– రీ-సర్వే కోసం ఆధునిక రోవర్ల కొనుగోలు : పొంగులేటి
– డిప్యూటీ సీఎం భట్టితో బడ్జెట్ సన్నాహక సమావేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: రాష్ట్రంలో భూ లావాదేవీలను మరింత పారదర్శకంగా నిర్వహించి, ప్రజలకు ముఖ్యంగా రైతులకు అత్యుత్తమ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన మంగళవారం జరిగిన 2026-27 బడ్జెట్ సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖలకు సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పిస్తూ మంత్రి పలు కీలక అంశాలను వెల్లడించారు. భూ సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని నివారించడానికి రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం ఒక ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి అత్యాధునిక రోవర్ పరికరాలతో భూముల సర్వే నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మండలానికి ఒకటి చొప్పున 460 రోవర్లను కొనుగోలు చేశామని తెలిపారు. వచ్చే బడ్జెట్‌లో మరో 400 రోవర్ల కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. రాష్ట్రంలో నక్షా (మ్యాప్) లేని 373 గ్రామాల్లో త్వరలోనే రీ-సర్వే చేపట్టబోతున్నామని, ఇందుకు సంబంధించి 2026-27 బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించాలని ఉప ముఖ్యమంత్రిని కోరారు. ప్రస్తుతం అద్దె భవనాల్లో కొనసాగుతున్న ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలను నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజా పరిపాలన సౌలభ్యం కోసం వీటికి అవసరమైన బడ్జెట్ కేటాయింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రెవెన్యూ, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు పాల్గొని శాఖల వారీగా నిధుల అవసరాలపై చర్చించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




