తెలంగాణ మీద పశ్చిమాసియా యుద్ధపు దెబ్బ

“ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న దురహంకార, అధర్మ యుద్ధం గురించి ఎక్కడో నాలుగువేల కిలోమీటర్ల అవతల, మనకు సుదూరంగా యుద్ధం జరుగుతున్నదని, దానితో మనకు సంబంధం లేదని అనుకోవడానికి ఏమీ లేదు. ఇరాన్ (దాని పాత పేరైన పర్షియా) కూ తెలంగాణకూ శతాబ్దాలుగా పాత చుట్టరికం ఉంది. ఇరాన్ తో మనకు అనేక రకాల బంధాలున్నాయి. చారిత్రక, సాంస్కృతిక, భాషా అనుబంధాలు మాత్రమే కాదు, ప్రస్తుతం ఆ యుద్ధ ఫలితాలలో కొన్ని అనివార్యంగా అనుభవించవలసిన దుస్థితి దాకా ఎన్నో లంకెలు. హైదరాబాదీలం, తెలంగాణవాసులం ఇరాన్ గురించీ, ఇరాన్ మీద సాగుతున్న అన్యాయ యుద్ధం గురించీ, అక్కడ ధ్వంసమైపోతున్న ప్రాణాల గురించీ, ఆస్తుల గురించీ, సంస్కృతి గురించీ తప్పనిసరిగా ఆలోచించవలసి ఉంది.”

తెలియనివారికి కష్టం వచ్చినా మనసు విలవిలలాడుతుంది. అపరిచితులైనా సరే వందలాదిగా వేలాదిగా మారణకాండలో బలి అయిపోతున్నారంటే వారి మీద సానుభూతి, అంతగా జనహననం, బీభత్సం సృష్టిస్తున్నవారి మీద ఆగ్రహం కలుగుతాయి. ఇక ఎంతో కొంత తెలిసినవారు, చారిత్రకంగా, సాంస్కృతికంగా సంబంధం ఉన్నవారు ఇబ్బందుల్లో ఉంటే, వారి మీద అమానుష హత్యాకాండ జరుగుతుంటే సానుభూతి ప్రకటించడం, వారి మీద దుర్మార్గం సాగిస్తున్నవారిని ఖండించడం కనీసం మానవీయ కర్తవ్యం.

ఇరాన్ మీద అమెరికా-ఇజ్రాయెల్ లు రుద్దిన యుద్ధం, సాగిస్తున్న దారుణ మారణకాండ రెండు వారాలుగా తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయి. అది కేవలం అన్యాయమైన, దౌర్జన్యపూరితమైన యుద్ధం అయినందువల్ల మాత్రమే కాదు, తెలంగాణకూ, హైదరాబాద్ కూ ఇరాన్ కూ ఉన్న ఆత్మీయ సంబంధాల వల్ల విచారం మరింత పెరుగుతున్నది. ఐదున్నర దశాబ్దాలకు పైగా ఇరానీ చాయ్ తాగుతున్నాను. ప్రపంచ చరిత్రలో, పశ్చిమాసియా భౌగోళిక రాజకీయాలలో ఇరాన్ పాత్ర అధ్యయనం చేస్తున్నాను. హైదరాబాద్ చరిత్ర మీద ఇరాన్ ప్రభావం గురించి తెలుసుకుంటూ చదువుతూ రాస్తూ ఉన్నాను. ఈ నేపథ్యంలో ప్రస్తుత యుద్ధ పర్యవసానాలు మనందరి మీద కూడా చూపనున్న ప్రతికూల ప్రభావాల గురించి చర్చించవలసి ఉంది.

ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న దురహంకార, అధర్మ యుద్ధం గురించి ఎక్కడో నాలుగువేల కిలోమీటర్ల అవతల, మనకు సుదూరంగా యుద్ధం జరుగుతున్నదని, దానితో మనకు సంబంధం లేదని అనుకోవడానికి ఏమీ లేదు. ఇరాన్ (దాని పాత పేరైన పర్షియా) కూ తెలంగాణకూ శతాబ్దాలుగా పాత చుట్టరికం ఉంది. ఇరాన్ తో మనకు అనేక రకాల బంధాలున్నాయి. చారిత్రక, సాంస్కృతిక, భాషా అనుబంధాలు మాత్రమే కాదు, ప్రస్తుతం ఆ యుద్ధ ఫలితాలలో కొన్ని అనివార్యంగా అనుభవించవలసిన దుస్థితి దాకా ఎన్నో లంకెలు. హైదరాబాదీలం, తెలంగాణవాసులం ఇరాన్ గురించీ, ఇరాన్ మీద సాగుతున్న అన్యాయ యుద్ధం గురించీ, అక్కడ ధ్వంసమైపోతున్న ప్రాణాల గురించీ, ఆస్తుల గురించీ, సంస్కృతి గురించీ తప్పనిసరిగా ఆలోచించవలసి ఉంది.

“పదహారో, పదిహేడో శతాబ్దాలలో ఎందరో పర్షియన్ పండితులు, వాస్తుశిల్పులు, కవులు, పాలకులు హైదరాబాద్ వచ్చారు. పర్షియన్, ఉర్దూ, హిందూస్థానీ, తెలుగు భాషల సంగమం జరిగింది. హైదరాబాదీ దక్కనీ భాషలో, తెలుగులో కూడా కలిసిపోయిన బాజార్, దర్వాజా, బాగ్, మెహఫిల్, దావత్ మొదలైన మాటలన్నీ మౌలికంగా పర్షియన్ మాటలే. ఇరానీ వంటకాలు, మార్పులు, చేర్పులు, ప్రత్యేకించి ఇరానీ చాయ్ హైదరాబాద్ ఆహార పానీయ సంస్కృతిలో అవిభాజ్య భాగాలు. పందొమ్మిదో, ఇరవయో శతాబ్దాలలో కూడా ఇరాన్ లో కొన్ని ప్రాంతాలలో సాగిన ఆందోళనల వల్ల, ఆర్థిక సమస్యల వల్ల హైదరాబాద్ కు ఎక్కువగా వలసలు సాగాయి.”

చారిత్రకంగా హైదరాబాద్ కు పర్షియాతో ఉన్న సంబంధం లోతైనది. కాకతీయుల పతనానంతరం తెలుగు నేలనంతా ఏకం చేసి విశాలమైన గోల్కొండ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఖుతుబ్ షాహీ రాజవంశపు మూలాలు పర్షియాలోనే ఉన్నాయి. పందొమ్మిదో శతాబ్ది దాకా మొదట ఖుతుబ్ షాహీ రాజ్యం లోనూ, ఆ తర్వాత అసఫ్ జాహీ రాజ్యం లోనూ ఆస్థాన అధికార భాషగా పర్షియన్ ఉండింది. అప్పటికింకా ఆధునిక రవాణా సౌకర్యాలు ఏర్పడలేదు గనుక సముద్రమార్గంలో ఓడల ద్వారా మచిలీపట్నం చేరిన పర్షియన్ వర్తకులు గోల్కొండ దాకా తెలంగాణ భూభాగం మీద ప్రయాణించారు. గోల్కొండ రాజ్యంలోని వజ్రాలూ, ముత్యాలూ, ఉక్కూ, చేనేత వస్త్రాలూ ప్రపంచ విపణివీథుల్లోకి ప్రయాణించడానికి పర్షియానే గవాక్షం.

రాజధాని గోల్కొండ ఇరుకవుతున్నదని, మూసీకి దక్షిణ తీరాన కొత్త రాజధాని నిర్మించాలని మహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా ఆలోచించినప్పుడు, నగర రూపకల్పనకు నమూనాగా ఆయనకు వెంటనే గుర్తుకొచ్చిన నగరం పర్షియాలోని ఇస్పహాన్. హైదరాబాద్ ను రూపొందిస్తున్నప్పుడు నగరనిర్మాణం, ఉద్యానవనాలు, రాజవీథులు, భవనాలు, విహార స్థలాలు అన్నీ ఇరానియన్ నిర్మాణ పద్ధతులనే అనుసరించాయి. ఖుతుబ్ షాహీల ప్రధాని మీర్ మోమిన్ అస్తరాబాదీ స్వయంగా పర్షియన్. హైదరాబాద్ ను పర్షియన్ సంస్కృతి కొనసాగింపుగానే రూపకల్పన చేశాడు.

పదహారో, పదిహేడో శతాబ్దాలలో ఎందరో పర్షియన్ పండితులు, వాస్తుశిల్పులు, కవులు, పాలకులు హైదరాబాద్ వచ్చారు. పర్షియన్, ఉర్దూ, హిందూస్థానీ, తెలుగు భాషల సంగమం జరిగింది. హైదరాబాదీ దక్కనీ భాషలో, తెలుగులో కూడా కలిసిపోయిన బాజార్, దర్వాజా, బాగ్, మెహఫిల్, దావత్ మొదలైన మాటలన్నీ మౌలికంగా పర్షియన్ మాటలే. ఇరానీ వంటకాలు, మార్పులు, చేర్పులు, ప్రత్యేకించి ఇరానీ చాయ్ హైదరాబాద్ ఆహార పానీయ సంస్కృతిలో అవిభాజ్య భాగాలు. పందొమ్మిదో, ఇరవయో శతాబ్దాలలో కూడా ఇరాన్ లో కొన్ని ప్రాంతాలలో సాగిన ఆందోళనల వల్ల, ఆర్థిక సమస్యల వల్ల హైదరాబాద్ కు ఎక్కువగా వలసలు సాగాయి.

ఇరాన్ తో ఈ సంబంధాలు కేవలం హైదరాబాద్ నగరానికి మాత్రమే కాదు, హైదరాబాద్ రాజ్యం మొత్తానికీ ప్రవహించాయి. నా తొలి యవ్వనం వరకూ వరంగల్ లో ఎన్నో ఇరానీ హోటళ్లుండేవి. హనుమకొండ చౌరస్తాలో ఉన్న నాలుగు ఇరానీ కేఫ్ లలో రెండు నిజంగా ఇరాన్ ప్రభావంలో ఉండినవే. కోహినూర్ హోటల్, జవహర్ కేఫ్ లలో 1979 వరకూ పెద్ద పెద్ద రెజా షా పహ్లవి ఫొటోలు ఉండేవి. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఆ స్థానంలో అయతొల్లా ఖొమేనీ ఫొటోలు వచ్చాయి. అలా ఒకరకంగా ఇరానీ నాయకుల ఫోటోల కిందనే ప్రతిరోజూ మా చాయ్, బన్ మస్కా, ఉస్మానియా బిస్కట్లు సాగాయి. పరాయి దేశపు ప్రభుత్వాధినేత చిత్రపటం ఇక్కడి హోటల్ లో ఉండడం ఏమిటనే సంకుచిత ప్రశ్నలు ఇంకా దాపురించని కాలం అది. రెజా షా అమెరికా అనుకూల నియంతృత్వం మీద తిరుగుబాటుగా వచ్చిన ఖొమేనీ పాలనలో అమెరికా సామ్రాజ్యవాద వ్యతిరేకత ఉన్నప్పటికీ, మత ఛాందసపు మూర్ఖత్వం ఉన్నదని హనుమకొండలోనూ, తార్నాకలోనూ ఇరానీ హోటళ్లలో, ఉస్మానియా క్యాంపస్ లో చర్చలు జరుగుతుండిన కాలం అది.

“ఇప్పటికే గృహావసరాల ఎల్ పి జి సిలిండర్ ధర 60 రూపాయలు, వాణిజ్య అవసరాల సిలిండర్ ధర 115 రూపాయలు పెరిగాయి. వాణిజ్య అవసరాల సిలిండర్ వినియోగదారులలో హోటళ్లు, రెస్టారెంట్లు, పారిశ్రామిక సంస్థలు ఉన్నాయి గనుక ఇప్పటికే ప్రతికూల ఫలితాలు మొదలయ్యాయి. దేశమంతా హోటళ్లు, రెస్టారెంట్లు, మొత్తంగా ఆహార పరిశ్రమ కుప్పకూలే స్థితికి చేరింది. ఒక్క హైదరాబాద్ నగరలోనే నలబై వేలకు పైగా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, పది వేలకు పైగా పేయింగ్ గెస్ట్ హాస్టళ్లు ఈ ఎల్ పి జి ధరల గొడ్డలివేటుకు విలవిలలాడుతున్నాయి. యుద్ధం ఇంకా కొనసాగితే ధర పెరుగుదల మాత్రమే కాక, సరఫరా కూడా ఆగిపోవచ్చు. తత్ఫలితంగా ఈ పరిశ్రమల మీద ఆధారపడిన కార్మికుల, ఉద్యోగుల జీవనోపాధే ప్రమాదంలో పడవచ్చు.”

ఆ 1970లు, 80 లు మాత్రమే కాదు, 1990ల నాటికి కూడ ఇరాన్ మనకు ఇప్పటంత పరాయి కాలేదు. 1997లోనో, 1998లోనో నేను ఎకనమిక్స్ టైమ్స్ లో హైదరాబాదీ ఇరానీ చాయ్ గురించి ఒక వ్యాసం రాయదలచుకుని, ఇరాన్ – హైదరాబాద్ సంబంధాల గురించి తెలుసుకోవడానికి నేరుగా బంజారా హిల్స్ ఇరాన్ కాన్సులేట్ కే వెళ్లాను. అక్కడి ఇరానియన్ అధికారులు చాలా సాదరంగా, స్నేహంగా ఆతిథ్యమూ సమాచారమూ ఇచ్చి, డా. సాదిఖ్ నక్వీ రాసిన ‘ది ఇరాన్ – దక్కన్ రిలేషన్స్’ అనే పుస్తకం కూడా కానుక ఇచ్చారు.

ఆయతొల్లా ఖొమేనీ మరణం (1989) తర్వాత, అలీ ఖమేనీ నాయకత్వంలో ఇరాన్ సైనిక, తీవ్రవాద మత ఛాందస రాజ్యంగా మారిన గత మూడు దశాబ్దాలలో, ఒకవైపు స్త్రీల మీద, భిన్నాభిప్రాయాల మీద మత దురహంకార దాడులు, మరొకవైపు అత్యంత నిరంకుశ, దుర్భర పరిస్థితుల మధ్యనే ఇరానియన్ సినిమా దర్శకులు తీస్తున్న అద్భుతమైన సినిమాల వార్తలు తప్ప ఇరాన్ గురించి ప్రత్యేకంగా మరేమీ తెలియకుండా పోయింది. మత ఛాందస నిరంకుశత్వ పాలన నడుపుతూనే అమెరికా సామ్రాజ్యవాద దాడులను ఎదిరించి నిలుస్తున్నారనీ, తమ పక్కలో బల్లెంగా సామ్రాజ్యవాదం ప్రవేశపెట్టిన ఇజ్రాయెల్ ను వ్యతిరేకిస్తున్నారని, పాలస్తీనా ప్రజల స్వేచ్ఛాకాంక్షను సమర్థిస్తున్నారనీ కొంత ఆదరభావమే ఉండేది.

ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని చేపట్టిందంటూ అమెరికా – ఇజ్రాయెల్ దుష్ట కూటమి కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న యాగీ, ఆ అణ్వాయుధ కార్యక్రమాన్ని పరీక్షించే అధికారం తనకు అప్పగించాలని అమెరికా చేస్తున్న బెదిరింపులు, ఇరాన్ వాణిజ్యం మీద విధిస్తున్న ఆంక్షలు వార్తలుగా వస్తూనే ఉన్నాయి. ఇరవై సంవత్సరాల కింద ఇరాక్ మీద దాడి చేయడానికి అమెరికా పాలకులు సరిగ్గా ఇటువంటి అబద్ధాలే చెప్పారు. అక్కడ జన విధ్వంసక ఆయుధాలు తయారు చేస్తున్నారని, వారిని ఆపకపోతే ప్రపంచానికి హాని జరుగుతుందని, అమెరికా సైన్యం ఇరాక్ ను దురాక్రమించింది, భస్మీపటలం చేసింది. అధ్యక్షుడు సద్దాం హుసేన్ ను అరెస్టు చేసి, దొంగ విచారణ జరిపి, ఉరిశిక్ష వేసి చంపింది. తీరా ఇరాక్ లో పరిశోధనలు జరిపిన స్వతంత్ర సంస్థలూ, పరిశోధకులూ, చివరికి అమెరికన్ ప్రభుత్వ సంస్థలూ కూడా అక్కడ జన విధ్వంసక ఆయుధాల తయారీ ప్రయత్నాలు జరిగాయనేందుకు ఎటువంటి ఆధారాలు లేవని ప్రకటించారు. అంటే, ఒక పచ్చి అబద్ధం మీద ఆధారపడి అమెరికన్ సైనిక, పాలకవర్గాలు ఒక సర్వసత్తాక దేశాన్ని దురాక్రమించి, వేలాది మందిని చంపి, దేశ వనరులను ధ్వంసం చేసి, దాని అధ్యక్షుడిని చంపివేశాయి.

అప్పుడు ఇరాక్ పట్ల వ్యవహరించినట్టుగానే ఇప్పుడు ఇరాన్ తో వ్యవహరిస్తున్నారు. అసలు ఈ చమురు దాహపు దురాక్రమణ కథ ఏడు దశాబ్దాల కింద మొదలయింది. ఇరాన్ లో ప్రజాస్వామికంగా ఎన్నికై, చమురు పరిశ్రమను జాతీయం చేసిన ప్రధానమంత్రి మహమ్మద్ మొసాదెగ్ ను, సి ఐ ఎ సాయంతో సైనిక కుట్రతో పదవీచ్యుతుణ్ని చేసిన 1953 నుంచీ అమెరికన్ సామ్రాజ్యవాదుల కన్ను ఇరానీ చమురు నిల్వల మీద ఉంది. రెజా షా పహ్లవి పాలనలో నిరాటంకంగా సాగిన ఆ దోపిడీకి ఇస్లామిక్ విప్లవంతో అడ్డుకట్ట పడగా, అప్పటినుంచీ వారిని తప్పించి తన తైనాతీ ప్రభుత్వాన్ని స్థాపించడం ఎట్లా అనే ఏకైక ప్రయత్నంలో ఉంది అమెరికా. పశ్చిమాసియాలో దాని బంటు ఇజ్రాయెల్ ఇస్లామిక్ వ్యతిరేకత ఆ దుష్ప్రయత్నానికి తోడయింది. దుడ్డున్నవాడిదే బర్రె అని సామెత చెప్పినట్టు లక్షల కోట్ల డాలర్ల సంపద వెచ్చించి కొన్న ఆయుధ సంపత్తితో, అబద్ధ ప్రచార ప్రసార సాధనాలతో, అరబ్ షేక్ లు, భారత్ మోదీ  వంటి తానా తందానాలతో ఇరాన్ అనే ఒక ప్రాచీన నాగరికతను, సమాజాన్ని, సంస్కృతిని ధ్వంసం చేస్తున్నాయి అమెరికా – ఇజ్రాయెల్ లు.

అక్కడ జరుగుతున్న విధ్వంసం ఒక ఎత్తయితే, ఆ యుద్ధం పర్యవసానంగా ప్రపంచమంతా రానున్న సమస్యలు మరొక ఎత్తు. ఈ అక్రమ యుద్ధాన్ని సాగిస్తున్న డొనాల్డ్ ట్రంప్, బెంజమిన్ నెతన్యాహూ బాగానే ఉంటారు. ఆయుధ ఉత్పత్తి కంపెనీలు గల్లాలు బలిసిపోతాయి. చమురు ఉత్పత్తి దేశాలు, చమురు సరఫఫా కంపెనీలు ఇబ్బడి ముబ్బడి లాభాలు చేసుకుంటాయి.

కాని సుదూరాన ఉన్న మన తెలంగాణ వాసులతో సహా ప్రపంచ ప్రజలందరూ తమ జీవితాల మీద, జీవనోపాధుల మీద, జీవన భద్రత మీద ప్రతికూల ప్రభావాలు చవిచూడవలసి వస్తుంది. ఇవాళో రేపో చమురు ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. అలా రవాణా ఖర్చులు పెరిగినందువల్ల మొత్తంగా సరుకుల ధరలన్నీ పెరుగుతాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం మాత్రమే కాదు, యుద్ధం కొనసాగితే సరఫరా కూడా ఆగిపోవచ్చు.

ఇప్పటికే గృహావసరాల ఎల్ పి జి సిలిండర్ ధర 60 రూపాయలు, వాణిజ్య అవసరాల సిలిండర్ ధర 115 రూపాయలు పెరిగాయి. వాణిజ్య అవసరాల సిలిండర్ వినియోగదారులలో హోటళ్లు, రెస్టారెంట్లు, పారిశ్రామిక సంస్థలు ఉన్నాయి గనుక ఇప్పటికే ప్రతికూల ఫలితాలు మొదలయ్యాయి. దేశమంతా హోటళ్లు, రెస్టారెంట్లు, మొత్తంగా ఆహార పరిశ్రమ కుప్పకూలే స్థితికి చేరింది. ఒక్క హైదరాబాద్ నగరలోనే నలబై వేలకు పైగా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, పది వేలకు పైగా పేయింగ్ గెస్ట్ హాస్టళ్లు ఈ ఎల్ పి జి ధరల గొడ్డలివేటుకు విలవిలలాడుతున్నాయి. యుద్ధం ఇంకా కొనసాగితే ధర పెరుగుదల మాత్రమే కాక, సరఫరా కూడా ఆగిపోవచ్చు. తత్ఫలితంగా ఈ పరిశ్రమల మీద ఆధారపడిన కార్మికుల, ఉద్యోగుల జీవనోపాధే ప్రమాదంలో పడవచ్చు.

యుద్ధం అనగానే దేశభక్తి, అది కూడా అమెరికా దేశభక్తీ, ఇజ్రాయెల్ దేశభక్తీ పొంగిపొరలి, ఉన్మాదులుగా మారిపోయేవారు, ఒక్క క్షణం ఆగి ఎవరి యుద్ధమిది, ఎందుకోసమిది, దీని దుష్ఫలితాలు అనుభవించేవారెవరు, దీనివల్ల లాభాలు పొందేవారెవరు అని ఆలోచించవలసి ఉంది. యుద్ధాన్నీ, యుద్ధోన్మాదాన్నీ, యుద్ధానికి మౌనంగా సహకరించే పాలకులనూ వ్యతిరేకించవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *