తెలంగాణ ఆర్టీసీకి ఊర‌ట‌

– ఈపీఎఫ్‌ నోటీసుపై స్టే విధించిన హైకోర్టు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 15: ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సిన ఉద్యోగుల బీమా పథకం కింద బకాయి రూ.131.76 కోట్లు చెల్లించాలని ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్‌ జారీ చేసిన నోటీసు అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. నోటీసులో ఏపీఎస్‌ఆర్టీసీ అని పేర్కొనడాన్ని తప్పుపట్టింది.  టీజీ, ఏపీ బకాయిల వివరాలపై క్లారిటీ లేదని గుర్తు చేసింది. అందుకే స్టే ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని పీఎఫ్‌ ప్రాంతీయ కమిషనర్‌కు జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌ కుమార్‌ మంగళవారం నోటీసులు జారీ చేశారు.
పీఎఫ్‌ అనుబంధ బీమా బకాయిలు రూ.131.76 కోట్లు చెల్లించాలని ఈ ఏడాది ఫిబ్రవరి 11న రీజినల్‌ పీఎఫ్‌ కమిషనర్‌ జారీ చేసిన నోటీసును తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ హైకోర్టులో సవాల్‌ చేసింది. ఆర్టీసీ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఎ .సుదర్మన్‌రెడ్డి వాదిస్తూ, పీఎఫ్‌ ఆఫీసులోని 600 క్లెయిమ్స్‌లో 165 మాత్రమే తెలంగాణకు చెందనవని, 433 ఏపీకి చెందినవని చెప్పారు. నోటీసులో ఏపీ, టీజీ రాష్ట్రాల బకాయిల వివరాలు లేవన్నారు. 2003–04 నుంచి 2023–25 వరకు ఉద్యోగ బీమా సొమ్ము కింద రూ.95.19 కోట్లను తెలంగాణ చెల్లించిందన్నారు. మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల 10,270 కుటుంబాలకు రూ.160.54 కోట్ల పరిహారం కూడా చెల్లింపులు చేసిందన్నారు. 2014–15 వరకు ఉన్న క్లెయిమ్స్‌ అన్నీ పరిష్కారం అయ్యాయని వివరించారు. 2015–16లో ఉమ్మడి రాష్ట్ర ఆర్టీసీలో కొన్ని, ప్రత్యేక తెలంగాణ కొన్ని క్లెయిమ్స్‌ మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 2024–25 దాకా క్లెయిమ్స్‌ అన్నింటినీ తెలంగాణ చెల్లించేసిందన్నారు. ఈ పరిస్థితుల్లో మరోసారి చెల్లించాలని నోటీసు ఇవ్వడం చట్ట వ్యతిరేకమన్నారు. పీఎఫ్‌ కమిషనర్‌ లాయర్‌ వాదిస్తూ, పిటిషన్‌ను కొట్టేయాలని, నోటీసుపై ఆర్టీసీకి అప్పీల్‌ చేసుకునే వీలున్నా పిటిషన్‌ వేయడం చెల్లదన్నారు. నోటీసులో ఏ రాష్ట్ర బకాయి ఎంతో స్పష్టత లేనందున స్టే ఇస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *