యువత జీవితాల్లో వెలుగులు నిండాలి

రాజీవ్ యువ వికాసం అమలుపై  నిరంత‌ర‌ పర్యవేక్షణ
ఇందుకోసం మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించండి
జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా మంజూరు ప‌త్రాల పంపిణీ
కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

రాష్ట్రంలోని లక్షలాదిమంది యువత శక్తి సామర్థ్యాలపై అపార విశ్వాసంతో ప్రభుత్వం వేల కోట్ల పెట్టుబడి సాయం చేస్తోంద‌ని,  ఈ సహాయంతో యువత జీవితాల్లో వెలుగులు నిండాల‌ని, అదే సందర్భంలో రాష్ట్ర జిడిపి సైతం పెరిగేందుకు అవకాశం ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి రాజీవ్ యువ వికాసం అమలు ప్రగతిపై జిల్లా కలెక్టర్లతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కలెక్టర్లకు పలు కీలక సూచనలు చేశారు. గత పదేళ్ల‌లో కార్పొరేషన్ల ద్వారా మొక్కుబడిగా కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ప్రజా ప్రభుత్వం మనసు పెట్టి రూపొందించిన రాజీవ్ యువ వికాసం గతానికి చాలా భిన్నంగా ఉంటుందని డిప్యూటీ సీఎం అన్నారు. మొత్తం ఎనిమిది వేల కోట్ల పెట్టుబడితో ఐదు లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నాం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున మానవ వనరుల వినియోగం జరుగుతుంది, వ్యాపార కార్యకలాపాలు విస్తృతంగా జరుగుతాయి.

తద్వారా రాష్ట్ర జిడిపి పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంది. కాబట్టి యావత్ యంత్రాంగం ఈ పథకాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని డిప్యూటీ సీఎం అధికారులను కోరారు. ఆర్థిక సహాయం అందించాం. పని పూర్తయిందని కాకుండా లబ్ధి పొందిన యువత లాభాలు ఆర్జిస్తున్నారా ? లేదా? ఎవరికైనా ఎక్కడైనా చిన్నచిన్న ఇబ్బందులతో వ్యాపారం నిర్వహించలేకపోతే అధికారులు జోక్యం చేసుకొని వారి వ్యాపారాలను పునరుద్ధరించాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. ఐకేపీల్లో సపోర్ట్‌ సిస్టం చక్కగా కొనసాగుతుంది.  అదే తరహాలో రాజీవ్ యువ వికాసం ద్వారా లబ్ధి పొందిన వారిని నిరంతరం పర్యవేక్షించేందుకు, అవసరమైన సహాయం చేసేందుకు మండల స్థాయిలో ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని డిప్యూటీ సీఎం సూచించారు. మొదటి సంవత్సరం ఈ పథకాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని భవిష్యత్తులో మరింతగా విస్తరించుకుందామని అధికారులకు సూచించారు.

కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాల పాటు యువత ఆశలు అడియాస‌లుగా మిగిలిపోయాయి. వారి జీవితాల్లో భరోసా కల్పించాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను,  క్యాబినెట్ సహచరుడు మంత్రి పొన్నం ప్రభాకర్, నాడు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఉన్న రామకృష్ణారావు సుదీర్ఘ ఆలోచనలు చేసి రాజీవ్ యువ వికాసం పథకానికి రూపకల్పన చేశామని డిప్యూటీ సీఎం వివరించారు. ప్రభుత్వ ఆలోచనను అర్థం చేసుకొని సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, బీసీ వెల్ఫేర్ సెక్రటరీ శ్రీధర్, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రెటరీ శరత్, కార్పొరేషన్ల ఎండీలు అంతా స్పందించి పథకాన్ని చివరి దశకు చేర్చినందుకు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఇదే కమిట్మెంట్‌తో ముందుకు పోతే ప్రభుత్వం ఆశించిన ఫలితాలు నూటికి నూరు శాతం సాధిస్తామ‌న్నారు.

జూన్ 2న సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల మధ్య ప్రతి నియోజకవర్గ కేంద్రంలో రాజీవ్ యువ వికాసం పథకం కింద ఎంపికైన లబ్ధిదారులందరికీ శాంక్షన్ లెటర్లు అందజేయాలని సూచించారు. ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా , సాంస్కృతిక కార్యక్రమం, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా హాజరైన వారందరికీ వివరించాలని డిప్యూటీ సీఎం సూచించారు. ప్రజా ప్రభుత్వం ఎస్సీ కేటగిరి చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం మేరకు రాజీవ్ వికాసం లబ్ధిదారుల ఎంపిక జరిగేలా, బీసీ కార్పొరేషన్ ద్వారా కూడా బీసీ జనాభా దామాషా ప్రకారం ఎంపిక జరగాలని అందుకు తగిన విధంగా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలనీ డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ సూచించారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ శ్రీధర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *