ఐఐటి రూర్కీ సౌజన్యంతో అధ్యయనానికి ఆదేశాలు
అనుమల చెక్ డ్యామ్ కు అనుమతులు మంజూరు
నెల్లికల్లు ఎత్తిపోతల పథకం ఫేజ్-1 పనులు పూర్తిచేయాలి
వొచ్చే ఖరీఫ్ నాటికి నీళ్లు అందించాలి
ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించి ఆయకట్టను విస్తరించండి
నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
నాగార్జున సాగర్ డామ్‌పై పడిన గుంటలను పూడ్చివేతకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అందుకు రూర్కీ ఐఐటీ ఆధ్వర్యంలో అధ్యయనం చేయాలని ఆయన నీటిపారుదల శాఖాధికారులను ఆదేశించారు నెల్లికల్లు ఎత్తిపోతల పథకం ఫేజ్-1పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. వొచ్చే ఖరీఫ్ నాటికి నీళ్లు అందించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని నెల్లికల్లు ఎత్తిపోతల పథకంతో సహా హైలెవల్, లోలెవల్,లింక్ కెనాల్‌లతో పాటు సాగర్ డ్యామ్ మీద పడిన గుంతల పూడ్చివేతపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జలసౌధలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు జయవీర్ రెడ్డి, మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్,ఆర్&ఆర్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, ఇఎన్‌సి అనిల్ కుమార్,ఇఎన్‌సి ఓ&యం విజయభాస్కర్ రెడ్డి, డిప్యూటీ ఇఎన్‌సి కె.శ్రీనివాస్, నల్గొండ ఎస్ఇ అజయ్ కుమార్ సిఇకే. శ్రీధర్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ జలాశయం నుంచి నీటిని అందించే నెల్లికల్లు ఎత్తిపోతల పథకం పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రూ.664.80 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ఎత్తిపోతల పథకం పూర్తయితే 24,624 ఎకరాల ఆయకట్టు సేద్యంలోకి వొస్తుందన్నారు. ఖరీఫ్ సీజన్ నాటికి మొదటి దశ పూర్తయితే 7,600 ఎకరాలకు నీరందించవచ్చన్నారు. అంతే గాకుండా హైలెవల్, లోలెవల్ కెనాల్స్ మధ్యలో చేపట్టిన లింక్ కెనాల్ పనులను వేగవంతం చేయాలన్నారు. 15 కిలోమీటర్ల పరిధిలో రూ.62.26 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఈ కాలువ నిర్మాణానికి కావలసిన 65.02 ఎకరాలకు గాను ఇప్పటికే 43.31 ఎకరాల భూమిని సేకరించినట్లు ఆయన తెలిపారు.
త్వరితగతిన టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. చివరి భూములకు నీరు అందేలా ఏయంఆర్. ,ఎస్.ఎల్.బి.సి ప్రాజెక్ట్ ల పరిధిలోని 90.43 కిలోమీటర్ల మేర కాలువలను రూ.42.26 కోట్ల వ్యయంతో 60 మిల్లీమీటర్ల మేర కాంక్రీట్ లైనింగ్ తో మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు సాగర్ ఆయకట్టు పరిధిలోని 39 ఐ. డి.సి ఎత్తిపోతల పథకాలలో ఎక్కువ భాగం పనిచేయడం లేదని, పనిచేయని వాటిని గుర్తించి మరమ్మతులకు అయ్యే వ్యయం తాలూకు అంచనాలు రూపొందించిన సత్వరమే పునరుద్ధరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అనుమల చెక్ డ్యామ్ నిర్మాణానికి పాలనా పరమైన అనుమతులు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.




