తెలంగాణ అస్థిత్వానికి పొంచిఉన్న ప్రమాదం 

(మండువ రవీందర్‌రావు )
నేటికి పన్నెండు ఏళ్ళ కింద తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. సుమారు ఆరు దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు తమ అస్తిత్వం కోసం చేసిన పోరాట కల నెరవేరింది ఈనాడె. ఇక్కడి వనరుల దోపిడి, సాంస్కృతిక వివక్ష, కొల్లగొట్టిన ఉద్యోగాలు, భూములు, నదీజలాల తరలింపును వ్యతిరేకిస్తూ జరిపిన అనేక పోరాటాలు, అవమానాలు, అవహేళనలు మరెన్నో బలిదానాల ఫలితంగా దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. తెలంగాణ ఉద్యమమంతా నీళ్ళు, నిధులు, నియామకాలన్న నినాదంగానే సాగింది. ఉద్యమంలో చిన్నా, పెద్ద, కులమత బేధాలు లేకుండా యావత్‌ ‌తెలంగాణ పాల్గొన్నది. స్వయం పాలనలో విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఈ ప్రాంతం పురోగతిని సాధించవచ్చని యావత్‌ ‌తెలంగాణ ప్రజలు ఆశించారు. అయితే ఈ పదకొండు ఏళ్ళ కాలంలో వారి ఆశలు, ఆశయాలు ఏమేరకు నెరవేరాయన్నది ఇప్పుడు ప్రశ్నించుకోవాల్సి ఉన్నది. పదకొండు సంవత్సరాలన్నది పాలకులకు తక్కువ సమయమేమీ కాదు. ఆయినా ప్రజల ఆకాంక్షలను పూర్తి స్థాయిలో నెరవేర్చలేక పోయాయి బిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాలు. తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరిస్తూ బలమైన ఉద్యమానికి సారధ్యం వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి, తర్వాత బిఆర్‌ఎస్‌గా మారిందేగాని ప్రజల ఆకాంక్షలను పూర్తిస్థాయిలో నెరవేర్చలేకపోయింది.
స్థానిక భూములను ఉపాధి అవకాశాలు వొస్తాయని కార్పోరేట్‌ ‌శక్తులకు అప్పగించడంలో గతంలోని సీమాంధ్ర ప్రభుత్వాలకు తీసిపోకుండా వ్యవహరించింది. గత కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో వైఎస్‌ అమ్మివేసినట్లు, నిజాంనుండి సంక్రమించిన వందలాది ఎకరాల భూములను అమ్మి ఎన్నికల సందర్భంగా చేసిన ‘ఉచిత’ వాగ్ధానలకు ఖర్చుపెట్టింది. నీటి ప్రాజెక్టులకోసం ఖజానా ఖాలీ చేసింది. తమది ఆర్థికంగా లాభదాయకమైన ప్రభుత్వంగా చెప్పుకుంటూనే అందినకాడికి అప్పులు చేసి. వేలాది కోట్ల రూపాయల బకాయిలు తెలంగాణ ప్రజల నెత్తిన మోపింది. ఫలితంగా ఆర్థిక భారంతో యువత ఆశించినట్లు వారికి ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయింది. దీంతో యువత నైరాశ్యంలోకి వెళ్ళింది. దాన్ని కాంగ్రెస్‌ ‌తనకు అనుకూలంగా మల్చుకుంది. అధికారంలోకి రావడానికి ఆరు గ్యారంటీల పేర 420 హామీలను గుమ్మరించింది. అధికారంలోకి వొచ్చి ఏడాదిన్నర కాలమైనా ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయింది. అలివిగాని హామీలనిచ్చిన కాంగ్రెస్‌ ఇప్పుడు బొక్కసం ఖాలీగా ఉంది, క్రమేణ ఒక్కొక్కటిగా నెరవేరుస్తామంటోంది. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్‌ కూడా ప్రభుత్వ భూములను సొమ్ముచేసుకునే ప్రక్రియను ప్రారంభించింది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే క్రమంలో ఈ రెండు పార్టీలు ఒకదానిపై ఒకటి పోటీపడుతూ ఆరోపణలు చేసుకుంటున్నాయి.
   వాస్తవంగా తెలంగాణ ప్రజలు ఓన్‌ ‌చేసుకున్న బిఆర్‌ఎస్‌ ‌తమ పాలనలో చేసిన అనేక తప్పిదాల కారణంగా ప్రజలు ఆ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ప్రధానంగా ఉద్యమకారులకు సముచిత గౌరవాన్ని ఇవ్వకపోవడం, యువత, విద్యార్థి, ఉద్యోగులంతా ప్రాణాలకు తెగించి ఉద్యమిస్తే వారి ఆకాంక్షలపై నీళ్ళు చల్లడం, మంత్రులకు, ఎమ్మెల్యేల కే అధినేత దర్శన భాగ్యం లభించకపోవడంలాంటి ఆనేక ఆరోపణల కారణంగా ఆ పార్టీ అధికారానికి దూరమైంది. అధికారాన్ని కోల్పోయి ఏడాదిన్నర అవుతున్నా తన తప్పులను దిద్దుకోలేకపోయింది. ఆ నిర్లక్ష్యం కవిత రూపంలో ఆ పార్టీని ఇప్పుడు కుదిపేస్తున్నది. వాస్తవానికి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ  కవిత రాసిన లేఖలో ఆమె పేర్కొన్న అంశాలన్నీ యదార్థమైనవే. ఆ పార్టీ నేతలతో సహా, ఇతర తెలంగాణ వాదులెవరూ ఆమె పేర్కొన్న ప్రశ్నల్లో ఏ మాత్రం తప్పు లేదంటున్నారు. వాటన్నిటికీ సమాధానం చెప్పుకోవడమేకాదు, అధినేత తన నడవడిని మార్చుకోకపోతే భవిష్యత్‌లో పార్టీ మనుగడ ప్రమాదంలో పడుతుందంటున్నారు. ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌, ‌టైగర్‌ ‌నరేంద్ర, విజయశాంతి, ఈటల రాజేందర్‌లాంటి లాంటి అనేకమంది పోరాటయోధులను బిఆర్‌ఎస్‌ ‌వదులుకోవడాన్ని తెలంగాణ అభిమానులు నేటికి జీర్ణించుకోలేకపోతున్నారు. పెద్దగా పోరాట చరిత్రలేని పార్టీల్లోకి వారు మారడం ద్వారా ఆ పార్టీలకు పరోక్షంగా బలాన్ని చేకూర్చినట్లైందంటున్నారు.
 అరంగేట్రానికి సిద్దంగా ఉన్న అంధ్రా పార్టీలు : 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  జరిగిన మొదటి ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ‌బలాన్ని చూసి తోకముడిచిన పార్టీలన్నీ ఇప్పుడు తెలంగాణవైపు చూస్తున్నాయి. అందుకు బిఆర్‌ఎస్సే ప్రధాన కారణం. తమిళనాడు తరహాలో జాతీయ పార్టీలకు అవకాశం లేకుండా తన అధిపత్యాన్ని బిఆర్‌ఎస్‌ ‌కొనసాగించలేకపోయింది. ఉద్యమకాలంలో ఇష్టం ఉన్నా లేకపోయినా తమ సొంత  పార్టీగా బిఆర్‌ఎస్‌ను తెలంగాణ ప్రజానీకమంతా భుజానికెత్తుకుంది. అందుకే రాష్ట్ర ఏర్పడ్డాక మొదటిసారిగా జరిగిన ఎన్నికల్లో అఖండ విజయాన్ని ఆ పార్టీ సాధించుకుంది. కాని పాలనా వైఫల్యాల కారణంగా స్థానిక ప్రజల భ్రమలు  తొలగిపోవడంతో తోకముడిచిన పార్టీలన్నీ మరోసారి తమ ఉనికిని చాటుకునేందుకు సిద్దమవుతున్నాయి. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో తొమ్మిదేళ్ళపాటు అప్రతిహతంగా పాలన చేసిన టిడిపి సారధి నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణలో తన పార్టీని పటిష్టం చేసుకునేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఉద్యమకాలంలో తనకు రెండు ప్రాంతాలు రెండు కళ్ళు అంటూ, తెలంగాణ విషయంలో దోబూచులాట అడిన చంద్రబాబు ఇప్పుడు కూడా తన రెండు కండ్ల సిద్దాంతాన్ని వల్లె వేస్తున్నారు. ఇటీవల ఆ పార్టీ జరుపుకున్న మహానాడులో ఆయన ఆయన చేసిన ప్రసంగం అదే అంశాన్ని చెబుతున్నది.
తనకు రెండు రాష్ట్రాలు రెండు కండ్ల లాంటివని, రెండు రాష్ట్రాల అభివృద్ధిని కాంక్షించే వాడినంటూ తన ఆవు వ్యాసాన్ని మరోసారి ఏకరువు పెట్టారు. హైదరాబాద్‌ను అభివృద్ది చేసింది తానేనని, తనవల్లె సాఫ్ట్‌వేర్‌ ‌రంగం అభివృద్ది చెందిందంటూ మళ్ళీ పునశ్చరణ చేశారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయి దాదాపు పన్నెండు ఏండ్లు కావొస్తున్నా ఇంకా ఆయనకు తెలంగాణ మీద ఉన్న యావ పోలేదు. గత ఎన్నికల్లో కనీసం పోటీ చేయాలన్న ఆలోచన కూడా చేయని టిడిపి ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తున్నదంటే ఇక్కడ బిఆర్‌ఎస్‌ ‌బలహీన పడడమే. అధికారం పోయిన తర్వాత పదిమంది ఎమ్మెల్యేలు లు, పదిమంది ఎమ్మెల్సీ లతోపాటు పలవురు పార్టీ ముఖ్యనేతలు పార్టీ మారడం ఒకటైతే, నాయకులపట్ల పార్టీ అధినేత తీరు మరో కారణమన్నది ఇటీవల కెసిఆర్‌ ‌కూతురు స్వయంగా రాసిన లేఖ స్పష్టంచేస్తున్నది. ఆ లేఖ పర్యవసానం ఎటుదారి తీస్తుందో తెలియదుకాని, పార్టీ భవిష్యత్‌ను మాత్రం ప్రశ్నార్థకం చేసింది. దీన్ని తోకముడిచిన పార్టీలు అవకాశంగా తీసుకుంటున్నాయి. ఎంతకాదన్నా ఇక్కడ తెలుగుదేశం పార్టీ పట్ల ఇంకా అభిమానం ఉన్నవారు లేకపోలేదు. దీంతో ఇక్కడ తమ పార్టీని పునరుద్దరించేందుకు చంద్రబాబు  ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
    ముఖ్యంగా ఏపిలో గత ఎన్నికల్లో ఏర్పడిన కూటమిలాగా ఇక్కడ కూడా బిజెపి, జనసేతో కలిసి కూటమిగా ఏర్పడాలన్న ప్రణాళికను రచిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈమేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఇప్పటికే ఒకసారి చర్చించినట్లు తెలుస్తున్నది. బిజెపి కూడా మొదటి నుండి తెలంగాణ పై కన్నేసి ఉంచడంతో చంద్రబాబుకు మద్దతు పలికినట్లు తెలుస్తున్నది. దేశంలోని రాష్ట్రాలన్నిటిలో ఎన్‌డిఏ ప్రభుత్వాలే ఉండాన్న మోదీ ఆకాంక్ష మేరకు బిజెపి ఈ పొత్తుకు అంగీకరించే అవకాశాలున్నాయి. అంతేగాక బిజెపి చాలాకాలంగా దక్షిణాధిన తమపార్టీని విస్తరించుకోవాలని చూస్తున్నది. కర్ణాటక తర్వాత తెలంగాణ పై కాషాయ జండాను ఎగురవేయాలనుకుంటున్నది. ఇప్పటికే ఎనిమిది పార్లమెంటు, ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో  పాగా వేసింది. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ  ఎన్నికల్లో రెండు స్థానాలను కాంగ్రెస్‌తో పోటీపడి గెలుచుకుంది. తనకు ప్రధాన పోటీదారు కాంగ్రెస్‌గానే ఆ పార్టీ గుర్తిస్తున్నది. కానీ, తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో  బీజేపీ ఒంటరిగా పోటీ చేయడం ద్వారా అధికారంలోకి రావడం కష్టం. అందుకే ఇక్కడ పట్టున్న టిడిపితో కలువాలనుకుంటున్నది. చంద్రబాబు ఏపి సింఎంగా అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారిగా హైదరాబాద్‌కు వొచ్చినప్పుడు తెలంగాణలోని ఆయన అభిమానులు ఘనంగా ఆహ్వానించిన తీరు ఆయనకు ఇక్కడ ఏమేరకు పట్టున్నదన్నది అర్థమవుతున్నది.
పూర్వాశ్రమంలో ఆ పార్టీలో ఉన్న పలువురునాయకులు ఇప్పుడు ఇతర పార్టీల్లో ఎమ్మెల్యేలు గా ఉన్నవారు కూడా ఆయనకు అభినందనలు తెలిపేందుకు వరుసపెట్టి వెళ్ళడం ఆయన పట్ల వారికున్న అభిమానానికి అద్దంపుడుతున్నది. ఖమ్మంలో ఆయన ఏర్పాటు చేసిన సభ కూడా విజయవంతం కావడంతో ఇక తెలంగాణలో పార్టీని పటిష్టం చేయాలన్న ఆలోచన ఆయనకొచ్చింది. అందుకు త్వరలోనే ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని ఏర్పాటు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా, జనసేన అభిమానులకు కూడా తెలంగాణలో కరువు లేదు. అందుకే ఈ రెండు ఆంధ్ర పార్టీలను కలుపుకోవడం ద్వారా తాము అధికారంలోకి రావొచ్చని బిజెపి యోచిస్తున్నది. దీనికి ప్రయోగాత్మకంగా త్వరలో రానున్న స్థానిక ఎన్నికలను వాడుకోవాలని ఈ పార్టీలు చూస్తున్నాయి. గ్రామీణ ప్రాంతంతోపాటు, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని తమ వోట్‌ ‌బ్యాంకును మరోసారి పదిలపర్చుకునే ఆలోచనలో టిడిపి ఉంది. ఇదే జరిగితే ఇంతకాలం ఏ అస్తిత్వం కోసమైతే తెలంగాణ ప్రజలు ఆరు దశాబ్దాలుగా పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నారో భవిష్యత్‌లో తిరిగి ఆస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. మరోసారి ప్రాంతేతరుల ఆధిపత్యంలో ఈ ప్రాంతం మగ్గకుండా ఉండాలంటే బిఆర్‌ఎస్‌ ‌మరోసారి బలంగా ప్రజాక్షేత్రంలోకి రావాలి. లేదా మరో ప్రాంతీయ పార్టీ అయినా  ఉద్భవించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *