మిస్ వ‌ర‌ల్డ్ నిర్వ‌హ‌ణ ఖ‌ర్చు రూ.30 కోట్లే!

  • స్పాన్స‌ర‌ర్లే రూ.21కోట్లు ఇచ్చారు 
  • ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేసింది రూ.9కోట్లే!
  • రూ.200కోట్లు ఎట్లా ఖ‌ర్చయిందో నిరూపించండి 
  • దీనిపై చ‌ర్చ‌కు మేం సిద్ధం 
  • సొంత మీడియాలో త‌ప్ప‌డు ప్ర‌చారం చేశారు 
  • నిరూపించ‌క‌పోతే ముక్కు నేల‌కు రాయాలి 
  • మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ 

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 3:  మిస్ వ‌ర‌ల్డ్ పోటీ (Miss World 2025) ల నిర్వ‌హ‌ణ‌కు సుమారు రూ. 30 కోట్ల ఖ‌ర్చయింద‌ని వీటి ద్వారా తెలంగాణ గొప్పతనాన్ని ప్ర‌పంచానికి చాటి చెప్పామ‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శా ఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. మంగ‌ళ‌వారం డా. బీఆర్. అంబేడ్క‌ర్ స‌చివాల‌యంలో ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తో క‌లిసి మంత్రి జూప‌ల్లి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ వేదికగా తెలంగాణ పర్యాటక ప్రమోషన్ , సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించడమే లక్ష్యంగా నిర్వహించిన మిస్ వరల్డ్ 2025 పోటీలు విజయవంతం అయ్యాయని, ఈ ఈవెంట్‌ను అపూర్వ విజయంగా నిలిపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా మంత్రి  కృతజ్ఞతలు తెలియజేశారు.

ప‌ర్యాట‌కం, హ‌స్త‌క‌ళ‌లు, చేనేత ఉత్పత్తులకు మంచి ప్రమోషన్ వచ్చిందని, మ‌న సంస్కృతి, సాంప్ర‌దాయాలు, ఆహార‌పు అల‌వాట్లను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేశామ‌ని, ఆ వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌, ఆతిధ్యం ప‌ట్ల కంటెస్టెంట్లు, మిస్ వ‌రల్డ్ సంస్థ ప్ర‌తినిధులు, మీడియా ప్ర‌తినిధులు సైతం ఆనందం వ్య‌క్తం చేశార‌ని చెప్పారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు అభినందించాల్సి పోయి విమర్శలు చేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. మిస్ వరల్డ్ పోటీలకు ఖర్చయింది రూ.30 కోట్లని, స్పాన్సర్ల ద్వారానే రూ.21 కోట్లు వచ్చాయని, రాష్ట్ర ప్రభుత్వానికి అయిన ఖర్చు రూ.9 కోట్లు మాత్రమేన‌ని స్ప‌ష్టం చేశారు. మరో రూ.10 నుంచి రూ.11 కోట్ల ఆదాయంపై ఒప్పందాలు ఉన్నాయని వివ‌రించారు. ఈ పోటీలపై కొందరు తప్పుడు ప్రచారం చేశారని, గొప్పగా కార్యక్రమం నిర్వహిస్తే పలుచన చేయాలని చూశారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మిస్ వరల్డ్ పోటీలకు రూ.200 కోట్లు ఖర్చు ఎక్కడ అయ్యాయో చెప్పాలని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు సవాల్ విసిరారు.

తెలంగాణ భవన్ కు రావాలా? అబిడ్స్ చౌరస్తాకు రావాలా? రూ.200 కోట్లు ఖర్చు అయినట్లు నిరూపించకుంటే ముక్కు నేలకు రాయాలి.. అని మంత్రి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో టూరిజం ప్రమోషన్లకే రూ.115 కోట్లకు పైగా ఖర్చు చేశారని తెలిపారు. ఇంత పెద్ద ఈవెంట్ ను త‌క్కువ‌ ఖ‌ర్చుతో ఘ‌నంగా నిర్వ‌హింమ‌న్నారు.  సొంత పత్రికలు, మీడియా, సోష‌ల్ మీడియాలో అస‌త్యాలు ప్ర‌చారం చేశార‌ని, అందగత్తెల కాళ్లు కడిగారని విష ప్రచారం చేశారని మండిప‌డ్డారు. ఐఏఎస్ అధికారులతో కాళ్లు మొక్కించుకున్నఘనత కేసీఆర్ దే న‌ని అన్నారు. కంటెస్టెంట్లకు 30 తులాల బంగారం ఇచ్చారనేది పచ్చి అబద్ధం’ అని, చౌమ‌హ‌ల్లా ప్యాలెస్ విందులో ఒక్కో ప్లేట్ భోజ‌నానికి ల‌క్ష రూపాయాలు ఖ‌ర్చు చేశార‌నేది అవాస్త‌మ‌ని ఒక్కో ప్లేట్ కు అయిన ఖ‌ర్చు రూ. 8,200 మాత్ర‌మేన‌ని స్ప‌ష్టం చేశారు.

తనపట్ల మిస్ బిహేవ్ చేశారని మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలను మంత్రి జూప‌ల్లి ఖండించారు. ఆమె ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. దీనిపై కొందరు బీఆర్ఎస్ నాయకులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, అవ‌న్ని అభూత‌క క‌ల్ప‌న‌లేన‌ని చెప్పారు. మిస్ ఇంగ్లాండ్ ను ఇబ్బంది పెట్టారనేది వాస్తవం అయితే మిగతా 108 మంది పోటీదారులు చివరి వరకు ఉండేవారు కాదన్నారు. మిస్ వరల్డ్ పోటీదారులకు వచ్చిన వాళ్లు చివరిదాకా చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పారు. ఏమీ జరగని దానికి ఏదో జరిగినట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

వాళ్లను ఇబ్బంది పెడితే.. మళ్లీ మళ్లీ తెలంగాణకు రావాలని ఉందని ఎందుకు చెబుతారని ప్రశ్నించారు మిస్ వరల్డ్ విన్నర్ గా గెలిచిన థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాతకు తెలంగాణ ఆథిత్యం, ఇక్కడి పర్యాటక ప్రాంతాలు నచ్చాయని చెప్పారు. తన జీవితంలో హైదరాబాద్ ను మరువ.. అవకాశం వస్తే మళ్లీ ఇక్కడికి వస్తానని ఓపల్ సుచాత చెప్పారన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ… మిస్ వ‌ర‌ల్డ్ పోటీలను ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డాన్ని చూసి ప్ర‌తిప‌క్షాలు ఓర్వ‌లేక‌పోతున్నాయ‌ని మండిప‌డ్డారు.ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకు అన‌వ‌స‌ర విష‌యాల‌ను లేవ‌నెత్తుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజ‌కీయ ల‌బ్ది కోసం అస‌త్యాల‌ను ప్ర‌చారం చేయ‌డం త‌గద‌న్నారు.  కార్య‌క్ర‌మంలో నాగ‌ర్ క‌ర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, ప‌ర్యాట‌క శాఖ డైరెక్ట‌ర్ హ‌న్మంతు జండ‌గే, స్టేట్ ఆర్ట్ గ్యాల‌రీ డైరెక్ట‌ర్ కె.ల‌క్ష్మి పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *