– సరకు రావాణాకు ఇరాన్ అనుమతి
టెహ్రాన్, మార్చి 26: భారత్ సహా మిత్ర దేశాలకు హోర్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. హోర్ముజ్ ద్వారా సరుకు రవాణా నౌకల రాకపోకలకు అనుమతి ఇచ్చినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి ప్రకటించారు. భారత్, చైనా, రష్యా, ఇరాక్, పాకిస్తాన్‌లకు సరుకు రవాణాకు అనుమతి లభించింది. అబ్బాస్ అరఘ్చి స్పందన గురించి ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ ఒక ప్రకటనలో తెలిపింది. హోర్ముజ్ జలసంధిని తెరవాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అభ్యర్థించారు. దీని నేపథ్యంలోనే ఇరాన్ ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. మధ్యప్రాచ్యంలో యుద్దాన్ని ముగించాలని గుటెర్రెస్ అమెరికా, ఇజ్రాయిల్‌లను కోరారు. ’హోర్ముజ్ జలసంధిని మూసివేయడం చమురు, గ్యాస్ రవాణాను స్తంభింపజేస్తోంది. ఈ ప్రాంతంలో, వెలుపల పౌరులు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు, అభద్రతతో జీవిస్తున్నారు. సంఘర్షణ పరిణామాలను తగ్గించడానికి పోరాటాన్ని ముగించడమే సరైన నిర్ణయం’ అని గుటెర్రెస్ ఒక ప్రకటనలో రాశారు.
అమెరికాను ఎదుర్కొనేలా ఇరాన్ ఎత్తులు : ఖర్గ్ ఐలాండ్‌లో మందుపాతరలు
ఇరాన్‌కు అత్యంత కీలకమైన ఖర్గ్ ఐలాండ్ ను స్వాధీనం చేసుకునే ఉద్దేశంతో పర్షియన్ గల్ఫ్‌లో అమెరికా తన బలగాలను మోహరిస్తోందని వార్తలు వస్తున్న ఈనేపథ్యంలో ఖర్గ్‌ను రక్షించుకునేందుకు ఇరాన్ సిద్ధమైంది. ఇందుకోసం అమెరికా దళాలను అక్కడ అడుగుపెట్టనీయకుండా ఇరాన్ భారీగా మందుపాతరలు అమర్చినట్లు సమాచారం. వాటితో విధ్వంసకర ఉచ్చులు పన్నుతోందని తెలుస్తోంది. అంతేకాకుండా అక్కడికి భారీగా బలగాలను కూడా తరలిస్తున్నట్లు అంతర్జాతీయ వార్తా కథనం వెల్లడించింది. హర్మూజ్ జలసంధిని తెరిపించేలా ఒత్తిడి తెచ్చేందుకు ఖర్గ్‌ను ఓ సాధనంగా వాడాలని ట్రంప్ యంత్రాంగం యోచిస్తోంది. పశ్చిమాసియా ప్రాంతంలోని ఓ దేశం సహకారంతో ద్వీపాలను ఆక్రమించు కోవాలని మా శత్రువులు సన్నాహాలు చేస్తున్నారన్న నిఘా సమాచారం ఉంది. శత్రువుల కదలికలను మేం ఎప్పటికప్ప్పుడు పర్యవేక్షిస్తున్నాం. శత్రువు ఒక్క అడుగు ముందుకువేసినా.. పశ్చిమాసియాలోని ఆ దేశంలోని కీలక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఎడతెగని దాడులు చేస్తాం అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఎంబీ ఘలిబాఫ్ ఇప్పటికే హెచ్చరికలు చేశారు. అమెరికా సైనికులు, కమాండర్ల ఆచూకీ చెప్పండంటూ పశ్చిమాసియా దేశాలకు ఇరాన్ (ఎసజీని) విజ్ఞప్తి చేసింది. అమెరికా స్థావరాలపై తాము దాడులు చేస్తుండటంతో అక్కడున్న యూఎస్ సైనికులు ఇతర ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతున్నారని ఇరాన్ వెల్లడించింది. పశ్చిమాసియా దేశాల ప్రజలు వారి ఆచూకీని వెల్లడించాలని కోరుతున్నాం. అలాగే మీ భద్రత కోసం వారిని బహిష్కరించండని అడిగింది. తమ దాడుల్లో దెబ్బతిన్న అమెరికా స్థావరాలు నిర్జన ప్రాంతాలుగా మారాయని పేర్కొంది. 13 సైనిక స్థావరాలు దెబ్బతిన్నాయని వెల్లడించింది. భూతల దాడుల వార్తల నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాన్ని ఇరాన్ హెచ్చరించింది. నెతన్యాహు, ట్రంప్ చేస్తోన్న మోసానికి మీ పిల్లలను బలిచేయకండంటూ హెచ్చరించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




