“2025–26 కేంద్ర బడ్జెట్‌ను ప్రభుత్వం వికసిత భారత్ గా ప్రచారం చేసింది. మౌలిక సదుపాయాలు, డిజిటల్ ఎకానమీ, రైల్వేలు, రహదారులు, రక్షణ రంగం వంటి అంశాలపై భారీ కేటాయింపులు చేశామని చెప్పుకుంది. కానీ ఆ బడ్జెట్ ప్రజల జీవితాల్లో ఎంత మార్పు తీసుకొచ్చింది? నిరుద్యోగ యువతకు ఎంతమంది ఉద్యోగాలు వచ్చాయి? రైతుల ఆదాయం ఎంత పెరిగింది?చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎంత బలపడ్డాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఆశించిన స్థాయిలో లేవు. స్టాక్ మార్కెట్ బలంగా ఉంది. కార్పొరేట్ లాభాలు బలంగా ఉన్నాయి. కొద్ది మంది సంపద బలంగా ఉంది. కానీ గ్రామీణ భారతం కొనుగోలు శక్తి తగ్గింది. చిన్న దుకాణాలు మూతపడి మధ్యతరగతి ఈఎంఐ ల మధ్య నలిగిపోతోంది.“

ఇల్లు కడితే పునాది గట్టిగా ఉండాలి అంటారు. దేశాన్ని నడిపే ఆర్థిక పునాది బడ్జెట్. కానీ నేటి బడ్జెట్లు పునాదులు బలపరచడం కాదు పై అంతస్తులు అలంకరించడమే లక్ష్యంగా మారాయి. కేంద్ర బడ్జెట్ అనేది కేవలం ఆదాయ వ్యయాల లెక్కల సమాహారం కాదు. అది ఒక దేశం తన ప్రజల పట్ల చూపించే నిబద్ధతకు అద్దం. ఒక ప్రభుత్వం ఏ వర్గాన్ని, ఏ రంగాన్ని కేంద్రంగా పెట్టుకుని పాలన చేస్తోందో, ఏ సమస్యలను జాతీయ ప్రాధాన్యంగా భావిస్తోందో, ఏ బాధలను నిర్లక్ష్యం చేస్తోందో బడ్జెట్ పేజీలలో స్పష్టంగా కనిపిస్తుంది.2026–27 కేంద్ర బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా అంచనాలు పెరిగాయి. దేశం ప్రస్తుతం ఉన్న ఆర్థిక, సామాజిక, రాజకీయ సంక్షోభాల సమాహారం. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, ఆరోగ్య విద్య రంగాల పతనం, రాష్ట్రాల ఆర్థిక స్వాయత్తతపై దాడులు ఇవన్నీ బడ్జెట్‌కి ముందు ప్రజల మనసులో తిరిగే ప్రశ్నలు. కేంద్ర బడ్జెట్ 2026–27పై దేశమంతా దృష్టి పెట్టడానికి కారణం ఇది ఆర్థిక ప్రకటన కాదు బాధల్లో ఉన్న ప్రజలకు బడ్జెట్ సంఖ్యలు ఓదార్పునిస్తాయి. కానీ ఆ సంఖ్యల వెనుక ప్రజల కన్నీళ్లు కనిపించకపోతే అది ఆర్థిక పాలన కాదు అది లెక్కల దౌర్జన్యం.
2025–26 కేంద్ర బడ్జెట్‌ను ప్రభుత్వం వికసిత భారత్ గా ప్రచారం చేసింది. మౌలిక సదుపాయాలు, డిజిటల్ ఎకానమీ, రైల్వేలు, రహదారులు, రక్షణ రంగం వంటి అంశాలపై భారీ కేటాయింపులు చేశామని చెప్పుకుంది. కానీ ఆ బడ్జెట్ ప్రజల జీవితాల్లో ఎంత మార్పు తీసుకొచ్చింది? నిరుద్యోగ యువతకు ఎంతమంది ఉద్యోగాలు వచ్చాయి? రైతుల ఆదాయం ఎంత పెరిగింది?చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎంత బలపడ్డాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఆశించిన స్థాయిలో లేవు. జిడిపి వృద్ధి శాతం చెప్పుకునే ప్రభుత్వానికి, ప్రజల కొనుగోలు శక్తి పడిపోతున్న వాస్తవం చూసాం. ప్రభుత్వం ప్రతి వేదిక పై భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది.భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని చెపుతుంది. స్టాక్ మార్కెట్ బలంగా ఉంది. కార్పొరేట్ లాభాలు బలంగా ఉన్నాయి. కొద్ది మంది సంపద బలంగా ఉంది. కానీ గ్రామీణ భారతం కొనుగోలు శక్తి తగ్గింది. చిన్న దుకాణాలు మూతపడి మధ్యతరగతి ఈఎంఐ ల మధ్య నలిగిపోతోంది.
2025–26లో ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉందని అధికారిక గణాంకాలు చెప్పినప్పటికి. వంట నూనె, బియ్యం, పప్పులు, కూరగాయలు, పాల ఉత్పత్తులు అన్నీ సామాన్యుడికి అందని ధరలకు చేరాయి. బడ్జెట్‌లో సబ్సిడీల తగ్గింపు, ఇంధన పన్నులపై స్పష్టత లేకపోవడం ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచింది. 2026–27 బడ్జెట్‌పై ప్రజల ఆశ కనీసం నిత్యావసరాలపై పన్నుల భారం తగ్గించాలి. కానీ ప్రభుత్వం ఆదాయ లోటును పూడ్చుకోవడానికి పరోక్ష పన్నుల మీదే ఆధారపడితే, ఈ ఆశ నెరవేరే అవకాశం ఎంత? ఉద్యోగ కల్పన అనే పదం అనేకసార్లు వినిపించింది. స్టార్టప్‌లు, స్కిల్ డెవలప్‌మెంట్, ముద్ర రుణాలు వంటి పథకాలు ప్రస్తావించబడ్డాయి. కానీ వాస్తవంగా ప్రభుత్వ రంగ నియామకాలు తగ్గాయి.భద్రత లేని కాంట్రాక్ట్ విధానం, ప్రైవేట్ రంగంలో అస్థిర ఉద్యోగాలు పెరిగాయి. రైతు భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అంటూనే 2025–26 బడ్జెట్‌లో వ్యవసాయానికి పెద్దగా ఒరిగిందేమి లేదు. ఎరువుల కొరత మరియు ధరలు పెరిగాయి. రైతు ఆదాయం రెట్టింపు అనే లక్ష్యం మాటలకే పరిమితమై కార్పొరేట్ అనుకూల విధానాల మధ్య రైతు నిలువలేకపోతున్నాడు.గత బడ్జెట్‌లో ఆదాయపు పన్ను స్లాబ్‌లపై కొంత సడలింపు ఇచ్చినట్టు ప్రభుత్వం చెప్పుకుంది. కానీ పెరిగిన GST, ఇంధన పన్నులు, విద్య ఆరోగ్య ఖర్చులు మధ్యతరగతి మీద భారంగా మారాయి. పన్ను చెల్లింపుదారుడిగా మధ్యతరగతి ప్రభుత్వానికి అవసరం. కానీ సంక్షేమ పథకాల ఫలితాల్లో మాత్రం ఈ వర్గం ఎప్పుడూ పక్కకు నెట్టబడుతుంది.
గత బడ్జెట్‌లో విద్య ఆరోగ్య రంగాలకు కేటాయింపులు ఆశించిన స్థాయిలో లేవు. ప్రభుత్వ పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు నిధుల కొరతతో నలిగిపోతున్నాయి. ప్రైవేటీకరణ వేగంగా సాగుతోంది. సంపాదించే సగం మొత్తం కార్పొరేట్ హాస్పిటల్స్ కే ఆరోగ్యం కొరకు చెల్లిస్తున్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని 2026–27 బడ్జెట్‌లోనైనా విద్య,ఆరోగ్యాన్ని మౌలిక హక్కుగా చూసి బడ్జెట్లో కేటాయింపులు పెంచాలి.గత బడ్జెట్‌లో కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే వాటా, జీఎస్టీ పరిహారం అంశాల్లో అస్పష్టత కనిపించింది. కేంద్రం ఆర్థిక అధికారాలను కేంద్రీకరిస్తోంది అనే విమర్శలు పెరిగాయి. కాబట్టి ఈ ఆర్ధిక బడ్జెట్ ఎలా ఉండబోతుందోనని రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి. గత బడ్జెట్‌లో పెట్టుబడులు వస్తాయని కార్పొరేట్ పన్నులపై సడలింపులు కొనసాగాయి. కానీ ఆ పెట్టుబడులు అనుకున్నంత ఉద్యోగాలు సృష్టించలేదు..కాబట్టి కార్పొరేట్ పన్నుల రాయితీలే కాక అట్టడుగు, మధ్యతరగతి ప్రజల అవసరతలను గుర్తించాలి.ప్రజలు బడ్జెట్‌ను తమ జీవితం మెరుగుపడే సాధనంగా చూస్తారు. పాలకులు ఏనుగుకు ఆహారం, చీమకు ఉపవాసం అన్నట్లు రాజకీయ వ్యూహంగా చూడకుండా 2026–27 బడ్జెట్‌లో మధ్యతరగతి కి అనుకూలంగా, వేతన జీవులకు పన్ను పరిమితులు పెంచి, జీవన వ్యయాలకు తగ్గట్టుగా ప్రజల వాస్తవ అవసరాలను గుర్తించేదిగా, సామాజిక న్యాయాన్ని కేంద్రంగా చేసుకొని బడ్జెట్ కేటాయింపులు ఉంటే ప్రజల మన్ననలు పొంది చరిత్రలో నిలిచేదిగా ఉండాలని కోరుకుందాం.





