పరమ పవిత్రం… వైకుంఠ ఏకాదశి పర్వదినం

ధనుర్మాసము సౌరమానము యొక్క ప్రామాణికాను సారము కాగా, శుక్ల ఏకాదశి చాంద్రమానమైన తిథి. ప్రతి మాసమునందలి ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి. “గృహస్థో బ్రహ్మచారీ చ ఆహితాగ్నిస్థ థైవచ; ఏకాదశ్యాంశ భుంజిత పక్షయోరు భయోరపి” అని అగ్ని పురాణాదులు వివరిస్తున్నాయి. గృహస్తులకు, బ్రహ్మచారులకు, నిత్యాగ్ని హోత్రులకు నైమిత్తిక కర్మగా ఉపవాసాద్యాచరణము విధించ బడినది. ఇట్టి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన దివసము కావునే ఏకాదశి హరి వాసరముగా కొనియాడ బడుచు న్నది. అందు సౌరమానము నందలి ప్రశస్తమైన ధనుర్మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి (మార్గశీర్షము లేక పుష్య మాసం) “వైకుంఠ ఏకాదశి”గా పిలువ బడుచు న్నది.
సూర్య చంద్రులు నేత్రములుగా కలిగిన వైకుంఠ వాసునుకి సౌర, చాంద్ర మానాలలో ప్రశస్తమైన ధనుర్మా శుక్ల పక్ష ఏకాదశి అత్యంత ప్రీతికరమైనది. ధనూరాశి స్థితే  సూర్యే శుక్ల ఏకాదశి తిథౌ; త్రింషత్ కోటి సురైః సాకం బ్రహ్మ వైకుంఠ మాగత: పాలస్త్యేనని పీడితా: సురగణాః వైకుంఠలోకం యయు:; ద్వారే తత్ర విషాదభావ మనసా సూక్తైర్  హరిం తుష్టువు: శుక్లై: శ్రీహరి వాసరే ప్రభాత సమయే భానౌ ధనుః సంస్థితే, తేభ్యోదాత్ సుఖ దర్శనం కరుణయా నారాయణో మాధవ:” రావణుని బాధలను తాళలేని దేవతలు బ్రహ్మను ఆశ్రయింపగా…ఆ దేవుడు ధనుర్మాస శుక్ల ఏకాదశి దినమున దేవతలందరితో వైకుంఠము నుచేరి, హరి వాసరమునందు దేవతలు విషాద భావ మనస్కులై శ్రీహరిని వేదోక్తంగా స్తుతించగా, వారికి శ్రీహరి సుఖ దర్శనమును కలుగజేసెనని వివరించ బడినది.
శ్రీప్రశ్న సంహిత (ఐదవ అధ్యాయము) నందు గల ఐతిహ్యము ననుసరించి మధు కైటభులను భగవానుడు సంహరించినపుడు వారు దివ్యరూపధారులై దివ్య జ్ఞానము పొందగా, బ్రహ్మాదులెవరైనను నీలోకము వంటి మందిరమును నిర్మించి, ఏకాదశి దినోత్సవమును గావించి, నిన్ను నమస్కరించి ఉత్తర ద్వార మార్గమున సమీపింతురో,  వారికి వైకుంఠ ప్రాప్తి కలుగునట్లు దీనిని మోక్ష ఉత్సవ దినముగా వరమిచ్చినట్లు తెలియు చున్నది. ముక్కోటి దేవతల బాధలను నివారించినందున ‘ముక్కోటి ఏకాదశి’గాను, వైకుంఠ దర్శనము కలిగించునది కనుక ‘వైకుంఠ ఏకాదశి’గాను, భగవద్దర్శనము చేయు పవిత్ర దినమైనందున భగవదవలోక దివసము’గ కొనియాడ బడుచున్నది.
ధనుర్మాస ఏకాదశి కొన్నిసార్లు మార్గశిర మాసమందు, మరికొన్ని మారులు పుష్యమాసమందు రావడం చేత రెండు మాసాల శుక్ల ఏకాదశులు ప్రశస్తములైనవే. మార్గశిరమాస ఏకాదశిని మోక్షైకాదశి అని, పుష్యమాస ఏకాదశిని పుత్రదైకాదశి, రైవత మన్వాది దినమని పిలుస్తారు.
వైకుంఠ ఏకాదశి అనే పేరులో వైకుంఠ, ఏకాదశి అని రెండు పదాలున్నాయి. వైకుంఠ శబ్దం ఆకారాంత పుంలింగం. ఇది విష్ణువునూ, విష్ణువుండే స్థానాన్ని కూడా సూచిస్తుంది. చాక్షుస మన్వంతరంలో వికుంఠ అనే ఆమె నుండి అవతరించి నందున విష్ణువు “వైకుంఠః” (వైకుంఠుడు) అయ్యాడు. అదేకాక జీవులకు నియంత, జీవులకు సాక్షి, భూతముల స్వేచ్ఛావిహారాన్ని అణచేవాడు – అని అర్ధాలున్నాయి.
 సూర్యుడు ధనురాశిపై నుండగా వచ్చిన తొలి ఏకాదశి (వైకుంఠ) పుణ్యదినాన తన దివ్యమంగళ రూపంతో వైకుంఠ ద్వారంవద్ద దేవతలకు శ్రీమహా విష్ణువు దివ్యదర్శనం గావించిన సంద ర్భంగా, కోటి తేజోమూర్తిని దర్శించిన బ్రహాదిదేవతలు, సనక సనందాది మునులు, ‘పశ్యన్ నిముష మాత్రేన కోటి యజ్ఞంఫలం లభేత్’ అని వచించినట్లు బ్రహాండ పురాణంలో వర్ణించ బడింది. ఈ పవిత్ర దినాన వైష్ణవ సంబంధ ఆలయాలలో, ఉత్తర ద్వారం వద్ద సూర్యోదయానికి పూర్వమే స్వామి దర్శనం చేసికోవడం అనాదిగా ఆచరిస్తున్న సత్సాంప్రదాయం.
   రామ కిష్టయ్య సంగన భట్ల, సీనియర్, ఇండిపెండెంట్, జర్నలిస్ట్, కాలమిస్ట్…
     9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *