గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల భారీ విగ్రహం ఆవిష్కరణ జరిగి రెండేళ్లు గడిచాయి. బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గతేడాది అంబేడ్కర్ జన్మదినమైన ఏప్రిల్ 14న 2023న విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ విగ్రహం భారత దేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం కావడం తెలంగాణకే గర్వకారణం. దేశ చరిత్రను ఆవిష్కరించిన మహాపురుషుల్లో డాక్టర్ భీమ్‌రావు అంబేడ్కర్ పేరు శాశ్వతంగా మెరిసిపోతుంది. ఆయన దళితులకు, సామాజికంగా బలహీన వర్గాలకు ప్రతినిధిగా కాకుండా, భారత దేశానికి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప పురుషుడిగా, చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. అటువంటి మహానేతకు అర్హమైన స్థాయిలో నివాళి అర్పిస్తూ తెలంగాణ రాష్ట్రం నిర్మించిన 125 అడుగుల విగ్రహం దేశానికే కాదు, ప్రపంచానికే గొప్ప సందేశాన్ని అందించింది.
భారత రాజ్యాంగ నిర్మాత, విద్యాధికుడు, తత్వవేత్త, సంపాదకుడు, విప్లవకారుడు, దార్శనికుడు, చరిత్రకారుడు, ప్రాసంగికుడు, రచయిత, దళిత జన బాంధవుడు, అర్ధ శాస్త్రజ్ఞుడు, స్వతంత్ర భారత తొలి న్యాయ శాఖ అమాత్యులు, న్యాయవాది, బౌద్ధ ధర్మ పునరుద్ధారకుడు, భారతరత్న డాక్టర్ భీమ్ రావు రాంజీ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్ కు ఆనుకుని ఉన్న స్థలంలో ఏర్పాటు చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఉన్న అంబేద్కర్ విగ్రహాల్లో ఇదే ఎత్తైనది. పార్లమెంటు ఆకారంలో 50 అడుగుల పీఠాన్ని నిర్మించి, దాని పైన అంబేడ్కర్ లోహ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 11.80 ఎకరాల స్థలాన్ని దీనికోసం కేటాయించారు.
125 అడుగుల ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహం 2016 ఏప్రిల్ 14న శంకుస్థాపన గావించారు. పద్మభూషణ్ రామ్ వంజి సుతార్ విగ్రహ రూప శిల్పిగా, దేశంలోనే అతి ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం చేశారు. విగ్రహ నిర్మాణం వెనుక ఉన్న శిల్పకళ, సాంకేతిక నైపుణ్యం ఎంతగానో ప్రశంసనీయం. బేస్‌మెంట్ ఎత్తు 50 అడుగులు, వెడల్పు 45.5 అడుగులు, వినియోగించిన స్టీల్ 791 టన్నులు, ఇత్తడి 96 మెట్రిక్ టన్నులు, మొత్తం వ్యయం రూ.146 కోట్లతో 425 మంది శ్రామికులు పని చేశారు. 36 ఎకరాల్లో అంబేడ్కర్ స్మృతి వనంలో రాక్ గార్డెన్, ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్, మెయిన్ ఎంట్రెన్స్, వాటర్ ఫౌంటేన్, సాండ్ స్టోన్ వర్క్, జిఆర్‌సి, గ్రానైట్ ఫ్లోరింగ్, లిఫ్ట్ ఏర్పాటు చేశారు. సందర్శకులకు అంబేడ్కర్ జీవిత తత్వాన్ని, విలువలను మరింత సజీవంగా అనుభవించేందుకు అవకాశం కల్పిస్తాయి.
నాడు ఏప్రిల్ 14నాటి విగ్రహా విష్కరణ కార్యక్రమం కోసం రూ. 10 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్, నాటి బీఆర్ఎస్ ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అంబేడ్కర్ విగ్రహం కేవలం ఒక శిల్పం కాదు – ఇది భారత సమాజంలో సమానత్వం, న్యాయం, స్వాతంత్ర్య భావాల్ని ప్రతిబింబించే ఒక భావోద్వేగ నిర్మాణం. అంబేడ్కర్ తత్వచింతన, రాజ్యాంగ రచన, దళిత సంక్షేమానికి ఆయన చేసిన పోరాటాలన్నింటినీ ఈ విగ్రహం సజీవంగా గుర్తు చేస్తుంది. ఇది భారత ప్రజాస్వామ్యానికి, హక్కుల సాధనకు నిలిచిన ఒక స్ఫూర్తిదాయక చిహ్నం. తెలంగాణ రాష్ట్ర గత ప్రభుత్వం నిర్మించిన అంబేడ్కర్ విగ్రహం కేవలం నిర్మాణంలోనే కాదు, ఆలోచనల్లోనూ, తత్వంలోనూ గొప్పది. ఇది తరతరాలకు స్ఫూర్తిగా నిలిచి, దేశవ్యాప్తంగా అంబేడ్కర్ సందేశాన్ని విస్తరించేదిగా నిలవనుంది. ఇది తెలుగువాళ్ళకే కాదు, భారతదేశానికే గర్వకారణం.
9440595494





