శాశ్వత రవాణా సౌకర్యాలే లక్ష్యం

– రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
– మేడారంలో తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభం

ములుగు, ప్రజాతంత్ర, జనవరి 24: మేడారం జాతరకు భక్తుల సౌలభ్యం కోసం నాలుగు వేల ఆర్టీసీ బస్సులను నడుపుతున్నామని, అవసరాన్నిబట్టి మరిన్ని బస్సులు పెంచేందుకు తమ శాఖ సిద్ధంగా ఉందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. భక్తుల జాతర ప్రయాణ సేవల కోసం వందలాదిమంది అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా నియమించినట్లు తెలిపారు. మేడారాన్ని మంత్రులు పొన్నం, సీతక్కలు శనివారం సందర్శించి తాత్కాలిక ఆర్టీసి బస్టాండ్‌ను ప్రారంభించి జాతరకు రవాణా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రకటించారు. ఫిబ్రవరి 1 వరకు ప్రయాణ సేవలు నిరంతరంగా కొనసాగుతాయన్నారు. ప్రయాణికులకు రవాణా సేవలతోపాటు భద్రత, ఆరోగ్య సహాయం వంటి అంశాల్లో కూడా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భక్తులు తమ ప్రయాణాన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా పూర్తి చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆర్టీసీ బస్సులనే వినియోగించాలని మంత్రి సూచిస్తూ ఆర్టీసీ బస్సులు గద్దెలకు సమీపంలోనే దించుతాయని తెలిపారు.

శాశ్వత బస్టాండ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి : సీతక్క

మంత్రి సీతక్క మాట్లాడుతూ 2024లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం జాతరకు రవాణా మౌలిక వసతులు కల్పించాలనే దూరదృష్టితో ముందడుగు వేశారని గుర్తు చేశారు. ప్రతి జాతర సమయంలో తాత్కాలిక ఏర్పాట్లతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దీర్ఘకాలిక పరిష్కారంగా శాశ్వత ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈసారి మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా మేడారానికి వచ్చి రవాణా ఏర్పాట్లను పరిశీలించారని, భక్తులు, ప్రయాణికులు ఎలాంటి అసౌకర్యాలు ఎదుర్కోకుండా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ములుగు జిల్లాలో బస్ డిపో లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దాదాపు రూ.5 కోట్లతో శాశ్వత బస్ డిపోను మంజూరు చేసినందుకు రవాణా శాఖ మంత్రి పొన్నంకు మంత్రి సీతక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రూ.7 కోట్లతో ఏటూరునాగారంలో డిపోను మంజూరు చేశామన్నారు. ఏటూరునాగారంలో డిపో ఏర్పాటు చేస్తే అటవీ ప్రాంతాలు, భద్రాచలం, మంగపేట, వాజేడు, వెంకటాపురం వంటి ప్రాంతాలన్నీ సమగ్రంగా కవర్ అవుతాయని స్పష్టం చేశారు. అందుకే ఏటూరునాగారమే అనుకూల ప్రాంతమని సూచించగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. మంగపేట, ములుగు తదితర మండలాల్లో మినీ బస్ స్టేషన్లను కూడా మంజూరయ్యాయని చెప్పారు. రాబోయే రోజుల్లో బీసీ సంక్షేమ శాఖ ద్వారా మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ ఏటూరునాగారం ప్రాంతంలో బస్ డిపో మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అటవీ ప్రాంతం కావడంతో ఇక్కడినుంచి భద్రాచలం సహా ఇతర ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు పరిమితంగా ఉండేవని, బస్సు డిపో ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలు, భక్తులకు శాశ్వత పరిష్కారం లభించిందని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకున్నందుకు మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కరీంనగర్ ఈడీ మునిశేఖర్, సొలోమన్ ఈడీ-ఇంజనీరింగ్, వెంకన్న-సీటీఎం(ఎం అండ్ సీ) , శ్రీధర్- వరంగల్ ఆరఎం, విజయభాను-డిప్యూటీ ఆరఎం వరంగల్, భానుకిరణ్ తదితరులు పాల్గొన్నారు.

జాతరలో శిశువులకు పాలిచ్చే గది ప్రారంభం

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో చిన్న పిల్లతో జాతరకు వచ్చే మహిళల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన (బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్) శిశువులకు పాలిచ్చే గది రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీమతి దనసరి అనసూయ సీతక్క గారు,జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ గారు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేఖన్ గారు శిశు సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు మేడారం జాతరలో బాలింతలు పిల్లలకు పాలు ఇవ్వడానికి ఇబ్బంది పడకుండా ఉండడానికి శిశువులకు పాలిచ్చే గదిని ప్రారంభిస్తున్నామని జాతరలో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ వినియోగించుకోవాలని మంత్రి సీతక్క గారు అన్నారు


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *