ప్రచారం ముగిసింది … ఇక దృష్ట్యంతా వోట్లపైనే

గత నెలరోజులుగా జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధానికి తెరపడింది. నిన్నటి వరకు సాగిన మైకుల హోరు, రాజకీయ పార్టీల సభలు, సమావేశాల హడావిడి, వాహనాల చప్పుళ్ళు, కార్యకర్తల నినాదాల సందడికి ఆదివారం సాయంత్రం నుండి తెరపడింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఛాలెంజ్ల  హడావిడి అంతా మూగపోయింది. ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ తమ దృష్టినంతా మంగళవారం జరుగనున్న పోలింగ్‌పైన పెట్టాయి. నిన్నటి వరకు బహిరంగ ప్రచారం చేసిన ఈ పార్టీలు అంతర్గత ప్రచారంలో నిమగ్నమైనాయి. నెలరోజులుగా నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ప్రచారంలో స్థానిక ప్రజలను ఏ పార్టీ ఎక్కువగా ప్రభావితం చేసిందన్న దానిపైనే ఇప్పుడు చర్చ జరుగుతున్నది.

 జూబిలీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం   ఉప ఎన్నికల్లో వివిధ పార్టీలు, స్వతంత్రులు అంతా కలిపి 58 మంది రంగంలో ఉన్నా ప్రధాన పోటీ మాత్రం మూడు పార్టీల మధ్యే ఉంది. వాస్తవానికి ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు జరిగిన అయిదు ఎన్నికలతో పోలిస్తే ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేయడం ఇదే మొదటిసారి. గత ఎన్నికల్లో 19 మంది పోటీలో పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలో నాలుగు లక్షల మంది వోటర్లలో అనేక సామాజిక వర్గాలకు సంబంధించిన వారున్నారు. వారిని ఆకట్టుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు తీవ్ర కసరత్తు చేశాయనే చెప్పవొచ్చు.
ఆయా వర్గాల వారి వోట్ల కోసం అదే సామాజిక వర్గాలకు చెందిన తమ నాయకులను ఈ పార్టీలు ప్రయోగించాయి. అయినప్పటికీ వోటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారన్నది ఈనెల 14న తేలనుంది. కాగా అధికార కాంగ్రెస్‌ ఈ ఎన్నికను ఛాలెంజ్‌గా తీసుకుంది. జిహెచ్‌ఎంసీ పరిధిలో కంటోన్మెంట్‌ తర్వాత ఇక్కడ జరుగుతున్న ఉపఎన్నికను అవకాశంగా మలుచుకోవాలన్న లక్ష్యంతో  తన శాయశక్తులను ఒడ్డింది. క్యాబినెట్‌ మంత్రులందరినీ ఇక్కడ మోహరించింది. వారితోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు , పార్టీ ప్రముఖులందరినీ దింపింది. తనకు పోటీగా ఉన్న బిఆర్‌ఎస్‌, బిజెపిపైన చేయగలిగినన్ని విమర్శలు చేసింది.
    అయితే ఈ నియోజకవర్గంలో కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వోటర్ లతోపాటు సెటిలర్ల వోట్లు చాలా కీలకమైనవి. ఈ వోట్ల కోసం కాంగ్రెస్‌ చేయని కసరత్తులేదు. ఈ నియోజవర్గంతోపాటు, రాష్ట్రంలో ఇటీవల జరిగిన సభలు, సమావేశాల సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి గత కాంగ్రెస్‌ పాలనతోపాటు, తెలుగుదేశం పాలనపైన వల్లమాలిన అభిమానాన్ని ప్రకటించారు. హైదరాబాద్‌ అభివృద్ధిలో ఎన్టీఆర్‌, చంద్రబాబు పాత్రపైన ఆయన కితాబు ఇవ్వడం చూస్తుంటే సెటిలర్ల తోపాటు, ఆ పార్టీ అభిమానుల వోట్లకు గాలంవేసినట్లు తెలుస్తున్నది.
ఆ పార్టీనుంచి వొచ్చిన రేవంత్‌రెడ్డి లాగానే, జూబ్లీలోని కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌యాదవ్‌ తండ్రి శ్రీశైలం యాదవ్‌కూడా టిడిపి మూలలున్న వ్యక్తే. కాగా కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌యాదవ్‌ గతంలో ఎంఐఎం అభ్యర్థిగా ఇక్కడ పోటీచేసిన వ్యక్తి. ఈ ఎన్నికల్లో ఎంఐఎం తన పూర్తిమద్దతును నవీన్‌యాదవ్‌కు ప్రకటించిన నేపథ్యంలో  తమ అభ్యర్థి గెలుపు ఖాయమన్న ధైర్యాన్ని కాంగ్రెస్‌ వ్యక్తంచేస్తున్నది. కాంగ్రెస్‌ తన ప్రచారాన్నంత అభివృద్ధి కేంద్రంగానే కొనసాగించింది. నియోజవర్గ అభివృద్ధి కావాలంటే నవీన్‌యాదవ్‌ను గెలిపించాల్సిదేనంటూ వోటర్లకు ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసింది.
ఇక బిజెపి విషయానికొస్తే ఆ పార్టీ కేంద్ర మంత్రి బండి సంజయ్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావులతోపాటు మరో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అంతాతానై ప్రచారం సాగించారు. పక్క రాష్ట్రం ఏపీ లో కూటమికట్టిన ఈ పార్టీకి ఇక్కడ జనసేన పార్టీ అభిమానులు బహిరంగంగానే బిజెపి అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి మద్దతు ప్రకటించడమేగాక ప్రచారకార్యక్రమంలో పాల్గొన్నారు. కాస్త ఆలస్యంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిన బిజెపి రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న నిధులు, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పథకాల వివరాలను ప్రజల్లోకి తీసుకు పోవడానికి తన వంతు కృషి చేసింది. అయితే అధికార కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్‌లు ఒకరిని ఒకరు దూషించుకున్నట్లు కనిపించినా లోపాయికారిగా ఈ రెండు పార్టీలు  ఒకటేనన్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయగలిగింది పార్టీ.
సిట్టింగ్‌ ఎమ్మెల్యే  మాగంటి గోపీనాథ్‌ ఆకస్మిక మరణంతో ఏర్పడిన ఇక్కడి ఖాలీని భర్తీ చేసేవిషయంలో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడానికి ముందే బిఆర్‌ఎస్‌ తన అభ్యర్థిని ప్రకటించి, ప్రచార కార్యక్రమంలో ముందు వరుసలో నిలిచింది. గోపీనాథ్‌ను మూడుసార్లు గెలిపించిన ఇక్కడి వోటర్లకు ఆ కుటుంబంపైన ఉన్న అభిమానాన్ని గ్రహించిన బిఆర్‌ఎస్‌ గోపీనాథ్‌ సతీమణి సునీతను పోటీకి నిలబెట్టడం తో పాటు విరామం లేని ప్రచారాన్ని కొనసాగించింది. గతంలో ఇక్కడ సెటిలర్స్‌, కమ్మసామాజిక వర్గానికి చెందినవారు గోపీనాథ్‌కు అండగా ఉన్నట్లే సునీతకు కూడా మద్దతిస్తారన్న నమ్మకంగా బిఆర్‌ఎస్‌ ఉంది. ఉద్యమకాలంలో భయపడినా, కెసిఆర్‌ పదేళ్ళకాలంలో సెటిలర్స్‌ ఏనాడు ఎలాంటి అటంకాలు లేకుండా ఇక్కడ ప్రశాంత జీవనం సాగిస్తున్నారు.
ఆ విషయాన్ని వోట్ల రూపంలో వారు గత ఎన్నికల్లోనే తెలియజేశారు. ఈ ఎన్నికల్లో వారి అభిప్రాయం మారదన్న భావనలో బిఆర్‌ఎస్‌ ఉంది. పైగా గత ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్‌కు ఒక్క స్థానం రాకపోవడానికి అదే కారణంగా భావిస్తున్నారు. వారితోపాటు ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్‌  సమాజాన్ని సమదృష్టితో చూడడంతోపాటు, వివిధ సామాజిక వర్గాలవారికి కెసిఆర్‌ కల్పించిన సంక్షేమ కార్యక్రమాలు తమను గెలిపిస్తాయని బిఆర్‌ఎస్‌ భావిస్తున్నది. దానికి తగినట్లు పెన్షన్ల  పెంపు, మహిళలకు రూ. 2500  నిరుద్యోగ భృతి, కల్యాణలక్ష్మీ, స్కూటీలు, తులం బంగారం ఇస్తామన్న తదితర ఎన్నికల హామీలను కాంగ్రెస్‌ నిలుపుకోలేకపోయిందన్న ప్రచారాన్ని ఆ పార్టీ ముఖ్యనేతలు కెటిఆర్‌, హరీష్‌రావు ప్రజలవద్దకు బలంగా తీసుకుపోగలిగారు. అలాగే మైనార్టీల వోట్లకోసం ఎన్నికతేదీ సమీపిస్తున్నవేళ ఆజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడాన్ని వేలెత్తి చూపించింది. ఏదిఏమైనా ఇక్కడ విద్యావంతులతో సమానంగా ఉన్న సాధారణ వోటర్లు అభివృద్ధిని కోరుకుని కాంగ్రెస్‌కు వోట్లువేస్తారో, బిఆర్‌ఎస్‌ అభ్యర్థికి సానుభూతితో  పట్టంకడుతారో 14న తేదీ వరకు వేచిచూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *