– మార్కెట్ తీరుకు అనుగుణంగా సింగరేణి ఎదగాలి
– బొగ్గుతోపాటు ఇతర మైనింగ్ రంగాల్లోకి విస్తరించాలి
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్ 17 : సుమారు 45 వేలకు పైబడిన ఉద్యోగులు ఉన్న రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ, భవిష్యత్తు తరాలకు ఉపాధిని అందించే సింగరేణి బలోపేతం కావడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం భూపాలపల్లి లోని సింగరేణి జిఎం కార్యాలయంలో ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. సింగరేణి లాభాల్లో ఉండి సంస్థ ఉద్యోగులకు, సింగరేణి ప్రాంత ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరగాలన్నది ప్రభుత్వ ప్రధాన ఆలోచన అని ఆయన తెలిపారు.గతంలో బొగ్గు రంగంలో సింగరేణి, కోల్ ఇండియా లది ఏకచత్రాధిపత్యం కానీ ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు రంగంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో మార్కెట్లో పోటీకి తట్టుకొని సింగరేణి నిలబడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రైవేట్ కంపెనీల బొగ్గు ఉత్పత్తి వ్యయం, ఆ కంపెనీలు బహిరంగ మార్కెట్లో బొగ్గు ఏ ధరకు అమ్ముతున్నాయి, సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి వ్యయం, బహిరంగ మార్కెట్లో సింగరేణి బొగ్గుకు ఉన్న ధర ఎప్పటికప్పుడు అధికారులు, సిబ్బంది పోల్చుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. ఈ ఉత్పత్తి వ్యయం, మార్కెట్లో బొగ్గు ధరలకు సంబంధించిన వివరాలను సింగరేణి కార్మికులకు అవగాహన కలిగేలా మైన్స్ వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని, సింగరేణి కార్మికులు, అధికారులకు అవగాహన కల్పించాలని సూచించారు.
మైనింగ్ రంగంలో 136 సంవత్సరాల అనుభవం ఉన్న సింగరేణి కంపెనీ బొగ్గుతోపాటు ఇతర మైనింగ్ కార్యకలాపాలపై దృష్టి పెట్టి లాభాలు ఆర్జించే ఆలోచన చేయాలన్నారు. ప్రపంచంలో ఉన్న క్రిటికల్ మినరల్స్ ఏమిటి , వాటికి ఉన్న డిమాండ్ ఎంత అన్న అంశాలపై అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్స్ ను నియమించుకోవాలని సూచించారు. భవిష్యత్తు గురించి ఆలోచన చేయకపోతే ముందు తరాలకు నష్టం చేసినట్లు అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సింగరేణిలో పూర్తిగా వ్యాపారమే కాదు మానవీయ కోణం కూడా ఉండాలని తెలిపారు. సింగరేణి మైన్ కార్యకలాపాలు జరిగే ప్రాంతం మొత్తం వరకు అక్కడి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.
భూపాలపల్లి నియోజకవర్గంలో రెండు గ్రామాలు ప్రభావితం అవుతున్నాయని స్థానికులు తెలిపారు, ఈ అంశంపై విచారణ చేయాలని, సింగరేణి మైన్స్ కోసం భూమి కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన జాబితా పై విచారించాలని అర్హుల జాబితా పంపాలని అధికారులను ఆదేశించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం కోటి రూపాయల ప్రమాద బీమా సౌకర్యం ఇటీవల కల్పించాం, సింగరేణిలోని శాశ్వత ఉద్యోగులకే కాదు కాంట్రాక్టు కార్మికులకు కూడా బోనస్ చెల్లిస్తున్న విషయాన్ని సమావేశంలో చర్చించారు. సమీక్షా సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, సింగరేణి సిఎండి బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.





