– ఈ విజయం కార్యకర్తల శ్రమ ఫలితం
– ‘ఎక్స్’లో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు.ఈమేరకు ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితమన్నారు. పార్టీ పట్ల వారికి ఉన్న అనంతమైన అభిమానానికి నిదర్శనం. భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకూ ఈ విజయం అంకితం. అదేవిధంగా రెండేళ్ల ప్రజాపాలన, పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమం, ప్రపంచ స్థాయి ప్రణాళికలు, కార్యాచరణతో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఈ తీర్పు ద్వారా తమ సంపూర్ణ ఆమోదం తెలిపారు. ఈ విజయం తమ బాధ్యతను మరింత పెంచింది. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శక పాలనకు పునరంకితమవుతూ భవిష్యత్తులో ప్రతి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్‌ను గొప్పగా అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.
—————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





