– పండగ తర్వాత చార్జీలు యథాతథం
– ఆర్టీసీ యాజమాన్యం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 9: రాఖీ పండగకు చార్జీలు పెంచడంపై ప్రయాణికుల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం స్పందించింది. ఆర్టీసీ నిర్వహణ కారణంగా కొంత చార్జీలు పెంచినట్టు ొక ప్రకటనలో తెలిపింది. పండగ తరువాత చార్జీలు యధాతథంగా ఉంటాయని వెల్లడిరచింది. ఈ నెల 11 వరకు స్పెషల్ బస్సుల్లో చార్జీలు పెంచినట్లు వెల్లడిరచింది. రద్దీకనుగుణంగా బస్సులు నడుపుతున్నామని, ప్రయాణికులు లేకున్నా బస్సులను వెంటనే తిరిగి తీసుకురావాల్సి వస్తుందని, ఈ నేపథ్యంలో నిర్వహణ ఖర్చుల నిమిత్తం స్పెషల్ బస్సుల్లో మాత్రమే చార్జీలు పెంచామని వివరించింది. ‘సోదర, సోదరీమణుల మధ్య ప్రేమ, అనుబంధాలకు ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా టీజీఎస్‌ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ప్రతి ఏడాది మాదిరిగానే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాఖీ పండగకు నడిపే స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను రూ.1.50 వరకు సవరించింది. స్పెషల్ బస్సులు మినహా రెగ్యులర్ బస్సుల్లో సాధారణ చార్జీలే అమల్లో ఉంటాయి. ప్రయాణికులకు సమాచార నిమిత్తం స్పెషల్ సర్వీసులకు ముందు భాగంలో డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేసింది. తిరుగు ప్రయాణంలో స్పెషల్ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఏమాత్రం లేనప్పటికీ రద్దీ ఉన్న రూట్లలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఖాళీ బస్సులను త్వరతగతిన సంస్థ వెనక్కి తెప్పిస్తున్నది. ఈ క్రమంలో ఆ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని 2003లో జీవో నంబర్ 16 ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.



