– మా విజన్‌లో భాగస్వాములు కండి
– ఎటెక్స్‌కాన్ సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: నిజాం కాలంలో ప్రపంచం నలుమూలల నుంచి వ్యాపారులు హైదరాబాద్‌కు వచ్చి వస్త్రాలు, ముత్యాలు కొనుగోలు చేసేవారు..టెక్స్‌టైల్ మనకు పరిశ్రమ మాత్రమే కాదు.. జీవనాధారం అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ డీఎన్‌ఏలోనే టెక్స్‌టైల్ ఉందని చెప్పడానికి గర్విస్తున్నానన్నారు. హైటెక్స్‌లో శుక్రవారం జరిగిన ఏషియన్ టెక్స్‌టైల్స్ కాన్ఫరెన్స్-2026 (ఎటెక్స్‌కాన్)లో ఆయన ప్రసంగించారు. ఈ సదస్సుకు విచ్చేసిన మీరు అతిథులు మాత్రమే కాదు.. మా అభివృద్ధిలో, మా విజన్‌లో భాగస్వాములు అని చెప్పారు. భారత దేశానికి అత్యుత్తమ వస్త్రాలను తయారు చేసిన గొప్ప చరిత్ర ఉంది.. శతాబ్దాలుగా కళలు, సంస్కృతి, సంప్రదాయాలు టె టైల్ రంగానికి మరింత పరిపూర్ణతనిచ్చాయని తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పవిత్ర వస్త్రాలను సమర్పించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ పోచంపల్లి ఇక్కత్ నుంచి గద్వాల్ చీరల వరకు, వరంగల్ దర్రీస్ నుంచి నారాయణపేట చేనేత వరకు ఎన్నో ఉన్నాయని చెప్పారు. టెక్స్‌టైల్ రంగంలో తెలంగాణ ముందంజలో ఉండటానికి చారిత్రక కారణాలు ఉన్నాయి.. దేశంలో పత్తి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామిగా ఉంది. మన పత్తి నాణ్యతకు ప్రపంచవ్యాప్తంగా పేరు ఉంది.. టెక్స్‌టైల్ రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేశామని వివరించారు. ఇందులో అనేక అపరెల్ పార్కులు ఉన్నాయి.. తెలంగాణలో నైపుణ్యంతోపాటు సంకల్పం కూడా ఉంది.. డీప్ టెక్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్, ఎనర్జీ ఇలా అనేక రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉంది అని చెప్పారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ 2034 నాటికి ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం తమ విజన్ అని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 2047 నాటికి వందేళ్లు పూర్తి చేసుకుంటుంది. టెక్స్‌టైల్ రంగంలో తమకు ఒక విజన్ ఉంది.. 2047 నాటికి తెలంగాణను దక్షిణ ఆసియా టెక్ప్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రభుత్వం మీకు మౌలిక సదుపాయాలు, భూమి, విద్యుత్, నీరు, ప్రోత్సాహకాలతోపాటు వేగంగా అనుమతులు మంజూరు చేస్తుంది.. అత్యుత్తమ మానవ వనరులు మా బలం.. మీకు విజన్ ఉంటే మీ పెట్టుబడులకు తెలంగాణ సరైన వేదిక. మాతో కలిసి రండి.. అని పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని మార్చగల పూర్తి టెక్స్‌టైల్ ఎకోసిస్టమ్‌ను నిర్మిద్దాం.. పత్తి ఉత్పత్తిలోనే కాదు.. లండన్, న్యూయార్క్, పారిస్, మిలాన్, టోక్యో, దుబాయ్ ఫ్యాషన్ షోల వరకు అనేక అంశాల్లో తెలంగాణ కలిసి పనిచేస్తోంది అని వెల్లడించారు. దేశానికి మాత్రమే కాదు.. ప్రపంచానికి కూడా సినిమా నిర్మాణ కేంద్రంగా హైదరాబాద్ ఎదుగుతోంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ ఇక్కడ స్టూడియోలను ప్రారంభించింది. టాలీవుడ్, బాలీవుడ్ ఇప్పటికే హైదరాబాద్‌ను తమ కేంద్రంగా మార్చుకున్నాయి.. ఇప్పుడు హాలీవుడ్ కూడా చేరింది. సినిమా రంగం తమ ఫ్యాషన్‌ను కూడా తెలంగాణ నుంచే పొందేలా ప్రోత్సహిస్తాము. పర్యావరణ పరిరక్షణ మా అత్యున్నత ప్రాధాన్యం.. అని చెప్పారు. గ్రీన్ టెక్స్‌టైల్ హబ్‌లను అభివృద్ధి చేస్తాం.. యువతకు, ముఖ్యంగా మహిళలకు శిక్షణ అందిస్తాం.. సంప్రదాయ ఆలోచనలను ఆధునిక టూల్స్‌తో కలిపి డిజైన్, కటింగ్, స్టిచింగ్‌లో ఉపయోగించేలా చేస్తాం.. ప్రపంచానికి వ్యాక్సిన్లు, ఔషధాలు అందించిన రాష్ట్రం మనది.. ఆపిల్ ఇయర్‌పాడ్స్ కూడా ఇక్కడే తయారవుతున్నాయి. ఇప్పుడు ప్రపంచంలోని ప్రతి దేశంలో తెలంగాణలో తయారైన దుస్తులు ధరించేలా లక్ష్యంగా పెట్టుకున్నాం అని సీఎం రేవంత్ వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




