– తెలంగాణ మానవ హక్కుల కమిషన్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14: భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల, నివాస ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉన్న హెచ్‌పీ గ్యాస్ గోదాం వల్ల ముప్పును గురించిన ఫిర్యాదుపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. గోదాంను తరలించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. డాక్టర్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ నేతృత్వంలోని కమిషన్ ఈ విషయమై ఈనెల 14న ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలు, నివాస ప్రాంతాల మధ్య ఇలాంటి ప్రమాదకర గోడౌన్ల నిర్వహణ ప్రజల జీవించే హక్కును (ఆర్టికల్ 21) ఉల్లంఘించడమేనని కమిషన్ పేర్కొంది. ఇలాంటి ప్రాంతాల్లో ప్రమాదకర పదార్థాల నిల్వ ప్రజల భద్రతకు ముప్పుగా నిలుస్తుందని స్పష్టం చేసింది. రెండు నెలల లోపు సంబంధిత అధికారుల ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ను కమిషన్ ఆదేశిస్తూ కేసును ముగించింది.





