యూరోపియన్ పార్లమెంట్ డీజీ మాంగోల్డ్‌తో సీఈవో భేటీ

– డిజిటల్ దుష్ప్రచారాన్ని అడ్డుకునే మార్గాలపై చర్చలు

బ్రస్సెల్స్/హైదరాబాద్, జనవరి 13: ఎన్నికల సమయంలో తప్పుడు సమాచారం, సోషల్‌మీడియా ఆధారిత దుష్ప్రచారాన్ని అడ్డుకునే అంశంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సి.సుదర్శన్‌రెడ్డి యూరోపియన్ పార్లమెంట్ డైరెక్టర్ జనరల్ ఫర్ కమ్యూనికేషన్ క్రిస్టియన్ మాంగోల్డ్‌తో మంగళవారం కీలక భేటీ నిర్వహించారు. ఎన్నికల వ్యవస్థ నిర్మాణం, ప్రజలతో కమ్యూనికేషన్ నిర్వహించే విధానం, ఫేక్ న్యూస్ వ్యాప్తిని నియంత్రించేందుకు యూరోపియన్ యూనియన్ తీసుకుంటున్న సాంకేతిక, విధానపరమైన చర్యలను మాంగోల్డ్ వివరించారు. డిజిటల్ వేదికలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని గుర్తించి తక్షణమే స్పందించే ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థల గురించి కూడా ప్రస్తావించారు. సీఈవో సుదర్శన్‌రెడ్డి భారత ఎన్నికల విధానాన్ని సమగ్రంగా వివరిస్తూ వృద్ధులు, దివ్యాంగులు, వలస ఓటర్లు వంటి వర్గాలకు సులభంగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం అమలు చేస్తున్న నూతన కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిర్వహిస్తున్న ఎన్నికల తీరుపై మాంగోల్డ్ ప్రత్యేకంగా ప్రశంసలు వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు. జనవరి 2025 నుంచి యూరోపియన్ పార్లమెంట్‌లో డైరెక్టర్ జనరల్ ఫర్ కమ్యూనికేషన్‌గా క్రిస్టియన్ మాంగోల్డ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నికల నిర్వహణలో అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయడం, డిజిటల్ యుగంలో ఎన్నికల విశ్వసనీయతను పరిరక్షించడమే లక్ష్యంగా సీఈవో నేతృత్వంలోని తెలంగాణ బృందం యూరప్ పర్యటనలో భాగంగా ఈ భేటీ జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

కూ లూవెన్ యూనివర్సిటీతో ఈసీఐ బృందం కీలక భేటీ

బెల్జియం అధికారిక పర్యటనలో భాగంగా ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) తెలంగాణ కార్యాలయానికి చెందిన బృందం ప్రపంచ ప్రసిద్ధ కూ లూవెన్ యూనివర్సిటీ (KU Leuven)తో ముఖ్యమైన చర్చలు నిర్వహించింది. ప్రజాస్వామ్య ప్రక్రియలు, ఎన్నికల నిర్వహణ విధానాలపై భారత్–బెల్జియం దేశాల మధ్య పోలికలు ప్రధాన అంశంగా ఈ భేటీ సాగింది. కూ లూవెన్ యూనివర్సిటీలోని సోషల్ సైన్సెస్ విభాగం డీన్‌, ప్రొఫెసర్లు బెల్జియం ఎన్నికల వ్యవస్థ, ఓటింగ్ విధానాలు, సంస్థాగత భద్రతా చర్యలు, ఆధునిక సవాళ్లపై భారత బృందానికి సమగ్రంగా వివరించారు. అనంతరం భారత ప్రతినిధులు దేశంలోని ఎన్నికల వ్యవస్థ విస్తృతి, సామాజిక వైవిధ్యం, సమాఖ్య స్వరూపం వంటి విశిష్ట లక్షణాలను ప్రస్తావిస్తూ భారత ఎన్నికల ప్రక్రియపై తులనాత్మక సమీక్షను ప్రవేశపెట్టారు. తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి. సుధర్శన్‌రెడ్డి మాట్లాడుతూ,ఇండియా ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలెక్షన్ మేనేజ్‌మెంట్ (IIIDEM) ఎన్నికల అధికారుల సామర్థ్య వృద్ధి, అంతర్జాతీయ అనుభవాల మార్పిడిలో కీలక పాత్ర పోషిస్తున్నదన్నారు. శిక్షణ, సంయుక్త పరిశోధనలు, గ్లోబల్ ఉత్తమ విధానాల పంచకంలో భాగస్వామ్యానికి కూ లూవెన్ యూనివర్సిటీ ముందుకు రావాలని ఆహ్వానించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌లో 99 కోట్ల మందికిపైగా ఓటర్ల విశ్వాసాన్ని నిలబెట్టేలా ఈసీఐ అమలు చేస్తున్న కఠిన చర్యలు, పారదర్శకత, ఎన్నికల సమగ్రత పరిరక్షణ అంశాలను కూడా భారత బృందం వివరించింది. సమావేశంలో అనుదీప్ దురిశెట్టి, బోయపాటి చెన్నయ్య, కె.అనంత్‌రెడ్డి, ధృవ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ భేటీతో భారత్–బెల్జియం దేశాల మధ్య ఎన్నికల నిర్వహణ రంగంలో అకడమిక్ సహకారం మరింత బలోపేతం కానుందని అధికారులు అభిప్రాయపడ్డారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *