“ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి, నాటి సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుండి ప్రారంభించిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేస్తామని,అన్ మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించి, వివిధ రకాల సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామిని అమలు చేస్తూ,వేలాది విద్యుత్ కార్మిక కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపాలి.”

ఎంసిజె(జర్నలిజం)
సీనియర్ జర్నలిస్ట్
సెల్: 9949134467
సమాజానికి వెలుగులు పంచేందుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టి,విధి నిర్వహణే ఆరాధ్య దైవంగా భావిస్తూ, రాత్రింబవళ్ళు నిరంతరం శ్రమించే కరెంటోళ్లు తమ సమస్యల పరిష్కారానికై కదం తొక్కారు. శ్రమ దోపిడి నుండి విముక్తి కల్పిస్తూ,సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు పోరుబాట పట్టారు. తెలంగాణలోని విద్యుత్ సంస్థలైన జెన్కొ,ట్రాన్స్ కో, ఎస్పిడిసిఎల్,ఎన్పిడిసిఎల్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులు తమ హక్కుల సాధన సమ్మె తప్ప ఇతర మార్గం లేదంటూ 9 సంఘాలు ఏకతాటిపైకి వచ్చి,జేఎసిగా ఏర్పడి ఉమ్మడి పోరుకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం సుమారుగా 19061ఆర్టిజన్లుగా సేవలను అందిస్తుండగా, అందులో ట్రాన్స్ కోలో సుమారుగా 3769, జెన్ కోలో 3583, ఎస్పిడిసిఎల్ లో 8244, ఎన్పిడిసిఎల్ లో 3465 మంది ఉన్నారు.
అరకొర వేతనం,అందని సహకారం
విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న కార్మికులందరికీ ఒకే రకమైన సర్వీస్ నిబంధనలు వర్తింపజేస్తూ ఆర్టిజన్,అన్ మ్యాన్డ్,స్పాట్ బిల్లర్ల సమస్యలు పరిష్కరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్టిజన్ల కన్వర్షన్లపై ఆయా విద్యుత్ కార్మిక సంఘాలు గత 8 ఏళ్లుగా నిరంతరంగా అలుపెరుగని పోరాటాలు చేస్తున్న ప్రభుత్వాలు వారి అభ్యర్థనను తోసిపుచ్చుతూనే ఉన్నాయి. అలాగే అన్ మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించి, ఏపిఎస్ఈబి నిబంధనలు వర్తింపజేస్తూ, గృహ జ్యోతి పథకం ద్వారా బిల్లింగ్ కార్మికులను ఆదుకోవాలి. పీస్ రేట్ కార్మికులకు జీఓ నెం.11ప్రకారం కనీస వేతనాలు అమలు చేస్తూ 30 రోజుల పని కల్పించాలి. ఆర్టిజన్లను విద్యార్హత ఆధారంగా ఉద్యోగ భద్రత కల్పిస్తూ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కార్మికులందరికీ పనికి తగిన వేతనం అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
మంత్రి భట్టి ఇచ్చిన హామీని అమలు చేయాలి
విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్,అన్ మ్యాన్డ్, డిస్ట్రిబ్యూషన్ వర్కర్,బిల్ కలెక్టర్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి, నాటి సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుండి ప్రారంభించిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేస్తామని,అన్ మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించి, వివిధ రకాల సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామిని అమలు చేస్తూ,వేలాది విద్యుత్ కార్మిక కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపాలి.




