రెండు ఫిర్యాదులపై టీజీ హెచ్‌ఆర్‌సీ సీరియస్‌

– తీవ్ర స్వభావమున్న ఆరోపణలు
– విచారణకు హాజరు కావాలి
– అధికారులకు, ఫిర్యాదుదారులకు సమన్లు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 13: మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన రెండు వేర్వేరు ఫిర్యాదులను చైర్మన్‌ డాక్టర్‌ జస్టిస్‌ షమీమ్‌ అఖ్తర్‌ ఆధ్వర్యంలోని తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌(టీజీ హెచ్‌ఆర్‌సీ) పరిశీలించింది. సంబంధిత అధికారుల నుండి సమాధానం, విచారణ కోసం ఆదేశాలు జారీ చేసింది. మొదటి కేసులో (ఎస్‌ఆర్‌ నెం.3336/2025) ఇ.సత్యనారాయణ దాఖలు చేసిన ఫిర్యాదులో రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని మంథని ఎస్సై డేగల రమేష్‌.. సీలం రాజ్‌కుమార్‌ అనే వ్యక్తిని 2024 డిసెంబర్‌ 7న మంథని పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా హింసించినట్లు ఆరోపించారు. దాంతో బాధితుడు అదే నెల 8వ తేదీన ఆత్మహత్యాయత్నం చేయగా చికిత్స పొందుతూ 2025 సెప్టెంబర్‌ 19న మరణించినట్లు పేర్కొన్నారు. బాధితుడి కుటుంబాన్ని ఆ ఎస్సై బెదిరించి గ్రామంలో పెద్ద సంఖ్యలో పోలీస్‌ బలగాలను మోహరించి గందరగోళం రాకుండా ఉండేందుకు అదే రాత్రి బలవంతంగా శవదహనం చేయించినట్లు ఆరోపించారు. ఈ ఆరోపణలు తీవ్ర స్వభావమున్నవిగా కనిపిస్తున్నందున విచారణ అవసరమని భావించి వచ్చే నెల(డిసెంబర్‌) 4వ తేదీన కమిషన్‌ ఎదుట హాజరు కావాలని ఎస్సై దేగల రమేశ్‌కు సమన్లు జారీ చేసింది అలాగే ఫిర్యాదుదారు కూడా అదే తేదీన హాజరు కావాలని ఆదేశించింది. రెండవ కేసులో (ఎస్‌ఆర్‌ నెం.3339/2025) కమిషన్‌కు పోస్టు ద్వారా అందిన ఫిర్యాదులో వి.లక్ష్మీరాజం 2025 అక్టోబర్‌ 10న ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి కారణం కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం అధికారుల నుండి వచ్చిన నిరంతర వేధింపులు, బెదిరింపులు, అక్రమ డిమాండ్లు అని ఆరోపించారు. ఈ అంశాన్ని కమిషన్‌ తీవ్రంగా పరిగణించి కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఆఫీసర్‌(టీపీబీవో) సయ్యద్‌ ఖాదర్‌ నుండి సమాధానం కోరుతూ ఈ కేసును వచ్చే నెల(డిసెంబర్‌) 11వ తేదీకి వాయిదా వేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page