ సీఈఆర్ టీ నిపుణుల భాగస్వామ్యంతో రూపొందించిందన్నారు. సమావేశంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, విద్యా శాఖ ఉన్నతాధికారులు యోగితా రాణా, దేవసేన, హరిత, నర్సింహా రెడ్డి, కృష్ణాదిత్య, ట్రస్మా ప్రతినిధులు ఎస్ఎన్ రెడ్డి, మధుసూదన్, హెచ్ఎస్పీఏ నుంచి వెంకట సాయినాథ్, ఇస్మా ప్రతినిధులు సునీల్ కుమార్, వైసీ చౌదరి, ముస్లిం మైనార్టీ అసోసియేషన్ నుంచి అన్వర్ అహ్మద్, క్రిస్టియన్ అసోసియేషన్ తరఫున బాలశౌరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



