న‌లుగురు మంత్రులున్నా ఫ‌లితం లేదు

– చేజారిన క‌రీంన‌గ‌ర్ కార్పొరేష‌న్‌
– అతి విశ్వాస‌మే కొంప ముంచిందా?
– క‌రీంన‌గ‌ర్‌లో బ‌లం లేని పొన్నం ప్ర‌భాక‌ర్‌
– ఫ‌లించిన బండి సంజ‌య్ చాణ‌క్యం

(ప్ర‌జాతంత్ర‌, క‌రీంన‌గ‌ర్‌)

కరీంనగర్ నగరపాలక సంస్థ (ఎంసీకే) ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. 66 డివిజన్లు ఉన్న ఈ కీలకమైన కార్పొరేషన్‌లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోయినప్పటికీ, అంతిమంగా మేయర్ పీఠాన్ని బీజేపీ దక్కించుకోవడం వెనుక భారీ రాజకీయ కసరత్తు జరిగింది. మేయర్‌గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్‌గా వై. సునీల్ రావు ఎన్నికవ్వడం ద్వారా కరీంనగర్ గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడింది. అధికార కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డినప్పటికీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తన మార్కు రాజకీయ వ్యూహంతో మేయర్ పీఠాన్ని బీజేపీ ఖాతాలో వేశారు. నలుగురు మంత్రులు, బలమైన ఎమ్మెల్యేల పర్యవేక్షణలో ఉన్న కరీంనగర్‌లో కాంగ్రెస్ ఇలా పరాజయం పాలుకావడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొత్తం 66 డివిజన్లు ఉన్న కరీంనగర్ కార్పొరేషన్‌లో బీజేపీ 30 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9 స్థానాల్లో నిలిచాయి. మెజారిటీకి 34 సీట్లు అవసరమైన తరుణంలో, బండి సంజయ్ తన అసాధారణ రాజకీయ మేధస్సును ప్రదర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతోపాటు, కరీంనగర్ జిల్లా రాజకీయాలను శాసించే కీలక నేతలు ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జిల్లా ఇన్చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగా ఎమ్మెల్యేలుగా గెలిచి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొన్నం ప్రభాకర్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వంటి హేమాహేమీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకగా తీసుకున్నారు. అయినప్పటికీ కరీంనగర్ నగరంలో పార్టీని గట్టెక్కించలేకపోవడం వారి వైఫల్యంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా మానకొండూర్, చొప్పదండి, వేములవాడ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వారే అయినప్పటికీ కార్పొరేషన్ పరిధిలో ఓటర్లను ఆకట్టుకోవడంలో వారు విఫలమయ్యారు. గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ బలపర్చిన సర్పంచి అభ్యర్థులు ఎక్కువగా గెలవడంతో అతి విశ్వాసంతో ఉండడం, స్థానిక గ్రూపు రాజకీయాలను చక్కదిద్దకపోవడం కాంగ్రెస్‌కు శాపంగా మారింది. మంత్రులు తమ సొంత నియోజకవర్గాల్లో మున్సిపాలిటీలను గెలిపించుకోగలిగారు కానీ, జిల్లా కేంద్రమైన కరీంనగర్ నగర ఓటర్ల నాడీని పట్టుకోవడంలో వెనుకబడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మొత్తం 14 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ 10 చోట్ల అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ప్రతిపక్షాలను నామరూపాలు లేకుండా చేసింది. ధర్మపురిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నేతృత్వంలో 15కు 15 వార్డులను కాంగ్రెస్ గెలుచుకుంది. మంథనిలో మంత్రి శ్రీధర్ బాబు కోటలో 13 వార్డులకు గాను 10 వార్డులను హస్తం పార్టీ కైవసం చేసుకుంది. రామగుండం కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ 60 డివిజన్లకు 38 డివిజన్లు సాధించి, మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. పెద్దపల్లి, సుల్తానాబాద్ లోనూ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షణలో 20 వార్డుల్లో 16 వార్డులను గెలిచి ఏకపక్ష విజయం సాధించింది. అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టిన గడ్డ కరీంనగర్ లో ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయారు. ఆయనకు అక్కడ ప్రజల్లో పట్టు లేకనే హుస్నాబాద్ కు వలస వచ్చారని, మంత్రిగా అధికార హోదాలో హుస్నాబాద్ లో ప్రభావం చూపినా కరీంనగర్ ఓటర్లు మాత్రం ఇప్పటికీ ఆయన వెంట లేరనేది స్పష్టమైపోయిందంటున్నారు.
ఈ విజయం పూర్తిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యక్తిగత ప్రతిష్టకు నిదర్శనం. బీజేపీకి సొంతంగా 30 మంది కార్పొరేటర్లే ఉన్నప్పటికీ మేజిక్ ఫిగర్ 34ను సాధించడానికి ఆయన వేసిన ఎత్తుగడలు అమోఘం. ఒక ఐఎఫ్‌బీ కౌన్సిలర్, ఇద్దరు స్వతంత్రులను బీజేపీ వైపు తిప్పుకోవడంలో విజయం సాధించారు. ఇతర పార్టీల ఎక్స్-అఫీషియో ఓట్లు పడకుండా లేదా చెల్లకుండా చేయడంలో పరోక్షంగా సఫలమయ్యారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉండటం లేదా తటస్థంగా వ్యవహరించడం బీజేపీకి కలిసొచ్చింది. బండి సంజయ్ తెరవెనుక నడిపిన మంత్రాంగం ఉందన్నది బహిరంగ రహస్యం. మేయర్ ఎన్నిక ప్రక్రియలో సంజయ్ తన ఎక్స్-అఫీషియో ఓటును వ్యూహాత్మకంగా ఉపయోగించుకున్నారు. చివరి నిమిషం వరకు కాంగ్రెస్ శిబిరంలో ఉన్న స్వతంత్రులను తన వైపు తిప్పుకోవడంలో ఆయన సఫలమయ్యారు. బీఆర్ఎస్ సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉండడం కూడా బీజేపీ విజయానికి మార్గం సుగమం చేసింది. ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 21 ఓట్లు మాత్రమే రావడంతో హస్తం నేతలు కంగుతిన్నారు.
కరీంనగర్ పరాజయం కాంగ్రెస్ లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇన్-చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంటి దిగ్గజాలు ఇక్కడ మేయర్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని, ఇందుకు తగిన వ్యూహాలు రచించాలనీ సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అయినా కార్పొరేటర్లను తమవైపు తిప్పుకోవడంలో విఫలం కావడంతో అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. నలుగురు మంత్రులు రంగంలో ఉండి కూడా బీజేపీ చాణక్యాన్ని ఎందుకు పసిగట్టలేకపోయారని ఆరా తీసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగినప్పటికీ కరీంనగర్ కార్పొరేషన్‌లో ఓడిపోవడం వల్ల మంత్రులపై విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రస్థాయి నాయకత్వం ఉన్నప్పటికీ స్థానిక కార్పొరేటర్లను సమన్వయం చేయడంలో మంత్రులు  విఫలమయ్యారని విశ్లేషకులు చెబుతున్నారు. మేయర్ ఎన్నిక ద్వారా తెలంగాణ రాజకీయాలకు ఒక స్పష్టమైన సంకేతం వెళ్లింది. కేవలం అధికారంలో ఉన్నంత మాత్రాన పట్టణ ఓటర్ల మద్దతు లభించదని, పక్కా వ్యూహం అవసరమని నిరూపితమైంది. బండి సంజయ్ తన గత మున్సిపల్ అనుభవాన్ని (ఆయన కూడా గతంలో కార్పొరేటర్) ఉపయోగించి క్షేత్రస్థాయిలో కార్యకర్తలను ఉత్తేజపరిచారు. మంత్రులు తమ అధికార హోదాను ప్రదర్శించడానికే పరిమితమయ్యారే తప్ప ఓటర్లలో ఉన్న అసంతృప్తిని గుర్తించలేకపోయారు. బీఆర్ఎస్ ని పూర్తిగా ఖాళీ చేశామని మున్సిపాలిటీల్లో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ నేతలు, అదే బీఆర్ఎస్ పరోక్ష సహకారంతో బీజేపీ కార్పొరేషన్ పీఠాన్ని ఎగరేసుకుపోతుంటే అడ్డుకోలేకపోయారు. కార్పొరేషన్ ఫలితం కాంగ్రెస్ మంత్రులకు ఒక గట్టి హెచ్చరిక. మున్సిపాలిటీల్లో గెలిచినంత మాత్రాన సరిపోదు, వ్యూహాత్మకమైన జిల్లా కేంద్రాల్లో పట్టు కోల్పోతే భవిష్యత్తులో రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇక బీజేపీకి ఈ విజయం రాబోయే ఎన్నికల్లో కొత్త ఊపిరి పోసింది. బండి సంజయ్ గతంలో ఎమ్మెల్సీని గెలిపించుకోవడంతోపాటు ఇప్పుడు  ఈ విజయంతో జిల్లాలో తిరుగులేని నాయకత్వాన్ని మరోసారి చాటిచెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *