టెన్త్ పరీక్షలు ప్రారంభం

– అరగంట ముందుగానే కేంద్రాలకు అనుమతి
– ఒక్క అభ్యర్థి కోసం ఎగ్జామ్ సెంటర్
– ఇంట్లో శవం.. పరీక్ష హాలులో విద్యార్థి
– గుండెపోటుతో టీచర్ మృతి.. కొడుకు పరీక్షకు హాజరు

హైదరాబాద్,ప్రజాతంత్ర, మార్చి 14: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యా యి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జ‌రుగుత‌న్నాయి. అరగంట ముందుగానే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షలు ఏప్రిల్ 16 వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 2676 కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన పరీక్షా కేంద్రాలలోనికి అనుమతిస్తామని అధికారులు చెప్పారు. పలు కేంద్రాల్లో విద్యార్థులకు ఆల్టి బెస్టు చెబుతూ ప్లెక్సీలు వెలిశాయి. ఇందులో 5,17,727మంది రెగ్యులర్, ఒకసారి ఫెయిలైన 10,512 మంది విద్యార్థులు ఉన్నారు. ఈసారి ప్రైవేటు పాఠశాల నుంచి అత్యధికంగా 2,50,015 విద్యార్థులుండగా, ప్రభుత్వ బడుల నుంచి 2,07,573 మంది, సంక్షేమ గురుకులాల నుంచి 60,139 మంది. విద్యార్థులు ఉన్నారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,676 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 1,582 ప్రభుత్వ, 1,094 ప్రైవేటు విద్యాసంస్థలున్నాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ తెలిపారు. పాఠశాల గుర్తింపు తెలియకుండా సాధారణ దుస్తుల్లోనే విద్యార్థులు పరీక్షకు రావాలని కోరారు. పర్యవేక్షణకు 144 ఫ్లయింగ్ సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటుచేశామన్నారు.

ఒక్కడి కోసం ఎగ్జామ్ సెంటర్.. తీరా డుమ్మా 

నాగర్ కర్నూలు: సాధారణంగా ఒక్కో పరీక్షా కేంద్రంలో వందలాదిమంది రాస్తుంటారు. కానీ నాగర్ కర్నూలు జిల్లాలో మాత్రం విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఒక్క విద్యార్థి కోసం ప్రత్యేకంగా ఎగ్జామ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. పరీక్ష నిర్వహణకు ఒక ఇన్విజిలేటర్, సూపరింటెండెంట్ను నియమించారు. ఎగ్జామ్ సెంటర్కు పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా చేసి తీరా ఎగ్జామ్ పెడితే.. ఆ ఒక్క విద్యార్థి ఎగ్జామ్కు డుమ్మా కొట్టి అధికారులకు షాకిచ్చాడు. వివరాల్లోకి వెళ్తే.. నాగర్ కర్నూలు జిల్లాలో బ్రిడ్జి కోర్సుకు సంబంధించి పరీక్షల కోసం ఇటీవల దరఖాస్తులను స్వీకరించారు. కానీ దీనికి పెద్దగా స్పందన రాలేదు. ఇంటర్ పూర్తి చేసుకున్న వరుణ్ సందేశ్ అనే విద్యార్థి ఒక్కడే పరీక్షకు దరఖాస్తు చేసుకున్నాడు. జనరల్ బ్రిడ్జి కోర్సు మ్యాథమేటిక్స్ పరీక్ష రాసేందుకు ఫీజు చెల్లించాడు. ఒక్కడే విద్యార్థి దరఖాస్తు చేసుకున్నాడని అధికారులు పట్టించుకోకుండా ఉండలేదు. విద్యార్థికి ఆసక్తి ఉందని భావించి, ఆ ఒక్కడి కోసమే జిల్లాలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. పరీక్ష నిర్వహణకు ఒక ఇన్విజిలేటర్, సూపరింటెండెంట్ను కేటాయించారు. అలాగే పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇంతా చేసినా ఆ ఒక్క విద్యార్థి మాత్రం ఎగ్జామ్కు హాజరు కాలేదు. దీంతో పరీక్షా కేంద్రం ఖాలీగా కనిపించింది. ఒక్క విద్యార్థి కోసం చేసిన ఏర్పాట్లు అన్నీ వృథా కావడంతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు.

రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి.. పరీక్ష హాలులో కొడుకు

మెదక్: మెదక్ జిల్లాలో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. శివ్వంపేట మండలం ఉసిరికపల్లి గ్రామశివారులో అర్ధరాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో పాంబండ గ్రామానికి చెందిన కుమ్మరి నాగరాజు మృతిచెందారు. నాగరాజుకు శనివారం అంత్యక్రియలు జరగాల్సి ఉంది. అయితే ఈ దుఃఖాన్ని దిగమింగుకొని ఆయన కొడుకు ధనుష్ పదోతరగతి పరీక్షకు హాజరయ్యాడు. ఈ విషాదకర సంఘటన ప్రతి ఒక్కరినీ కలి చివేస్తోంది. తండ్రి మరణించిన పుట్టెడు దుఃఖంలో కూడా, తన భవిష్యత్తు కోసం కన్నీళ్లతో పరీక్షా కేంద్రానికి వచ్చిన ఆ విద్యార్థి.. తన సహచర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారని స్థానికులు తెలిపారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పాంబండ గ్రామానికి చెందిన కుమ్మరి నాగరాజు (45) అర్ధరాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఉసిరికపల్లి గ్రామ శివారులో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో నాగరాజు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇంటి వద్ద తండ్రి అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతుండగా, తండ్రి కలలను నిజం చేయాలనే పట్టుదలతో ధనుష్ పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నారు. తండ్రిని కోల్పోయిన బాధను గుండెల్లో దాచుకుని, కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతుండగా ధనుష్ పదోత రగతి పరీక్షకు ఈరోజు హాజరయ్యారు. తండ్రి మరణించినా ధైర్యం కోల్పోకుండా పరీక్షకు హాజరైన ధనున్ను చూసి గ్రామస్థులు చలించిపోయారు. ‘ఎంత కష్టమొచ్చినా చదువును వదల్లేదు’ అంటూ ధనుశ్ను ఓదార్చారు. అధికారులు, ఉపాధ్యాయులు కూడా ధనుశ్కు ధైర్యం చెప్పారు. ఒక సామాన్య కుటుంబానికి చెందిన నాగరాజు. తన కొడుకును గొప్పగా చదివిం చాలని కలలు కనేవారని స్థానికులు తెలిపారు. ఆ కల కోసం ధనుశ్ కన్నీటితో పరీక్ష రాయడం…ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *