– సర్పంచ్‌ల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్
-కాంగ్రెస్ ఒత్తిళ్లకు లొంగిపోవద్దు
– ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌దే
– మా హయాంలో తెలంగాణకు 30 అవార్డులు
– జిల్లా స్థాయిలో లీగల్ సెల్స్ ఏర్పాటు
– బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 27: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అద్భుతమైన విజయం సాధించింది. అధికార పార్టీ అరాచకాలను, అక్రమాలను తట్టుకొని మరీ భారీ సంఖ్యలో గ్రామ పంచాయతీల్లో సర్పంచులుగా మన పార్టీ నేతలు గెలిచారు. వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరి వంటి పెద్ద నాయకులు అధికార పార్టీ ప్రలోభాలకు లోనై పార్టీ వీడి పారిపోతే, గ్రామ గ్రామాన ఉన్న పార్టీ నేతలు నిలబడి కొట్లాడి గెలిచారని ప్రశంసించారు. అలాంటి ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ తరఫున కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. శనివారం మహబూబాద్‌లోని పీఎస్ ఆర్ కన్వెన్షన్‌లో నిర్వహించిన కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌ల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పార్టీ తరఫున గెలిచిన సర్పంచుల పైన కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి చేస్తుంది. కానీ రాజ్యాంగబద్ధంగా గ్రామ పంచాయతీలకు ఉన్న అధికారాలను తెలుసుకొని, కాంగ్రెస్ ప్రలోభాలకు తలవొగ్గకుండా గ్రామాలకు మంచి చేసే అవకాశం మనకు ఉన్నదన్న విషయాన్ని సర్పంచులు గుర్తించాలి. తండాలను గ్రామ పంచాయతీలు చేసి అభివృద్ధి చేసింది కేసీఆర్. ఒకప్పుడు తాగునీటి కోసం కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లే పరిస్థితి ఉండేది.. అటువంటి గ్రామాలను ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దాం. దేశంలో 3 శాతం జనాభా లేని తెలంగాణకు 30 శాతం కేంద్ర ప్రభుత్వ అవార్డులు వచ్చాయన్న సంగతి గుర్తుచేశారు. గెలిచిన సర్పంచ్‌లను బెదిరిస్తారు.. కానీ గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు ఎవరి అబ్బ సొత్తు కాదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో, గ్రామానికి సర్పంచ్ అలాగే. కేంద్రం విడుదల చేసే నిధులలో 75 శాతం గ్రామ పంచాయతీకే నేరుగా వస్తాయి. రెండేళ్ల కాంగ్రెస్ హయాంలో గ్రామాలు అధ్వాన్నంగా తయారయ్యాయి. మిగతా గ్రామాల సర్పంచ్‌లకు ఆదర్శంగా ఉండేలా బీఆర్ఎస్ సర్పంచుల గ్రామాల్లో అభివృద్ధి జరగాలి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బలవంతంగా మన పార్టీ సర్పంచులను ఇబ్బందులకు గురిచేస్తే, వాటిని ఎదుర్కొనేందుకు ప్రతి జిల్లాలో త్వరలో శిక్షణ కార్యక్రమాలతో పాటు ఒక ‘లీగల్ సెల్’ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లీగ్ మ్యాచ్ రూపంలో అద్భుతమైన విజయం సాధించిన మనం, రానున్న మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ సెమీఫైనల్స్‌లో గెలిచి, భవిష్యత్తులో అసెంబ్లీ, పార్లమెంట్ అనే ఫైనల్ ఎన్నికల్లో మన పార్టీని గెలిపించుకొని కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు. లగచర్లలో గిరిజన ఆడబిడ్డల పైన కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలకు అండగా మహబూబాబాద్‌లో నిర్వహించిన భారీ సమావేశం తర్వాతనే లగచర్ల భూముల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మహబూబాబాద్ లాంటి మారుమూల జిల్లా కేంద్రంలోనూ మెడికల్ కాలేజీని, జిల్లా ఆసుపత్రిని ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుంది. నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయం తీసుకున్నది కేసీఆర్. రామచంద్రారెడ్డిని కాంగ్రెస్ పార్టీ మరిచిపోయింది. ఎక్కడ రామచంద్రారెడ్డి.. ఎక్కడ రేవంత్ రెడ్డి! ఢిల్లీకి డబ్బు సంచులు ఇచ్చే వాళ్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఢిల్లీకి డబ్బు సంచులు ఇచ్చి ఉంటే 1970 దశకంలోనే రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారు. ఢిల్లీ గులాములు రామచంద్రారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించడం అంటే ఆయన ఆత్మ క్షోభిస్తుంది. రానున్న అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నానన్నారు.
జర్నలిస్టుల అరెస్ట్ అమానుషం
ప్రజల గొంతుక జర్నలిస్టులను అరెస్టు చేయడం, నిర్బంధించడం కాంగ్రెస్ నిరంకుశత్వానికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు.ప్రజాస్వామిక పరిరక్షణ అంటూ కాంగ్రెస్ ఇచ్చిన ఏడవ గ్యారంటీ ఇదేనా అని ప్రశ్నించారు. జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలపై శాంతియుతంగా వినతిపత్రాలు ఇచ్చేందుకు వెళ్లిన టీయూడబ్ల్యుజె-టీజేఎఫ్ నేతలను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది కేవలం నేతల అరెస్టు మాత్రమే కాదని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే జర్నలిస్టుల గొంతును పోలీసు బలగాలతో నొక్కేసే కుట్ర అని ఆయన విమర్శించారు. కొత్త జీవో సాకుతో జర్నలిస్టుల అక్రిడిటేషన్లలో కోత విధించడం ద్వారా ప్రభుత్వం వారి ప్రాథమిక హక్కులను కాలరాస్తోందని, ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రజలను మభ్య పెట్టేందుకు వచ్చిన ఆరు గ్యారంటీ లతో పాటు ప్రజాస్వామిక పరిరక్షణ పేరుతో ఇచ్చిన ఏడవ గ్యారెంటీ అంటే జర్నలిస్టులను అరెస్టు చేయడమేన అన్నారు. క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమించే జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్లు మంజూరు చేయాల్సింది పోయి, ఉన్న వాటిని తొలగించడం ద్వారా ప్రభుత్వం వారి ఉపాధిని మరియు ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్ట్ లఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని అన్నారు. మారుతి సాగర్, రమేశ్ హజారి, యోగానంద్, విష్ణువర్ధన్ రెడ్డి, రమణ కుమార్, కడకంచి వెంకట్ వంటి కీలక నేతలను అరెస్ట్ చేయడం దారుణం అన్నారు. జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను, నిర్బంధాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ, అక్రిడిటేషన్ల పునరుద్ధరణ కోసం సాగే పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ రవీందర్ రావు, జిల్లా పార్టీ అధ్యక్షురాలు కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రెడ్యా నాయక్, హరిప్రియ నాయక్, బీఆర్ఎస్ నేతలు రాకేష్ రెడ్డి, భరత్ కుమార్ రెడ్డి, సదానందం, యాళ్ల మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు కేటీఆర్‌కు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తొర్రూరులోనూ కేటీఆర్ కు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




