– ఎకానమీలో నాలుగో స్థానం
– రేవంత్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం తెలంగాణ ప్రజలను అవమానించడమే
– నాడు అంజయ్య…నేడు రేవంత్
– మోదీ 11 ఏళ్ల పాలనను చూసి తట్టుకోలేక పోతున్న ఖర్గే
– బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్
మోదీ పాలనలో న్యాయవ్యవస్థ బలోపేతమైందని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ ఉద్ఘాటించారు. కాంగ్రెస్ హయాంలో దేశం ఎకానమీలో పదోస్థానంలో ఉండేదని.. మోదీ పాలనలో 4వ అతిపెద్ద ఎకాన దేశంగా ఎదిగిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మూడుసార్లు ఎన్నికల్లో ఓడిపోయిందని.. అయినా ప్రధానిగా మోదీ ఎదుగుదలను జీర్ణించుకోలేక పోతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడమనేది తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానంగా చూడాలని లక్ష్మణ్ తెలిపారు. గతంలో అంజయ్యకు అవమానం జరిగిందని..ఇప్పుడు రేవంత్‌రెడ్డికి జరుగుతున్నదని లక్ష్మణ్ గుర్తుచేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఎంపి లక్ష్మణ్ డియాతో మాట్లాడారు. మావోయిస్టులు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిస్తే చర్చలు ఉంటాయని స్పష్టం చేశారు. కొంతమంది ఆపరేషన్ సిందూర్‌ను, ఆర్మీని అవమానించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యల నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాసిందని తెలుస్తోందని అన్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్ నోటీసులకు సమాధానం ఇస్తారని లక్ష్మణ్ వివరించారు. మల్లికార్జున ఖర్గే 11 ఏళ్ల మోదీ పాలనను పీడకలగా చెప్పడం సరికాదని అన్నారు. ఎమర్జెన్సీని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అది ఓ పీడకల అని విమర్శించారు. ఓబీసీ రిజర్వేషన్‌ను అడుగు అడుగునా అడ్డుకుంది ప్రతిపక్షనేత రాహుల్ గాంధీనే అని ఆరోపించారు. కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో చేయలేనిది మోదీ 11 ఏళ్లలో చేశారని అన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో దేశం అగ్రస్థానంలో ఉందని లక్ష్మణ్ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ రూ. 50లక్షల కోట్లలో.. కేవలం మౌలిక సదుపాయాలకు రూ. 11లక్షల కోట్లను మోదీ కేటాయించారని లక్ష్మణ్ గుర్తు చేశారు. మోదీ హయాంలో దేశం వందశాతం అభివృద్ధి చెందితే కాంగ్రెస్ హయాంలో 50శాతం కూడా అభివృద్ధి చెందలేదన్నారు. మోదీ హయాంలో 7.4శాతం జీడీపీ వృద్ధి చెందిందని గుర్తుచేశారు. అతి త్వరలోనే మూడో ఆర్థిక దేశంగా భారతదేశం అవతరించపోతున్నదని ఉద్గాటించారు. ఇప్పటికైనా మల్లికార్జునఖర్గే ఆలోచించి మాట్లాడాలని ఆయన హితవు పలికారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 11 ఏళ్ల పాలన పైనా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే విషం చిమ్మారని లక్ష్మణ్ ఆరోపించారు. మోదీ మీడియా స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇచ్చారు, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశారని గుర్తు చేశారు.
ఇక, పేదరికం అనుభవించిన వ్యక్తి మోడీనీ కులం పేరుతో రాహుల్ గాంధీ దూషించారు.. ఇక, రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడని ఖర్గే అసాధ్యమైన కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. దేశంలో యువత ఉద్యోగాలు చేసే వారుగా కాకుండా.. ఉద్యోగాలు ఇచ్చే వారీగా తయారు చేస్తున్నారు మోదీ అని గుర్తు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా దేశ ప్రతిష్ట పెరుగడం మనకు గర్వకారణం కాదా అని ప్రశ్నించారు. అయితే, ఆపరేషన్ సింధూర్ లాంటి దాడులను పాకిస్తాన్ పై కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా చేశారా అని ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు.





