భారతదేశంలో మహిళల రక్షణ చట్టాల సమర్థవంతమైన అమలుకు సంస్థాగత సామాజిక చర్యలు అవసరం. చట్టాల అమలును బలపరచడం ద్వారా మహిళలకు న్యాయం అందించవచ్చు. ఇందుకోసం మహిళలకు సంబంధించిన కేసులను సమర్థంగా నిర్వహించేందుకు పోలీసులకు లింగసున్నితమైన శిక్షణ ఇవ్వాలి. మహిళలపై జరిగే నేరాలపై త్వరితగతిన న్యాయం అందించేందుకు ప్రత్యేక కోర్టుల సంఖ్యను పెంచాలి. మహిళలు తమ హక్కులు అందుబాటులో ఉన్న న్యాయ మార్గాల గురించి తెలుసుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి..

ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలను గుర్తు చేస్తుంది. లింగ సమానత్వం, మహిళల సాధికారత, విద్య, భద్రత, నాయకత్వం ఎంత ముఖ్యమో ఈ రోజు సమాజానికి గుర్తు చేస్తుంది. ప్రభుత్వాలు, సంస్థలు, సమాజాలు వివిధ రంగాల్లో మహిళల కృషిని గుర్తించేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తాయి. సమాజంలో మహిళలు ఎదుర్కొనే వివక్ష, హింస అడ్డంకులను తొలగించాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తుంది.. 2026 సంవత్సరానికి నేపథ్యం (థీమ్) “లాభం కోసం ఇవ్వండి” (Give to Gain).అంటే వ్యక్తులు, సమాజాలు మహిళలకు మద్దతు, వనరులు, అవకాశాలు అందించినప్పుడు అందరికీ లాభం కలుగుతుందని ఈ భావన. ఈ థీమ్ ఉదారత, సహకారం, లింగ సమానత్వం కోసం సమిష్టి బాధ్యతను ప్రోత్సహిస్తుంది. కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళల హక్కులను గౌరవిస్తూ సమానత్వంతో కూడిన సమాజాన్ని నిర్మించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రేరేపిస్తుంది.
మహిళల భద్రత, సమానత్వం, న్యాయం కోసం బలమైన మహిళా రక్షణ చట్టాలు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ చట్టాల కఠిన అమలు వేధింపులు, గృహహింస, వివక్ష వంటి నేరాలకు బలమైన నిరోధకంగా పనిచేస్తాయి. మహిళలు, శాంతి, భద్రతా సూచిక 2025–26 (Women, Peace and Security Index) ప్రకారం, కొన్ని దేశాలు సరైన సమర్థవంతమైన చట్టాల అమలుతో మహిళల హక్కులను బలంగా రక్షిస్తున్నాయి. డెన్మార్క్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్ , ఫిన్లాండ్ వంటి దేశాలు మహిళల భద్రత, న్యాయం, సమానత్వంలో ప్రపంచంలో అగ్రస్థానాల్లో నిలుస్తున్నాయి. ఈ దేశాలు లింగ వివక్ష, హింస, ఉద్యోగ స్థల అసమానతలపై కఠినమైన చట్టాలను అమలు చేస్తాయి. అలాగే రాజకీయాలు, విద్య, ఉపాధిలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయి. అదే సూచిక ప్రకారం, కొన్ని దేశాలు మహిళల హక్కులను రక్షించడంలో ఇంకా దిగువ స్థానాల్లో ఉన్నాయి. అఫ్గానిస్తాన్, యెమెన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, సిరియా, సూడాన్ వంటి దేశాలు ప్రపంచంలో అత్యల్ప స్థాయిలో ఉన్నాయి. ఈ దేశాల్లో మహిళలకు విద్య, ఉపాధి, రాజకీయాల్లో పాల్గొనే అవకాశాలు చాలా పరిమితంగా ఉంటాయి. కొనసాగుతున్న యుద్ధాలు, రాజకీయ అస్థిరత, బలహీనమైన న్యాయ వ్యవస్థల వల్ల మహిళల రక్షణ చట్టాల సమర్థవంతమైన అమలు జరగడం లేదు. ఫలితంగా మహిళలు అధిక స్థాయిలో హింస, అసురక్షిత పరిస్థితులు, అసమానతలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కులను బలంగా రక్షించేందుకు మరింత కఠినమైన చట్టాలు, సమర్థవంతమైన అమలు అవసరమని స్పష్టంగా చూపిస్తున్నాయి.
భారతదేశం- మహిళా రక్షణ చట్టాల పనితీరు
భారతదేశంలో మహిళల హక్కులు, భద్రత గౌరవాన్ని కాపాడటానికి అనేక చట్టాలు అమలు చేయబడ్డాయి. గృహహింస మహిళల రక్షణ చట్టం (2005) గృహంలో మహిళలు ఎదుర్కొనే శారీరక, భావోద్వేగ, ఆర్థిక హింస నుండి రక్షణ కల్పిస్తుంది. ఉద్యోగ స్థలంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం, పరిష్కార చట్టం (2013) మహిళలకు భద్రమైన పని వాతావరణాన్ని నిర్ధారిస్తుంది. కట్నం నిషేధ చట్టం (1961)వివాహాల్లో కట్నం అనే దుష్ప్రథను నిర్మూలించడానికి ఉద్దేశించబడింది. శిశు వివాహ నిషేధ చట్టం (2006) బాలికల చిన్న వయస్సులో జరిగే వివాహాలను నివారిస్తుంది. మాతృత్వ ప్రయోజనాల చట్టం (1961) పనిచేసే మహిళలకు ప్రసూతి సెలవులు, ఉద్యోగ రక్షణను అందిస్తుంది. ప్రీ కాన్సెప్షన్ , ప్రీ నాటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్ చట్టం (1994)లింగ ఎంపిక, ఆడ శిశు గర్భహత్యను నిషేధిస్తుంది. అనైతిక రవాణా (నివారణ) చట్టం (1956), మహిళల అక్రమ రవాణా, దోపిడీని నిరోధించడానికి ఉద్దేశించబడింది. అదనంగా, 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటన తర్వాత క్రిమినల్ చట్టాల్లో సవరణలు చేసి మహిళలపై జరిగే నేరాలకు కఠినమైన శిక్షలను అమలు చేశారు. ఈ చట్టాలు సమిష్టిగా భారతదేశంలో మహిళల రక్షణ, సమానత్వం, సాధికారతను పెంపొందించడానికి రూపొందించబడ్డాయి. అయితే సామాజిక అపవాదం (social stigma), నేరాలపై తక్కువ ఫిర్యాదులు (underreporting), న్యాయ వ్యవస్థలో ఆలస్యం వంటి సమస్యలు చట్టాల సమర్థవంతమైన అమలును ప్రభావితం చేస్తున్నాయి.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) విడుదల చేసిన “క్రైమ్ ఇన్ ఇండియా” నివేదిక ప్రకారం, భారతదేశంలో మహిళలపై నేరాలు ఇంకా ఒక ప్రధాన సమస్యగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 4.45 లక్షల నేర కేసులు నమోదయ్యాయి, ఇది గత సంవత్సరాలతో పోలిస్తే పెరుగుదలను చూపిస్తుంది. మొత్తం కేసుల్లో భర్త లేదా కుటుంబ సభ్యుల క్రూరత్వం సుమారు 31.4%తో అత్యధికంగా ఉంది. ఇతర ప్రధాన నేరాలలో మహిళల అపహరణ లేదా కిడ్నాప్ సుమారు 19%, మహిళల గౌరవాన్ని అవమానించాలనే ఉద్దేశంతో దాడులు సుమారు 18.7%, అత్యాచారం సుమారు 7% ఉన్నాయి. మహిళలపై నేరాల రేటు ప్రతి లక్ష మహిళలకు సుమారు 66 కేసులుగా నమోదైంది, ఇది లింగ ఆధారిత హింస ఇంకా కొనసాగుతున్నదని సూచిస్తుంది. ఈ నివేదికలో చాలా సంఘటనలు గృహహింస, కుటుంబ సంబంధిత నేరాలకు సంబంధించినవని కూడా పేర్కొనబడింది.
ఈ నివేదిక ప్రకారం మహిళలపై అత్యధిక నేరాలు నమోదైన టాప్ 5 రాష్ట్రాలు ఉత్తర ప్రదేశ్ – 66,381 కేసులు, మహారాష్ట్ర – 47,101 కేసులు, రాజస్థాన్ – 45,450 కేసులు,పశ్చిమ బెంగాల్ – 34,691 కేసులు, మధ్య ప్రదేశ్ – 32,342 కేసులు. ఈ ఐదు రాష్ట్రాలు కలిసి భారతదేశంలో నమోదైన మహిళలపై నేరాలలో సుమారు సగం భాగాన్ని కలిగి ఉన్నాయి. ప్రకారం మహిళల భాగస్వామ్యం, న్యాయం, భద్రత (2025–26)సూచికలో భారత్ 181 దేశాల్లో 131వ స్థానంలో ఉంది. ఈ స్థానం భారతదేశం చట్టపరమైన రక్షణలో కొంత పురోగతి సాధించినప్పటికీ, మరింత బలమైన అమలు మరియు సంస్థాగత మద్దతు అవసరమని సూచిస్తుంది. అయితే ఈ చట్టాల ప్రభావవంతమైన అమలుకు ఇంకా కొన్ని సవాళ్లు ఉన్నాయి. న్యాయ ప్రక్రియలో ఆలస్యం, తక్కువ శిక్షా శాతం (low conviction rates), సామాజిక అపవాదం (social stigma), నేరాలపై తక్కువ ఫిర్యాదులు (underreporting) వంటి సమస్యలు చట్టాల అమలును ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలలో చట్టపరమైన హక్కులపై అవగాహన లేకపోవడం వల్ల ఈ చట్టాల ప్రయోజనాలు పూర్తిగా అందడం లేదు.మహిళలు, శాంతి, భద్రతా సూచిక 2025–26 ప్రకారం మహిళల భద్రత, రక్షణ సూచికలలో భారత్ ఇంకా తక్కువ స్థాయిలో ఉంది. అందువల్ల చట్టాల కఠినమైన అమలు సామాజిక అవగాహన పెంపు అవసరం ఉందని నివేదిక సూచిస్తుంది.
మహిళల రక్షణ చట్టాల సమర్థవంతమైన అమలుకు తీసుకోవలసిన చర్యలు
భారతదేశంలో మహిళల రక్షణ చట్టాల సమర్థవంతమైన అమలుకు సంస్థాగత సామాజిక చర్యలు అవసరం. చట్టాల అమలును బలపరచడం ద్వారా మహిళలకు న్యాయం అందించవచ్చు. ఇందుకోసం మహిళలకు సంబంధించిన కేసులను సమర్థంగా నిర్వహించేందుకు పోలీసులకు లింగసున్నితమైన శిక్షణ ఇవ్వాలి. మహిళలపై జరిగే నేరాలపై త్వరితగతిన న్యాయం అందించేందుకు ప్రత్యేక కోర్టుల సంఖ్యను పెంచాలి. మహిళలు తమ హక్కులు అందుబాటులో ఉన్న న్యాయ మార్గాల గురించి తెలుసుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. నేరస్తులకు కఠినమైన శిక్షలు సమయానికి అమలు చేయడం ద్వారా బలమైన నిరోధక ప్రభావం కల్పించాలి. మహిళలకు న్యాయం సులభంగా అందుబాటులో ఉండేందుకు మహిళల పోలీస్ స్టేషన్లు, హెల్ప్‌లైన్ సేవలను విస్తరించాలి.
బాధితులకు ఉచిత న్యాయ సహాయం, కౌన్సెలింగ్, పునరావాస సహాయం అందించాలి. ఉద్యోగ స్థల వేధింపుల చట్టాల ప్రకారం సంస్థల్లో అంతర్గత ఫిర్యాదు కమిటీలు సమర్థంగా పనిచేస్తున్నాయో లేదో నిర్ధారించాలి. మహిళల భద్రత కోసం ఎన్జీఓలు, స్థానిక నాయకులు, సమాజ సంస్థలను భాగస్వామ్యం చేయాలి. పారదర్శకత కోసం ఆన్‌లైన్ ఫిర్యాదు వ్యవస్థలు , కేసుల ట్రాకింగ్ విధానాలను ప్రవేశపెట్టాలి. మహిళల రక్షణ చట్టాల అమలును ప్రభుత్వ సంస్థలు తరచుగా సమీక్షించి అవసరమైన సవరణలు చేయాలి. ఈ చర్యలు అమలు చేయబడితే మహిళల రక్షణ చట్టాలు కేవలం చట్టాలుగానే కాకుండా సమర్థవంతంగా అమలవుతూ మహిళల భద్రత, సమానత్వం సాధికారతను భారతదేశంలో మరింతగా ప్రోత్సహించగలవు.





