ప్ర‌శ్నార్థ‌కంగా తెలంగాణ అస్తిత్వం..!?

ఎన్నో ఏళ్ల‌ తెలంగాణ కల సుదీర్ఘ పోరాటం తర్వాత నెరవేరినప్పటికీ తిరిగి నిధులు, నీళ్లు, నియామకాల రూపంలో ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ సంస్కృతి, ప్రజల జీవన విధానం నుంచి తెలంగాణ అనే భావన రూపుదిద్దుకొంది. 1959 ముల్కీ, నాన్-ముల్కీ సమస్యల నుంచి, 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమం వరకు తెలంగాణ అనబడే ప్రాంతీయ భావన బలపడడానికి ఈ ప్రాంత ప్రజలు సాంస్కృతిక, వనరులు దోపిడీ, వివక్షే కారణంగా ఉంది. 1969లో తెలంగాణ ప్రాంతీయ ఆకాంక్షతో ఎన్నికల్లో పోటీ చేసి తెలంగాణ ప్రజా సమితి తెలంగాణలో ఒక్క ఖమ్మం స్థానం స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం తప్ప తెలంగాణలోని అన్ని స్థానాల్లో విజయం సాధించింది. అటు తర్వాత తొలిదశ ఉద్యమాన్ని నెత్తురుటేరుల్లో ముంచి, వందలాది విద్యార్థుల త్యాగాలు చరిత్రగా మిగిలింది. అటు రాజీ రాజకీయ క్రీడలతో ఆనాటి పాలకులు ఉద్యమ వేడిపై నీళ్లు చల్లారు. అయినప్పటికీ చల్లారని తెలంగాణ కాంక్షను 1996 నుంచి తెలంగాణ విద్యావంతులు వేదిక తదితరుల పేరుతో తెలంగాణ సైద్ధాంతిక సారాన్ని బ‌తికిస్తూ వొచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్, కేశవరావు జాదవ్, కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వారు తెలంగాణ భావజాలం, సైద్ధాంతిక నేపథ్యం బ‌తికించడంలో విశేషమైన కృషి చేశారు.

తెలంగాణ అనే భావం కూడా బయటకు రాకుండా అడ్డుకున్న పాలకుల జాబితాలో కాంగ్రెస్, టిడిపి రెండు చేరిపోయాయి. అప్పటికీ రెండు రాష్ట్రాల్లో నామమాత్ర ప్రాబల్యం కలిగిన బిజేపి తన ఎన్నికల ప్రణాళికలో ఒక ఓటు, రెండు రాష్ట్రాలు నినాదం తమ ప్రణాళికలో పెట్టుకున్నప్పటికీ క్రియాశీలక ప్రయత్నాలు చేయలేదు. 2001తర్వాత టిడిపి పార్టీ నుంచి బయటకు వొచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు” తెలంగాణ రాష్ట్ర సమితి “ స్థాపించి తెలంగాణ పేరుతో ఉన్న ఆలే నరేంద్ర, విజయశాంతి లాంటి వారిని ప్రధాన స్రవంతిలో చేర్చుకొని మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర నిర్వర్తించారు. సంకీర్ణ రాజకీయ ఎత్తుల‌తో బలాన్ని పెంచుకొన్న టీఆర్ఎస్ ఒక రకంగా తెలంగాణ ఉద్యమం వైపు అన్ని పార్టీలు మోగ్గు చూపేలా చేసిన రాజకీయ వ్యూహం నెరవేరడం, తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల నుంచి తెలంగాణ అస్తిత్వం కోరుతూ లాంగ్ మార్చ్, సకల జనుల సమ్మె లాంటి అనేక కీలక ఉద్యమాలు జరగడం, అనేక మంది యువకులు బలిదానాలు చేసుకోవడంతో తెలంగాణ ఏర్పాటు అనివార్యమైంది. 2014 జూలై 2న తెలంగాణ ఏర్పడిన తర్వాత స్వల్ప మెజారిటీతో రాష్ట్ర‌ ప్రజలు తెలంగాణ ఉద్యమం లో కీలక పాత్ర నిర్వర్తించిన కేసీఆర్ కు అధికారం అందించారు. 2014-19 వరకు కేసీఆర్ తెలంగాణ అబివృద్ధి దిశగా అనేక చర్యలు చేపట్టారు.

మిషన్ కాకతీయ, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం, నిరుద్యోగులకు ఉద్యోగం కల్పన, రైతులకు అవసర‌మైన  పథకాలు, కళ్యాణల‌క్ష్మీ లాంటి పథ‌కాలను అమలు పరచడం, తెలంగాణ సచివాలయం, అమరవీరుల స్థూపం, ప్రగతిభవన్ నిర్మాణంతో పాటు అన్ని జిల్లాల్లో సమగ్ర కార్యాలయాల నిర్మాణం తెలంగాణ పునరాబివృద్దికి సంకేతాలుగా నిలిచాయి. రాజకీయ స్థిరత్వం పేరుతో కేసీఆర్ ప్రతిపక్ష పార్టీల సభ్యులను చేర్చుకోవడం, కుటుంబ సభ్యులకు రాజకీయ ప్రాధాన్యం కల్పించడం లాంటి చర్యలు ఆయనలోని ఉద్యమకారుని స్ఫూర్తి ని తగ్గించాయి. 2019 -2024 మధ్య‌ చేపట్టిన పరిపాలనా చర్యలు సాధారణ ప్రజల్ని అతలాకుతలం చేశాయి. కుటుంబ జోక్యం మితిమీరడం, సమైక్య వాదులకు తిరిగి రాజకీయ ప్రాధాన్యత కలిగించి అందలాలు ఎక్కించడం, పెరిగిన అప్రజాస్వామిక వాతావరణం, దిగువ స్థాయి వరకు విస్తరించిన అవినీతికర విధానాలు , అసలు ఉద్యమ సంస్థ టీఆర్ఎస్ స్థానంలో పార్టీని జాతీయ స్థాయికి బిఆర్ఎస్‌  గా విస్తరణ కాంక్ష వెరసి ఆ పార్టీ పరాజయానికి కారణమయ్యాయి. కేసీఆర్ కొంత నీళ్లు ,నిధులు, నియామకాలు దిశగా కొంత ప్రయత్నం చేసినప్పటికీ పునాది అంశం అయిన తెలంగాణా అస్థిత్వం కు జరుగుతున్న నష్టాన్ని అనేక ఉద్యమాల స్ఫూర్తి ఉన్న ప్రజలు జీర్ణించుకోలేక పోయారు.ఇక తెలంగాణా ఇచ్చిన పార్టీగా అధికారం కోరిన కాంగ్రెస్ కు ప్రజలు అధికారం కట్టబెట్టినప్పటికీ ఏడాదిన్నర కాలంలో ఆపార్టీ తెలంగాణ స్ఫూర్తిని నిలబెట్టుకోలేక పోయింది. తెలంగాణ అధికార గీతం ప్రకటన, తెలంగాణ తల్లి రూపం మార్చడం తెలంగాణ అస్తిత్వం నిలబెట్టడం కానే కాదు!? ప్రకటించిన ఏ పథకం సంపూర్ణంగా అమలు చేయలేక పోవడం ప్రధానం బలహీనత గా కనిపిస్తుంది.

తెలంగాణ ఆవిర్భావ దినం సైతం తెలంగాణ స్ఫూర్తితో జరగాల్సి ఉండగా గద్దర్ పేరుతో ప్రకటించిన అవార్డులు వివాదాస్పదం చేశారు. గత పదేళ్ల‌గా తెలంగాణ స్ఫూర్తి పేరుతో కాళోజీ నారాయణరావు అవార్డులు పైరవీలకు, సిఫార్సులకు తలొగ్గినా కొంత తెలంగాణ భావాన్ని స్ఫురింప జేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమైక్య వాదానికి ప్రతీకలైన ఆంధ్రా యాక్టర్ లకు, ఆంధ్రా సమర్థకులను ముఖ్యంగా మురళీమోహన్ లాంటి వారిని కమిటీగా పెట్టి, ఎంపికను వివాదాస్పదంగా మార్చడం తెలంగాణ స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా ఉంది. రజాకార్, మరికొన్ని రాజ్యాంగ విరుద్ధ‌మైన సినిమాలకు, సమైఖ్య వాదులుగా పేరుబడ్డ ఆంధ్రా నటులకు అవార్డులు ఇవ్వడం వివాదాస్పదమైంది. ఇక కాంగ్రెస్ ఏడాదిన్నర కాలంలో నియమించిన నామినేటెడ్ పోస్టుల్లో ఆంధ్రా మూలాలు ఉన్నవారికి పెద్దపీట వేయడం తెలంగాణ ప్రజలకు ఒకరకంగా మింగుడు పడడం లేదు!? మరోవైపు సమైక్య వాదం ముద్ర పడి ఆంధ్రాలో అధికారం అనుభవిస్తున్న టిడిపి, జనసేన లాంటి పార్టీలు, బిజేపితో కలిపి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే రాజకీయ వాసనలు సైతం తెలంగాణ వాదులు జీర్ణం చేసుకోలేని స్థితి! తెలంగాణ పాలకులు ఆంధ్రా పాలకులతో ఉన్న ఏ రకమైన సయోధ్య ను తెలంగాణవాదులు ఇష్టపడడం లేదు? ఇవన్నీ తెలంగాణ రాజకీయ అస్తిత్వానికి ప్రమాదకరమైనవే అన్న భావన తెలంగాణ ప్రజల్లో ఉంది.”ఆవుచేలో చేస్తుంటే దూడ గట్టున మేస్తుందా!?” అన్న విధంగా ఏడాదిన్నర కాంగ్రెస్ పరిపాలనలో చాలా ప్రభుత్వ కార్యాలయాలు అవినీతమయయ్యాయి. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన ఏసిబి దాడులు,పెరిగిన కేసులే అందుకు నిదర్శనం! ఇంకా మూడున్నరేళ్ల‌ పాలన తెలంగాణ  అస్థిత్వం కాపాడుతూ అభివృద్ధిని చిత్తశుద్ధితో పెంచినప్పుడే ప్రజల్లో సానుకూలత ఉంటుంది. ఎంతైనా కేసీఆర్ లాంటి వారినే ఫాంహౌస్ లో కూర్చోబెట్టిన చైతన్యం తెలంగాణ ప్రజలదని ప్రస్తుత పాలకులు గుర్తించి మెలగాలి. తెలంగాణ అస్తిత్వం కోసం నిరంతరం పోరాడుదాం! కాపాడుకుందాం! జై తెలంగాణ‌, జైజై తెలంగాణ..!

– ఎన్.తిర్మల్,
( సీనియర్ జర్నలిస్టు, రచయిత,సామాజిక కార్యకర్త)
 సెల్ : 9441864514,
ఇమెయిల్: thirmal.1960@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *