కొంప ముంచిన అత్యుత్సాహం!

ఒక స‌మ‌స్య ప‌రిష్కారానికి ప్ర‌భుత్వాలు తీసుకునే కొన్ని నిర్ణ‌యాలు సామాన్యులపై ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూప‌డ‌మే కాదు, వారి జీవ‌న విధానాన్ని త‌ల్ల‌క్రిందులు చేస్తాయ‌న‌డానికి గొప్ప ఉదాహ‌ర‌ణ‌, ప‌దేళ్లు దాటిన డీజిల్ వాహ‌నాలు ప‌దిహేనేళ్ళు దాటిన పెట్రోల్ వాహ‌నాల‌కు జులై 1వ తేదీనుంచి బంకుల్లో ఇంధ‌నం నింపొద్ద‌ని దిల్లీ ప్ర‌భుత్వం ఇచ్చిన ఆదేశాలు! త‌క్ష‌ణం ఈ ఉత్త‌ర్వుల ప్ర‌భావం 62ల‌క్ష‌ల వాహ‌నాల‌పై ప‌డుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ  పీక‌ల్లోతు అవినీతిలో కూరుకుపోయింద‌న్న కార‌ణంగా బీజేపీ ప్ర‌భుత్వానికి అధికారం క‌ట్ట‌బెట్టిన నేరానికి ఇప్పుడు దిల్లీ వాసుల ప‌రిస్థితి పెనం మీద‌నుంచి పొయ్యిలోకి ప‌డిన చందంగా మారింది. దీనికి తోడు ఈ నిబంధ‌న‌ను హ‌ర్యానా, రాజ‌స్థాన్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ల్లో విస్త‌రించి ఉన్న  నేష‌న‌ల్‌ కేపిట‌ల్ రీజియ‌న్ మొత్తానికి 2026 నాటికి వ‌ర్తింప‌జేయాల‌న్న‌ది ల‌క్ష్యం. అంటే ఈ ప్రాంతంలోని 106 ల‌క్ష‌ల వాహ‌నాల‌కు వాటి య‌జ‌మానులు నీళ్లొదులుకోక త‌ప్ప‌దు! ఈ నేప‌థ్యంలో బీజేపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు బూమ‌రాంగ్ అయి రాజ‌ధాని వాసుల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది.

తాజాగా నిర్వ‌హించిన స‌ర్వేలు 79శాతం మంది వాహ‌న‌దారులు ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వ‌డంతో దిల్లీ ప్ర‌భుత్వ పెద్ద‌లు త‌ల‌ప‌ట్టుకోవాల్సి వొచ్చింది. త‌క్ష‌ణ‌మే జ‌రిగిన న‌ష్టాన్ని స‌రిచేసే య‌త్నాల్లో భాగంగా ఈనెల 3న క‌మిష‌న్ ఫ‌ర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ఛైర్మ‌న్ రాజేష్ వ‌ర్మ‌కు, దిల్లీ మంత్రి మంజింద‌ర్ సింగ్ సిర్సా ఒక లేఖ రాస్తూ, ఈవిధంగా కాలప‌రిమితి ముగిసిన వాహ‌నాల్లో ఇంధ‌నం నింప‌కుండా విధించిన బ్యాన్‌ను ఎత్తేయాల‌ని, దీన్ని అమ‌లు చేయ‌డంలో ఎన్నో సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర్కొనాల్సి వొస్తున్న‌ద‌ని పేర్కొన్నారు. దిల్లీ ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే క‌ళ్లు తెర‌వ‌డానికి ప్ర‌ధాన కార‌ణం, ప్ర‌జ‌ల్లో వొస్తున్న వ్య‌తిరేక‌తే. ముఖ్యమంత్రి రేఖా గుప్తా దీన్ని అమ‌లు చేయ‌డానికి స‌రైన యంత్రాంగం లేద‌న్న కార‌ణాన్ని చెబుతున్నా, ప్ర‌జ‌లు ముఖ్యంగా మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల వ్య‌తిరేక‌త‌కు భ‌య‌ప‌డే వెన‌కడుగు వేసింద‌ని అనుకోవాలి. అంతేకాదు దిల్లీ లెఫ్ట్ నెంట్ గ‌వ‌ర్న‌ర్ స‌క్సేనా ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై చివాట్లు పెడుతూ లేఖ రాయ‌డం కూడా ముఖ్య‌మంత్రి రేఖా గుప్తా ప్ర‌భుత్వం వెనుక‌డుగుకు మ‌రో కార‌ణం.

కాల‌ప‌రిమితి ముగిసిన అన్ని వాహ‌నాల‌ను ఒకే గాట‌న క‌ట్ట‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌న్న‌ది ఇక్క‌డ ప్ర‌ధాన ప్ర‌శ్న‌!  కాల‌ప‌రిమితి ముగియ‌ని ఎన్నో వాహ‌నాలు కాలుష్యాన్ని పెద్ద ఎత్తున వెద‌జ‌ల్లుతుండ‌టం మ‌నం చూస్తూనే ఉన్నాం! అందువ‌ల్ల ఒక వాహ‌నానికి ఇంధ‌నం నింప‌కుండా బ్యాన్ విధించ‌డానికి కాల‌ప‌రిమ‌తి కంటే అవి తిరిగిన మైళ్ళు , వెద‌జ‌ల్లే కాలుష్యాన్ని బ‌ట్టి త‌గిన నిర్ణ‌యం తీసుకోవాలి.  వెన‌కాముందూ ఆలోచించ‌కుండా తీసుకున్న నిర్ణ‌యం వ‌ల్ల 80 ల‌క్ష‌ల ద్విచ‌క్ర‌వాహ‌నాలు, 26ల‌క్ష‌ల నాలుగు చ‌క్రాల వాహ‌నాలను ప‌క్క‌న‌బెట్టి వాటి స్థానంలో కొత్త‌వాటిని కొనుక్కోమ‌ని నిర్బంధించిన‌ట్ట‌యింది. ఇప్ప‌టిక‌ప్పుడు త‌మ వాహ‌నాల‌ను తెగ‌న‌మ్ముకోవాలంటే, కొన్న‌ధ‌ర‌లో పావు వంతు కూడా రాని దుస్థితి! కొంద‌రు తెలివైన వాహ‌న‌దార్లు, చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌కు వెళ్లి మ‌రీ త‌మ వాహ‌నాల్లో ఇంద‌నం నింపుకొని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. కానీ ఇలా ఎంతకాలం?  దేశ‌రాజ‌ధానిలో కాలుష్యానికి వాహ‌నాలు ఒక్క‌టే కాదు ఇంకా అనేక కార‌ణాలున్నాయి.

చుట్టుప‌క్క‌ల రాష్ట్రాల్లో వ‌రిపంట కోసిన త‌ర్వాత వ్య‌ర్థాల‌ను త‌గుల‌బెట్ట‌డం ఇందుకు ప్ర‌ధాన‌కార‌ణంగా తేలింది. దీన్ని నియంత్రించ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నా ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద‌గా ఫ‌లితాలుండ‌టం లేదు. కాలుష్యం బారిన ప‌డి బాధితులుగా మిగిలిన దిల్లీ వాసుల‌పై ఇంధ‌నం పేరుతో విధించిన బ్యాన్ ద్వారా వారి జీవ‌న విధానాన్ని తీవ్రంగా దెబ్బ‌కొట్ట‌డ‌మే అవుతుంది. వాహ‌నాలు ఎంతోమందికి జీవ‌నాధారాలు! ఇప్ప‌టికిప్పుడు వారు త‌మ వాహ‌నాల‌ను మార్చుకోవాలంటే చాలా క‌ష్టం! దీనికితోడు జీవ‌న‌భృతి కోల్పోతే వారి మ‌నుగ‌డ‌కే క‌ష్టం! ఈ మాత్రం కూడా ఆలోచించ‌కుండా బీజేపీ ప్ర‌భుత్వం ఇంధ‌న బ్యాన్‌ను అమ‌లు చేయ‌డం మూర్ఖ‌త్వ‌మే అవుతుంది. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవాల్సిందే. కానీ ప్ర‌జ‌ల జీవ‌నోపాధిని దెబ్బ‌తీసి మాత్రం కాదు! ప్ర‌భుత్వం ఏ ఉద్దేశంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నా, ఇది ఆటోమొబైల్ ప‌రిశ్ర‌మ‌ల నెత్తిన పాలు పోసే నిర్ణ‌యంగా మారింది! ప్ర‌భుత్వానికి-ఆటోమొబైల్ రంగానికి మ‌ధ్య ఒక అవ‌గాహ‌న ఉన్న‌దా అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యే అవ‌కాశాలు లేక‌పోలేదు.

ప్ర‌స్తుతం రేఖా గుప్తా ప్ర‌భుత్వం ఈ నిబంధ‌న‌ను కొత్త‌గా తీసుకొచ్చిందేమీ కాదు. 2018లో సుప్రీంకోర్టు దేశ రాజ‌ధానిలో ప‌దేళ్ల కాల‌ప‌రిమితి ముగిసిన డీజిల్ వాహ‌నాలు, ప‌దిహేనేళ్ల కాల‌ప‌రిమితి ముగిసిన పెట్రోల్ వాహ‌నాల‌ను బ్యాన్ చేయాల‌ని తీర్పు చెప్పింది. 2014లో నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ కూడా ఈవిధ‌మైన నిషేధం విధించాల‌ని ఆదేశించింది. అయితే అప్ప‌టి ఆమ్ ఆద్మీ ప్ర‌భుత్వం దీన్ని అమ‌లు చేస్తే అన‌వ‌స‌రంగా తేనెతుట్టెను క‌ద‌ల్చిన‌ట్ట‌వుతుంద‌ని ఈ ఆదేశాల‌ను అమ‌లు చేయ‌లేదు.  కొత్త ప్ర‌భుత్వం అత్యుత్సాహంతో వీటిని అమ‌లు చేసి కొరివితో త‌ల‌గోక్కున్న‌ది. ఇప్పుడుసుప్రీంకోర్టులో రివ్యూ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డానికి ఉద్యుక్త‌మ‌వుతోంది. కోర్టులు న్యాయ కార‌ణాల‌ను ప‌రిశీలించి తీర్పులు చెబుతాయి. ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను కొన్ని సందర్భాల్లో అవి ప‌ట్టించుకోక‌పోవ‌చ్చు. దిల్లీ ఉదంతంతో కోర్టు ఇచ్చిన తీర్పు న్యాయ‌బ‌ద్ధ‌మైన‌ప్ప‌టికీ, అమ‌ల్లో కొన్ని ల‌క్ష‌ల‌మంది జీవితాలు ముడివ‌డి ఉండడం  ఇక్క‌డ ప్ర‌ధాన స‌మ‌స్య‌! ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం కాల‌ప‌రిమితి పేరుతో అన్ని వాహ‌నాల‌ను ఒకేగాటిన క‌ట్ట‌కుండా, అవి వెద‌జల్లే కాలుష్యం ఆధారంగా నిషేధం అమ‌లు చేయ‌డం అన్నివిధాలా శ్రేయ‌స్క‌రం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *