‘‘కులగణనపై రాహుల్ గాంధీకి ఉన్న విజన్ ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఆధిపత్య వర్గాల నాయకత్వానికి లేదని తేలిపోయింది. 2021 లో జనగణన తో పాటు కులగణన చేపట్టేలా జనాభా లెక్కల సేకరణ విభాగాన్ని ఆదేశించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖాలు చేసిన అభ్యర్థనను బిజెపి వ్యతిరేకిస్తూ కులగణన కు సంబంధించి ఏలాంటి ఆదేశాలు ఇవ్వొద్దు.. ఆ సమాచారం సేకరించడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది.ఇది బిజెపి విధానం.తెలంగాణ లో ప్రధాన ప్రతిపక్ష హోదా లో ఉన్న బిఆర్‌ఎస్ కూడా కులగణన విషయంలో కుట్రలతో ఉన్నారని అనాడు నివేదిక బహిర్గతం చేయకపోవడంతో తెలిసిపోయింది. మొత్తం గా కులగణన ను రాజకీయ పార్టీ లు రాజకీయ చదరంగంలో పావుగా వాడుకుంటున్నారనేది తెలంగాణ దళిత బహుజన మైనారిటీ సమాజం గమనించాలి.’’
రాహుల్‌గాంధీ విశాల దృక్పథంతో జాతీయస్థాయిలో కులగణన ఎజెండాగా పెట్టుకొని సామాజిక న్యాయం సంపూర్ణంగా అమలు కావాలని ఆకాంక్షించారు. ఈ కులగణన జరగడం ద్వారా రిజర్వేషన్ల శాతం లో మార్పు సంభవించి,ఆర్థిక స్థితిగతులు అంచనా వేసుకొని రాజకీయంగా, ప్రభుత్వ పథకాల విషయంలో ఆయా సామాజిక వర్గాల జనాభా నిష్పత్తి ప్రకారం సంపద వికేంద్రీకరించబడి లబ్ధి చేకూరుతుందని రాహుల్ గాంధీ నొక్కి చెప్పిన విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి గుర్తు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా కులగణన జరగాలని ముందుకు సాగుతున్న సందర్భంలో తెలంగాణలో 2023 అసెంబ్లీ సాధారణ ఎన్నికల ప్రచారంలో కామారెడ్డి సభలో కాంగ్రెస్ బి.సి డిక్లరేషన్ ప్రకటించింది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపే కులగణన చేసి బిసి కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థలల్లో ప్రస్తుతం ఉన్న 23% బి.సి రిజర్వేషన్లను 42% పెంచుతామని,23,973 మంది బి.సిలకు అదనంగా పంచాయితీలలోను, మున్సిపాలిటీలలోను ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఇదే సందర్భంలో స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్ల ఉప వర్గీకరణ కూడా చేస్తామని స్పష్టం చేశారు.
సాధారణంగా జనాభా లెక్కలు చేస్తున్న క్రమంలో దేశంలోని ఎస్సీ ఎస్టీలను లెక్కించడం జరుగుతుంది.కాని సమాజంలో సగభాగం ఉన్న బి.సి ల లెక్కలను మాత్రం తేల్చరు,ప్రభుత్వాల దగ్గర ఉన్నా వెల్లడిరచరు. కులగణన హమీతో పాటు బిసి డిక్లరేషన్ లో భాగంగా బిసిలకు చేతివృత్తులకు,వివిధ సామాజిక వర్గాలకు అనేక హామీలను ఇవ్వడం జరిగింది.ఆ విషయాలన్నింటిని పక్కకు పెడితే..అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనకి సంబంధించి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది.రాష్ట్ర ప్రణాళిక శాఖా అధ్వర్యంలో 50 రోజులపాటు చేసిన సామాజిక,ఆర్థిక,విద్య,ఉద్యోగ,రాజకీయ, కులగణన సంబంధించినటువంటి సర్వే నివేదికను క్యాబినెట్ సబ్ కమిటీకి అప్పగించింది.ఆ సబ్ కమిటీ మరియు అసెంబ్లీ వేదికగా వెల్లడిరచిన కులగణన విషయాలన్ని తెలంగాణ సమాజాన్ని తీవ్ర విస్మయానికి గురిచేసింది.మొత్తంగా కాంగ్రెస్ చేపట్టిన సర్వే తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్న ఈ సందర్భంలో పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉన్న లెక్కలను తీసుకొని వాస్తవికమైన సమాచారాన్ని,సర్వే జరిగిన విధానంను తెలంగాణ సమాజం ముందు ఉంచాల్సిన అవసరం విద్యావంతులు గా మా పై ఉన్నది.
1991 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా(కులంతో సంబంధం లేకుండా) 2,60,89,74 గా ,2001 లెక్కల ప్రకారం 3,09,87,271,2011 జనాభా లెక్కల ప్రకారం 3,50,03,674 రికార్డు ఐనది.1991 లెక్కలతో పోలీస్తే 2001 నాటికి తెలంగాణలో 14.59% జనాభా పెరిగింది.2001 లెక్కలతో పోలిస్తే 2011 నాటికి తెలంగాణ జనాభా 13.58% పెరిగినది.ఇవ్వన్ని అధికారికమైన గణాంకాలే.ఈ లెక్కలు ఇలా ఉంటే కేసీఆర్ ముఖ్యమంత్రి గా 2014 ఆగస్టు లో చేసిన సమగ్ర కుటుంబ సర్వే అధికారికంగా ఆయన ప్రకటించకున్నా(ప్రకటించకపోవడం చారిత్రక తప్పిదం) పబ్లిక్ డొమైన్((MCHRDI)) లో ఉన్న ప్రకారం జనాభా
ఎస్సీ 63,60,158(18%)
ఎస్టీ 36,02,288(10%)
బి.సీ1,85,61,856(51%)
ముస్లీం 46,25,062(13%)
ఓ.సి 31,29,160(8%)
బౌద్దం,జైనులు, సిక్కులు, ఇతరత్రా కలిపి మొత్తం 3,68,76,544 జనాభా లెక్కలను తేల్చింది.
2024 లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నవంబర్ లో చేసిన సామాజిక,ఆర్థిక,విద్య, ఉపాధి,రాజకీయ,కుల సర్వే ప్రకారం అసెంబ్లీ వేదికగా ఆమోదించిన జనాభా వివరాలు
ఎస్సీ 61,84,319((17.43%)
ఎస్టీ 37,05,929(10.48%)
బి.సీ 1,64,09,179(46.25%)
ముస్లీం బి.సీ 44,59,012(12.56%)
ముస్లీం ఓ.సి 8’80,424(2.48%)
ఓ.సి 47,19,115(13.31%)
మొత్తం 3,54,77,554
సర్వే లో పాల్గొనని వారు 3.1% పేర్కొన్నది. (సుమారు 10,60,000).
2023-2024 కు సంబంధించి తెలంగాణ లోని వోటర్ల సంఖ్య 3,32,16,348..
ప్రభుత్వ అధికారిక వివరాల ప్రకారం
0-6 సంవత్సరాల వారు 38,99000
అప్పర్ ప్రైమరీ విద్యార్థులు 8,68,377
ప్రైమరీ విద్యార్థులు 10,35,781
హైస్కూల్ విద్యార్థులు 37,13,040
ఇంటర్మీడియట్ విద్యార్థులు 6,13,306
మొత్తంగా 4,34,5,852.
తెలంగాణ లో ఆధార్ కార్డ్ దారుల సంఖ్య 3,80,00,000.
పైన పేర్కొన్న గణాంకాలన్ని అధికారికంగా ఆయా ప్రభుత్వాలు చూపించిన లెక్కలే .కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా చెప్పిన కులగణన లెక్కలు పైన పేర్కొన్న ఏ లెక్కలతో పోల్చి చూసినా 100% తప్పుల తడకగానే కనపడుతుంది.ఇట్టి లెక్కల విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని శంకించాల్సి వచ్చింది.2014 నాటి సమగ్ర కుటుంబ సర్వే లెక్కలతో 2024 నాటి కాంగ్రెస్ ప్రభుత్వ కుల గణన లెక్కలను పోల్చి చూస్తే జనాభా సంఖ్య పెరగక పోగా మొత్తంగా జనాభా సంఖ్యని తగ్గినట్లుగా కనపడుతుంది.ఈ విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు గానీ,కుల సంఘాలు,ప్రజాసంఘాలు గాని లేవనెత్తితే 2014లో కేసీఆర్ సర్వే చేసింది వాస్తవమే కానీ ఆ ప్రభుత్వం అధికారికంగా ఏలాంటి నివేదికను విడుదల చేయలేదని, శాసనసభలో గాని,ప్రజల ముందు గాని పెట్టలేదని, కాబట్టి అది ప్రామాణికం కాదని కాంగ్రెస్ మంత్రివర్గం ఆరోపిస్తుంది.
కేసీఆర్ ఆనాడు అధికారికంగా బయట పెట్టలేదు సరే కాని ఈ రోజైనా ఆ నివేదిక ను కాంగ్రెస్ ప్రభుత్వం బహిర్గతం చేయవచ్చు కదా.! కాంగ్రెస్ ప్రభుత్వ నివేదికే సరైనదని నిరూపించుకోవచ్చు .! ఒకవైపు సమగ్ర సర్వే సరైనది కాదంటూనే, మరోవైపు ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ కేసీఆర్ ఓ.సీ(ముస్లీం లతో కలిపి)లను 21% చూపిస్తే,మేము 15.79 %(ముస్లీంలు లేకుండా) చూయించినం అంటున్నారు. కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే విషయంలో ముఖ్యమంత్రి మరియు మంత్రులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం వారి అవగాహనా రాహిత్యానికి నిదర్శనంగా కనపడుతుంది.ఎంహెచ్‌ఆర్డిసి అనేది ప్రభుత్వ సంస్థనే .! ప్రైవేట్ ఏజెన్సీ కాదు.అందులో ఉన్న లెక్కలు ఏలా తప్పవుతాయి.? అనేది ప్రభుత్వం పునరాలోచన చేయాలి.ఒక వేళ కేసీఆర్ సమగ్ర సర్వే సరైనది కాదని కాసేపు అనుకుంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన కులగణన జనాభా సంఖ్యను,2011 కేంద్ర జనాభా(తెలంగాణ) లెక్కలతో పోలిస్తే 2001-2011 రేషియో ప్రకారం 13.58% తెలంగాణ జనాభా పెరిగింది.ఈ నిష్పత్తి ప్రకారం తెలంగాణ జనాభా (2011 నుండి) 13 ఏండ్ల కాలంలో కనిష్ఠంగానైనా దరిదాపుగా 80 లక్షల జనాభా పెరగాలి. మొత్తం గా తెలంగాణ లో 4 కోట్ల జనాభా లెక్కలు దాటాలి .ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీ మొత్తంగా అసమగ్ర లెక్కలతో కూడిన నివేదిక అసెంబ్లీలో ఆమోదించారనే అనుమానం కలుగుతుంది.
తెలంగాణ విషయంలో వేసిన శ్రీకృష్ణ కమిటీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ బహుజన కులాలకు రాజకీయ ప్రాధాన్యత మరియు అభివృద్ధిలో భాగస్వామ్యం దక్కుతుందని స్పష్టం చేసింది.1969 నుండి ఇప్పటి వరకు జరిగిన ఉద్యమాలు అన్ని కూడా ఈ వర్గాల పునాదిగానే జరిగాయి.భవిష్యత్తులో ఈ తరహా ఉద్యమాల నుండి దూరం చేయడానికి చేసిన ఒక కుట్రగా కులగణనను చూడవచ్చు.ప్రజలకు రాజకీయ,ఆర్థిక ప్రజాస్వామ్యానికి దూరం చేయడంలో భాగంగానే ఈ గణాంకాలను చూడాల్సి ఉంది. ఈ వర్గాల అభివృద్ధికి అందించాల్సిన రాజ్యాంగపరమైన చేయూతను పరిమిత స్థాయికి కుదించడం కూడా ఒక వ్యూహంగా భావించవచ్చు.ఈ ఆధిపత్య రాజకీయ పార్టీలకు కులగణన ప్రధాన ఎజెండా కాలేకపోయింది. కుట్రలు కుతంత్రాలతో చేసిన లెక్కలతో తమ తమ పార్టీల ఆధిపత్య స్థానాన్ని పదులపరుచుకుంటున్నాయి.
ఈ అరకొరా లెక్కలతో వెనుకబడిన కులాలకు భవిష్యత్ లో తీవ్రమైన నష్ఠం వాటిల్లే ప్రమాదం ఉన్నది.
అంతిమంగా కులగణనపై రాహుల్ గాంధీకి ఉన్న విజన్ ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఆధిపత్య వర్గాల నాయకత్వానికి లేదని తేలిపోయింది. 2021 లో జనగణన తో పాటు కులగణన చేపట్టేలా జనాభా లెక్కల సేకరణ విభాగాన్ని ఆదేశించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖాలు చేసిన అభ్యర్థనను బిజెపి వ్యతిరేకిస్తూ కులగణన కు సంబంధించి ఏలాంటి ఆదేశాలు ఇవ్వొద్దు.. ఆ సమాచారం సేకరించడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది.ఇది బిజెపి విధానం.తెలంగాణ లో ప్రధాన ప్రతిపక్ష హోదా లో ఉన్న బిఆర్‌ఎస్ కూడా కులగణన విషయంలో కుట్రలతో ఉన్నారని అనాడు నివేదిక బహిర్గతం చేయకపోవడంతో తెలిసిపోయింది.మొత్తం గా కులగణన ను రాజకీయ పార్టీ లు రాజకీయ చదరంగంలో పావుగా వాడుకుంటున్నారనేది తెలంగాణ దళిత బహుజన మైనారిటీ సమాజం గమనించాలి.
పందుల సైదులు
తెలంగాణ విద్యావంతుల వేదిక
9441661192