అభ్యుదయవాది అయ్యవారు రామయ్య

నిజానికి పూలే కంటే ముందే ముంబయి నగరంలో రామయ్య, మరికొందరు తెలుగు ప్రముఖులు సామాజిక న్యాయానికి చెందిన పలు కార్యక్రమాలు నిర్వహించేవారు. మద్యపాన నిషేదం, మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా సభలు సమావేశాలు నిర్వహించడం లాంటి పనులెన్నో చేసేవారు.  పూలే   ప్రభావం తెలుగువారి మీద బలంగా పడడం వల్ల బాలికల పాఠశాలలు, గ్రంథాలయాలు లాంటివి కూడా తెలుగువారు ఏర్పాటు చేశారు. అందుకు బాధ్యులు రామయ్యనే..!

సంగెవేని రవీంద్ర, ముంబై,
– 99871 45310

తెలంగాణ ప్రజలకు వలసలు వారసత్వ సంపదగా లభిస్తాయి. కరువు కాటకాలు ఒకవైపు, పాలకుల దమననీతి మరోవైపు పెట్రేగిపోవడం వల్ల, భరించలేని సామాన్యులు, పొట్ట చేతబట్టుకొని పరాయి ప్రాంతాలకు వలసవెల్లడం చారిత్రక సత్యం. ఆకలి బాధ తీర్చుకునేందుకు తండ్లాడుతూనే, జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కేందుకు తాపత్రయపడుతూనే, వ్యవస్థలోని దుర్వ్యవస్థలపై పోరాటం చేసి, తాడిత పీడిత ప్రజలకు అండగా నిలబడి, సమాజంలో చైతన్యదీపాలు వెలిగించిన వారే , సరికొత్త చరిత్ర నిర్మిస్తారు. శాశ్వతంగా జనం గుండెల్లో నిలిచిపోతారు. అలాంటి వ్యక్తుల్లో అగ్రగణ్యులు.. “అయ్యవారు రామయ్య..”

రామయ్య 1826లో హైదరాబాద్‌లో జన్మించారు. యుక్తవయస్సు రాగానే ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. కానీ ఇమడలేక పోయారు. తాను కోరుకున్న జీవితం ఇది కాదనే నిర్ణయానికి వచ్చారు. హైదరాబాద్‌లో బయలుదేరిన రామయ్య పుణే చేరుకున్నారు. కానీ ఎందుకో పుణేలో కూడా స్థిరపడలేకపోయారు. దాంతో ముంబయి నగరాన్ని తన గమ్యంగా మార్చుకున్నారు. ఎక్కువగా చదువుకోలేదు గనక ఉద్యోగాల కోసం వెతుక్కోకుండా, అప్పట్లో తెలుగువారు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న భవన నిర్మాణ రంగంలో చేరారు.
మొదట్లో ఇతర కాంట్రాక్టుదారుల వద్ద పనిచేసిన రామయ్య, స్వీయ అనుభవంతో వచ్చిన పరిజ్ఞానం వల్ల సొంతంగా భవన నిర్మాణాలను చేపట్టాడు. భవననిర్మాణ రంగంలో అనతికాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నారు రామయ్య. ముంబయిలోనే కాకుండా, పుణే, సతారా తదితర నగరాల్లో అద్భుతమైన ప్రజా ప్రాజెక్టులకు  సంబంధించిన కట్టడాలు నిర్మించారు. ఆయన పనితనానికి మురిసిపోయిన పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన కల్నల్‌ గుడ్‌ఫెలో రామయ్యను విశేషంగా అభినందించడమే కాకుండా బ్రిటిష్‌ పాలకులకు ఆయన గురించి పరిచయం చేశారు.
భవన నిర్మాణ రంగంలో ఎన్నో చారిత్రకమైన కట్టడాలు నిర్మించారు రామయ్య. అందులో కాటన్‌ గ్రీజ్‌ గ్రూప్‌కు చెందిన సర్‌ శాపూర్‌జీ బ్రోచా మిల్స్‌, ముంబయిలోని గ్రేటర్‌ పోస్ట్‌ ఆఫీస్‌, బాంబే ఫ్లోర్‌ మిల్స్‌, గార్డెన్‌ మిల్లు, గుజరాత్‌లోని నవ్‌సారి వద్ద ఉన్న అగ్యారి, షోలాపూర్‌లోని న్యూమిల్‌, అహ్మద్‌నగర్‌లో పర్వత లోయల మధ్య బండార్‌ద్వారా జలాశయం లాంటివెన్నో ఆయన నిర్మించి తెలుగోడి ప్రతిభను ప్రపంచానికి చాటారు. అప్పటి ప్రముఖ తెలుగు భవనరంగ నిర్మాతలైన నాగు సయాజీ, వెంకూ బాలూలతో పొత్తు పెట్టుకొని మరికొన్ని కట్టడాలు నిర్మించారు. అందులో బరోడాలోని సయాజీరావు గైక్వాడ్‌ వారి లక్ష్మీప్యాలెస్‌ ప్రధానంగా చెప్పుకోవాలి.
పేద కుటుంబం నుండి రావడం వల్లనేమో రామయ్యకు పేదల పట్ల సానుభూతి మెండుగా ఉండేది. తాను సంపాదించిన దాంట్లో కొంత నిర్ణీత మొత్తం పేదల అభ్యున్నతి కోసం వినియోగించేవారు. మొదట్నుండి ఆయన ఆలోచనలు సామాజిక న్యాయ ధోరణితో ఉండేవి. జ్యోతిరావు  పూలే   దంపతుల సామాజిక న్యాయ ఉద్యమ ప్రభావం రామయ్య మీద బాగా ఉండేది.  పూలే   కూడా మొదట్లో భవని నిర్మాణరంగ కాంట్రాక్టర్‌గా ఉండడం వల్ల ముంబయి, పుణే నగరాల మధ్య వస్తూ పోతూ ఉండేవారు. ఆ క్రమంలోనే రామయ్యతో పాటు మరికొందరు తెలుగు ప్రముఖులతో పరిచయం సహజంగానే జరిగిపోయింది.
నిజానికి పూలే కంటే ముందే ముంబయి నగరంలో రామయ్య, మరికొందరు తెలుగు ప్రముఖులు సామాజిక న్యాయానికి చెందిన పలు కార్యక్రమాలు నిర్వహించేవారు. మద్యపాన నిషేదం, మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా సభలు సమావేశాలు నిర్వహించడం లాంటి పనులెన్నో చేసేవారు.  పూలే   ప్రభావం తెలుగువారి మీద బలంగా పడడం వల్ల బాలికల పాఠశాలలు, గ్రంథాలయాలు లాంటివి కూడా తెలుగువారు ఏర్పాటు చేశారు. అందుకు బాధ్యులు రామయ్యనే..!
అయ్యవారు రామయ్య సామాజిక ఉద్యమకారుడిగా, నాయకుడిగా, సాహితీవేత్తగా, మానవతావాదిగా, హేతువాదిగా పేరు పొందారు.  పూలే   1873లో స్థాపించిన సత్యశోధక్‌ సమాజ్‌ ప్రారంభ దశలో పుణే వరకే పరిమితమై ఉండేది. కానీ రామయ్య సత్యశోధక్‌ సమాజ్‌ను ముంబయికి తీసుకువచ్చారు. సత్యశోధక్‌ సమాజ్‌ సైద్ధాంతిక దృక్పథ ప్రచారాన్ని తన భుజస్కందాలపైకి ఎత్తుకున్నారు. అప్పటి తెలుగు సమాజం ఆయనకు పూర్తి మద్దతు అందచేసింది. రామయ్య నిక్కచ్చితనంగా ఉండేవారు. ఎన్నో సందర్భాల్లో ఫులేతో కూడా విభేదించేవారు.
పూలే ప్రోత్సాహంతో తెలుగు పిల్లల కోసం వసతి గృహాన్ని నిర్మించారు రామయ్య. ఆ వసతి గృహ నిర్మాణానికి ఆయన పెద్ద ఉద్యమమే చేసి, చివరకు విజయం సాధించారు. అంతేగాక, రామయ్య గొప్ప తెలుగు భాషాభిమాని. 1893లో తెలుగువారి కోసం కమాటిపురాలో తెలుగు జ్ఞానోత్తేజక గ్రంథాలయాన్ని స్థాపించారు. రెండు దశాబ్దాల పాటు ఆ గ్రంథాలయానికి సంచాలకుడిగా ఆదర్శ సేవలందించారు. వందలాది తెలుగు విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేవారు. తెలుగు మద్యపాన నిషేద మండలికి సుదీర్ఘకాలం నేతృత్వం వహించి తెలుగు కార్మిక, శ్రామిక జనాలను మద్యపానానికి దూరంగా ఉంచే ప్రయత్నం చేశారు. ముంబయి సత్యశోధక సమాజానికి అధ్యక్షుడిగా కొంత కాలం వ్యవహరించి ఫులే భావజాలాన్ని పరివ్యాప్తం చేశారు.
జ్యోతిబా  పూలే   రాసిన గులాంగిరి పుస్తకాన్ని పలుమార్లు ముద్రించి, తనకు ఫులే పట్ల ఉన్న గౌరవాన్ని తెలుపుకున్నారు. క్రైస్తవులు చేపట్టిన మతాంతర ప్రయత్నాల్ని రామయ్య  సహేతుకంగా అడ్డుకున్నారు. రామయ్య ఉత్తమ సాహితీవేత్తగా కూడా తనదైన గుర్తింపు పొందారు. బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా ఫులేతో పాటు మరికొందరు సామాజిక వేత్తలతో కలిసి తీవ్రంగా పోరాడారు. ‘దేవుడితో ప్రార్థన’ అనే ఆయన వ్యంగ రచన నేటికీ మరాఠీ సాహిత్యంలో చెప్పుకోదగ్గ రచనగా నిలిచిపోయింది. క్రైస్తవ మతాంతర ప్రయత్నాలకు వ్యతిరేకంగా రామయ్య రాసిన రచనలను, ఆయనకు అత్యంత గౌరవనీయుడైన జ్యోతిరావు  పూలే   ‘స్వామి బంధు’ అనే కలం పేరుతో తీవ్ర పదజాలంతో విమర్శించారు.   పూలే   చేసిన ఈ పనికి రామయ్య బాగా నొచ్చుకున్నారు. పూలే రాసిందానికి  బదులుగా రామయ్య కూడా  పూలే  చేసిన విమర్శలను ఘాటుగా తిప్పికొట్టారు. దాంతో వారిద్దరి మధ్య కొంత అగాధం ఏర్పడింది. కొందరు మధ్యవర్తుల వల్ల ఆ అపార్థాలు తొలిగిపోవడం, తాను వాడిన పదజాలం పరిమితులు దాటిందని  పూలే   గొప్ప మనసుతో ఒప్పుకోవడంతో వారిద్ధరి మధ్య సయోధ్య తిరిగి నెలకొంది.
జన్మత: వైష్ణవ సాంప్రదాయ కుటుంబానికి చెందిన వారైనప్పటికీ. రామయ్య ఈశ్వరుని ఉనికిని ప్రశ్నిస్తూ ఉండేవారు. హేతువాద దృక్పథంలో ఆలోచించేవారు. ఫులే కంటే ఎక్కువ శాస్త్రీయ దృష్టి కలిగి ఉండేవారు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా కమాటిపురా ప్రాంతంలో తెలుగువారితో ఎన్నో సభలు నిర్వహించి, జ్ఞానజ్యోతుల్ని వెలిగించేందుకు ప్రయత్నించారు.
స్ఫురద్రూపి అయిన రామయ్యకు, మహారాష్ట్రలోని పలు నగరాల్లోని రచయితలు, మేధావులు, ఉద్యమ నాయకులతో సన్నిహిత సంబంధాలేర్పడ్డాయి. పలు పత్రికల్లో ఆయన రాసిన వ్యాసాలు, రచనలు సామాజిక స్పృహతో ఉత్తేజపూరితంగా ఉండేవి. తెలుగు సమాచార్‌,  ఇంద్ర ప్రకాశ్‌, జ్ఞానప్రకాశ్‌, జ్ఞానోదయ, బడోదా వత్సల లాంటి పలు పత్రికల్లో  ఆయన రచనలు చోటు చేసుకొని పాఠకుల మన్ననలు పొందేవి.
ఈస్టిండియా కంపెనీ తర్వాత తొలి బ్రిటిష్‌ పరిపాలన కొనసాగుతున్న  నేపథ్యంలో, స్వతంత్య్ర భారత రాజకీయాలు ఇంకా పురుడు పోసుకోని ఆ కాలంలో, బ్రిటిష్‌వారి వలసపాలనకు వ్యతిరేకంగా, మరోవైపు దేశీయ కుల వర్ణ వ్యవస్థపై తన కలాన్ని, గళాన్ని నిరంతరం ఎలుగెత్తిన అయ్యవారు రామయ్య, ముంబైలోని గ్రాంట్‌లోని జావ్‌జీ నివాసస్థానంలో, 31 మార్చి, 1912 నాడు తన 86వ ఏట తుది శ్వాస వదిలారు. వలస వెళ్ళిన ఒక తెలుగు వ్యక్తి ఉన్నత శిఖరాలు అధిరోహించి, ఎన్నో తరాలకి ఒక ఉద్యమస్ఫూర్తిగా నిలిచిపోయినప్పటికీ చరిత్రలో ఆయనకి తగినంత గౌరవం లభించలేదన్నది అక్షర సత్యం. మన తెలంగాణ ప్రభుత్వమైనా రామయ్యలాంటి వలస వీరుల చరిత్రకు ప్రాధాన్యత ఇస్తారనీ, చరిత్రలో సముచిత స్థానం కల్పిస్తారనీ ఆశిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page