– పత్తి పంట అమ్ముకోలేక రైతుల ఇబ్బందులు
– రంగు మారిన పంటను కొనుగోలు చేయడంలేదు
-అయినకాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి
– కేంద్రం మిల్లర్ల సమస్యను పరిష్కరించాలి
-మంత్రి తుమ్మల
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17: రైతులు రేయింబవళ్లు కష్టపడి సాగు చేసిన పత్తిని కేంద్రం పెట్టిన నిబంధనలతో రైతులు అమ్ముకోలేక దిక్కతోచని పరిస్థితి ఏర్పడిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం తెలంగాణ పత్తిరైతుల సమస్యలపై సెక్రటరీ, కేంద్ర జౌళిశాఖ మరియు అధికారులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి తుమ్మల స\మీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఇంతకుముందు పెసళ్లు, కందులు, పొద్దుతిరుగుడ వంటి పంటలపై 25శాతం కొనుగోలు మాత్రమే పరిమితి పెట్టి, రైతుల పంటలో కేవలం 25 శాతం మాత్రమే కనీస మద్ధతు ధరకు అమ్ముకుని, మిగతా పంటను తక్కువ ధరకు అమ్ముకోవల్సిన పరిస్థితిని కేంద్రం తీసుకొచ్చిందని అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున 25 శాతం పరిమితిని ఎత్తివేయాలని పలుమార్లు కోరినట్టు గుర్తుచేశారు. చివరికి రైతులు ఆర్థికంగా నష్టపోకుడదనే ఉద్దేశంతో రాష్ట్రమే మద్ధతు ధర చెల్లించి, గత రెండు సంవత్సరాల నుండి మిగిలిన పంటలను కొనుగోలు చేస్తుందన్నారు. ఇక అకాల వర్షాలు పడి, సోయాబీన్ రంగు మారగానే, రంగు మారిందనే నెపంతో కొనుగోళ్లు జరపకుండా రైతులను ఇబ్బందులకు గురిచేసిన విషయాన్ని గుర్తుచేశారు. రంగు మారిన పంటను కూడా కొనాలని కేంద్రాన్ని కోరుతున్నప్పటికి పట్టించుకోలేదని, నాఫెడ్ నుండి గాని, కేంద్రం నుండి గాని ఎటువంటి స్పందన లేకపోవడం శోచనీయమన్నారు. కొనే 25శాతం పంటకి ఇన్ని నిబంధనలా అని మంత్రి ప్రశ్నించారు. సోమవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో సెక్రటరీ, జౌళిశాక మరియు అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి తుమ్మల గారు సచివాలయం నుండి పాల్గొనగా, జిన్నింగ్ మిల్లుల అసోషియేషన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. కేంద్రం కోరినట్టుగా రాష్ట్రం నుండి జిల్లాల వారిగా సరాసరి పత్తి దిగుబడి గణాంకాలను కలెక్టర్ల ద్వారా తెప్పించుకొని, సీసీఐ కి పంపించామని మంత్రి తెలిపారు. మొదట్లో ఎకరానికి 11 క్వింటాళ్ల చొప్పున సేకరించి, కొన్ని రోజుల తరువాత ఆ పరిమితిని 7 క్వింటాళ్లకు తగ్గిస్తూ, ఎకరానికి 7 క్వింటాళ్ల వరకు మాత్రమే కొంటామని రైతులను అయోమయానికి గురిచేశారు. ఈ విషయంలో కూడా ఎన్నోసార్లు కేంద్రాన్ని విజ్ఙప్తి చేసినట్టుగా మంత్రి తెలియజేశారు. కేంద్రం విధించిన తేమశాతం నిబంధనతో రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. తేమ శాతం పెంచి కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కు విజ్ఙప్తి చేసామన్నారు. పై రెండు విషయాలలో రైతులందరికి ఉపయోగపడేలా సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.
అలాగే జిన్నింగ్ మిల్లుల విషయంలో కేంద్రం తీసుకొచ్చిన నిబంధనలతో జిన్నింగ్ మిల్లులను ఎల్1 నుండి ఎల్12 వరకు విభజించి, పత్తి కొనుగోళ్లు జరపాలనే నిర్ణయంపై మొదటి నుంచి తీవ్ర అంసతృప్తితో ఉన్న జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు, టెండర్లకు కూడా రాకుండా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వ చొరవతో టెండర్లకు పిలిపించామన్నారు. కొనుగోళ్ళు ఆరంభమై నెల రోజులు గడిచినప్పటికి, ఇప్పటికి కేవలం 243 మిల్లులు మాత్రమే రైతులకు కేటాయించడం, తద్వారా మిగతా 82 మిల్లులు ఇంకా తెరుచుకోకపోవడం, దీంతో రైతులు చాలా దూరం వెళ్లి పత్తిని అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది అన్నారు. అయినప్పటికి కేంద్రం ఆ నిబంధనలను కొనసాగిస్తూ, రైతులు మరియు జిన్నింగ్ మిల్లులు ఆర్థికంగా నష్టపోయేలా చేస్తున్నారని, దీంతో ఇప్పుడు జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు సమ్మెకు దిగే పరిస్థితి ఏర్పడిందని మంత్రిగారు అభిప్రాయపడ్డారు. పత్తి రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా జిన్నింగ్ మిల్లర్లతో మాట్లాడి, వారి సమస్యలు పరిష్కారం అయ్యేదిశగా చూసేలా సీసీఐ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని మంత్రిగారు కోరారు. అలాగే రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని, పత్తి కొనుగోళ్ళలో ఆటంకం ఏర్పడకుండా, వెంటనే కొనుగోళ్లను ఆరంభించాలని జిన్నింగ్ మిల్లుల అసోషియేషన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డిని కోరారు. రేపు సీసీఐ వారితో జరిగే సమావేశంలో జిన్నింగ్ మిల్లుల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి, ముఖ్యమంత్రి సూచనలతో సానుకూల నిర్ణయం వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని సహాయ, సహకారాలు అందిస్తామని అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





