తెలంగాణలోని పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. స్థానిక ఎన్నికల కోసం ఇంకా నోటిఫికేషన్ విడుదల కాకపోయినా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లన్నీ రాష్ట్ర ప్రభుత్వం చకచకా చేస్తోంది. మరో పక్క రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల్లో సత్తా చాటేందుకు సమాయత్తం అవుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బీఆర్‌ఎస్, బీజేపీలను స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి సత్తా చాటాలని చూస్తోంది. టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఈ మేరకు దిశానిర్దేశం కూడా చేశారు. పీసీసీ చీఫ్ భాద్యతల అనంతరం మొదటిసారి ఎన్నికలు కావడంతో స్థానిక ఎన్నికలను ఆయనతో పాటు సిఎం రేవంత్, తదీతర మంత్రులు, ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు సవాల్‌గా స్వీకరిస్తున్న తరుణంలో ప్రతిపక్షాలు సైతం స్థానిక పోరులో ఎలాగైనా అధికార పార్టీని చిత్తు చేస్తూ, గ్రామాల్లో ఆయా పార్టీల జెండాలను ఎగిరేసేందుకు తగ్గట్టుగానే పన్నాగాలు పన్నుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని నాయకత్వంపై దృష్టి సారించారు.
అభ్యర్థుల కోసం అన్వేషణ….
గ్రామ స్థాయిలో ఆర్థికంగా, సామాజికంగా బలమైన నాయకుడు ఎవరనే విషయంలో సర్వే కూడా చేయిస్తు న్నారు. బలమైన నాయకుడు, ప్రజాదరణ తోపాటు ఆర్థికంగా బలమైన నేత ఏ పార్టీలో ఉన్నా ఫర్వాలేదనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. గెలుపు గుర్రమని భావిస్తే చాలు వారిని తమ వైపు లాక్కోవాలనే ఆలోచనతో పావులు కదుపుతున్నారు. ఈ విషయంలో బీఆర్‌ఎస్ పరిస్థితి కొంత దయనీయంగా ఉన్న తమ పార్టీ నుంచి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న వారిని అడ్డుకునే ప్రయత్నంలో విఫలమవుతోంది. పార్టీ మారకుండా అడ్డుకునే స్థోమత లేక చేతులెత్తేస్తోంది. అధికారంలో లేని పార్టీలో ఉంటే ఐదేళ్ల పాటు ఏం చేయలేమని, పదేళ్లు వెనకబడి పోతామనే భావనతో సాధారణ కార్యకర్త కూడా ఆలోచిస్తున్నాడు. ఇది బీఆర్‌ఎస్‌ను దారుణంగా దెబ్బతీస్తోంది.
అధికారంలో లేని పార్టీతో ఉంటే అధికారం దక్కదేమో..?
రాష్ట్రంలో అధికారంలో లేని పార్టీతో ఇంకా కొనసాగితే స్థానిక ఎన్నికల అవకాశాన్ని చేజార్చు కున్నట్లే అవుతుందనే భావనతో ఆశావహు లున్నారు. ఇంకా బీఆర్‌ఎస్‌లోనే కొనసాగితే గ్రామస్థా యిలో అధికారం దక్కకుండా పోతుందనే భావనతో పార్టీలు మారేందుకు జంప్ జిలానీలు ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరితే అవకాశం దక్కితే పోటీ చేయవచ్చని, అదృష్టం బాగుంటే ఎన్నికల్లో గెలవొచ్చని, గెలిస్తే ఐదేళ్లపాటు అధికారానికి అధికారం, సంపాదనకు సంపాదన అనే తరహా ఆలోచనలు చేసు్త న్నారు. ఒకవేళ పోటీ చేసే అవకాశం రాకపోయినా, పోటీ చేసి గెలవకపోయినా పార్టీలో అభివృద్ధి పనుల కాంట్రాక్టులు, అధికార పార్టీని అడ్డం పెట్టుకుని ఇసుక దందాలు, పోలీస్ ఫైరవీలు, సెటిల్మెంట్లు ఒకటేమిటి అన్నీ చేయవచ్చనే ఆలోచన చేస్తున్నారు. అందుకే చాలా మంది అధికార పార్టీ వైపే అడుగులేస్తున్నారు.
ఆచి..తూచి చేర్చుకోవాలని అధిష్టానానికి సూచనలు..
ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ముందు ఆచి తూచి చేర్చుకోవాలని ఉమ్మడి జిల్లా నాయకత్వం అధిష్టానానికి సూచిస్తోంది. స్థానిక ఎన్నికల సమయంలో కొత్తగా చేరిన వారితో అప్పటికే పార్టీలో ఉన్న పాత కేడర్‌తో పడక పోతే లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుందన్న అభిప్రా యాన్ని జిల్లా నాయకత్వం అధిష్టానానికి నివేదిస్తుంది. ఈ సమస్యలన్నీ అధిగమించి ముందుకెళ్లాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముం దుకెళ్తోంది.
గతంలో పోటీ ‘ద్విముఖం’గా ఉండేది..
స్థానిక ఎన్నికల్లో గతంలో పోటీ ద్విముఖం గా ఉండేది. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు పార్టీలు బలంగానే ఉన్నాయి. దీంతో పోటీ అన్ని చోట్లా త్రిముఖంగా జరిగే అవకాశాలే ఉన్నాయని రాజకీయానుభవం ఉన్న సీనియర్లు చెబుతున్నారు. త్రిముఖం లో గెలుపు అవకాశాలు కూడా అధికార పార్టీకే ఉంటాయని చెబుతున్నారు. అందుకే ఆశావ హులంతా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. రాజకీయ వలసలు ఎక్కువగా బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకే ఉంటాయని, హిందూ ధర్మం సిద్దాంతానికి కట్టుబడి ఉన్న బీజేపీ నుంచి వలసలు చాలా తక్కువగానే ఉంటాయని రాజకీయ పరిశీలకులు చెపుతున్నారు.
ఎన్నికల్లో వ్యవస్థలు కూడా సహకరిస్తాయనే నమ్మకం..
కాంగ్రెస్ పార్టీ మద్దతుతో స్థానికంలో పోటీ చేస్తే ప్రభుత్వ వ్యవస్థలన్నీ సహకరిస్తాయనే నమ్మకం కూడా ఆశావహులకు ఉంది. ఎందుకంటే ఈ విష యాన్ని బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లపాటు ఆశావహులు ప్రతి ఎన్నికల్లో ప్రత్యక్షంగా చూసిన సందర్భాలున్నాయి. ఆ అనుభవాన్ని బట్టి వ్యవస్థల సహకారంపై కూడా నమ్మకం పెట్టుకుం టున్నారు.
– ఈదునూరి మహేష్
ఎంసిజె (జర్నలిజం), సీనియర్ జర్నలిస్ట్, 99491 34467





