ఆశ్రయమిచ్చిన ఇంటికే కన్నం

– మత్తు మందు ఇచ్చి దోపిడీ చేసిన బంధువు
– 24 గంటల్లోనే పట్టుకున్న పోలీసులు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 17: బంధువే కదా అని ఆశ్రయమిస్తే రాబందుగా మారి దోచుకున్నది. ఇంట్లో చోటిచ్చిన పాపానికి బంగారు నగలు, డబ్బు అంతా ఊడ్చుకెళ్లింది. ఆ కిలేడీ అంతర్గతంగా వేసిన స్కెచ్‌ ‌గుర్తు పట్టని ఆ దంపతులు సొమ్ము పోయిన తర్వాత లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. సీన్‌ ‌కట్‌ ‌చేస్తే 24 ‌గంటల్లోనే కిలేడీని పోలీసులు అరెస్ట్ ‌చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. బీహెచ్‌ఈఎల్‌ ‌కాలనీ పరిధిలోని ఆదర్శనగర్‌లో పురోహితులైన యర్రవల్లి మణికంఠశర్మ, హేమబిందు దంపతుల ఇంటికి వచ్చింది ఓ మహిళ. ఆమె పేరు చెరకుపల్లి లక్ష్మీ స్వరాజ్‌. ‌తాను తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో ఉన్నానని, ఉండటానికి చోటు లేక ఇబ్బంది పడుతున్నానని ప్రాధేయపడింది. బంధుత్వంపై ఉన్న గౌరవం.. ఆమె పరిస్థితిపై ఉన్న జాలితో ఆ దంపతులు ఆమెకు తమ ఇంట్లోనే ఉండేందుకు ఆశ్రయం ఇచ్చారు. కొన్ని రోజులు.. ఆ దంపతుల నమ్మకాన్ని గెలుచుకుంది లక్ష్మీస్వరాజ్‌. ‌వారి ఇంట్లో ఒక మనిషిగా ఉన్నట్లుగానే మెదిలింది. కానీ ఆ తర్వాత ఆమె తన కన్నింగ్‌ ఆలోచనలకు తెరతీసింది. ఇంట్లో ఉన్న విలువైన ఆభరణాలపై కన్నేసింది. మార్చి 13న వాటిని కొట్టేసేందుకు ప్లాన్‌ ‌చేసింది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. ఆ దంపతులకు నిమ్మరసంలో మత్తు పదార్థం కలిపి ఇచ్చింది. ఆ పానీయం తాగిన కొద్దిసేపటికే మణికంఠశర్మ, హేమబిందు ఇద్దరూ స్పృహ‌ కోల్పోయారు. వారు అపస్మారక స్థితిలోకి వెళ్లగానే.. లక్ష్మీస్వరాజ్‌ ‌తన ముఠా సభ్యులైన పర్వతం కిరణ్‌కుమార్‌, ‌కోనపర్తి యశ్వంత్‌, ‌భారడి దీపక్‌, ‌శివను ఆ ఇంటికి రప్పించింది. ముఠా సభ్యులతో కలిసి ఇంట్లోని అల్మారాలను బద్దలుకొట్టి దాదాపు 30 తులాల బంగారం, 2.3 కిలోల వెండి, 3 ఖరీదైన సెల్‌ఫోన్లను ఎత్తుకెళ్లారు. బాధితులు స్పృహలోకి వచ్చేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంట్లో సామాన్లు చిందరవందరగా పడి ఉండటం.. లక్ష్మీస్వరాజ్‌ ‌కనిపించకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు వెంటనే బాలానగర్‌ ‌పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. కాలనీలోని సీసీ కెమెరాల ఫుటేజీ, నిందితులు వాడిన వాహనాల నంబర్లు, సెల్‌ఫోన్‌ ‌సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే ప్రధాన నిందితురాలు లక్ష్మీస్వరాజ్‌తోపాటు మిగిలిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ ‌చేశారు. వారి వద్ద నుండి దోచుకెళ్లిన పూర్తి బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బంధువులైనా, తెలిసిన వారైనా సరే ఇంటికి వచ్చినప్పుడు పూర్తి జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *