– పలుచోట్ల పరస్పర ఘర్షణలు
– దొంగ ఓట్ల ఆరోపణలతో పోలీసుల జోక్యం
– సాయంత్రం 5 గంటల సమయానికి 70 శాతం పోలింగ్
– ఓటు వేసిన సీఎం రేవంత్, కేంద్ర మంత్రి బండి, రాష్ట్ర మంత్రులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: రాష్ట్రంలో 116 మున్సిపాలిటీల 2,569 వార్డులు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల 412 వార్డులకు చెందిన కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ఎన్నికలకు సంబంధించి బుధవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం సమాచారం ప్రకారం ఉదయం 9 గంటల సమయానికి 11.6 శాతం, 11 గంటలకు 28.48 శాతం, మధ్యాహ్నం 1 గంటకు 48.54 శాతం, మధ్యాహ్నం 3 గంటలకు 62.09 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల సమయానికి సుమారు 70 శాతం ఓటింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. అవసరమైతే రేపు (గురువారం) రీ-పోలింగ్ జరుగుతుంది. పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన అధికార కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలో దిగగా బీజేపీ కాంగ్రెస్, బీఆరఎస్‌కు ప్రత్యామ్నాయంగా నిలబడాలని, 2023 అసెంబ్లీ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతికూలతలు ఎదుర్కొన్న బీఆరఎస్ పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించి మున్సిపల్‌లో రెట్టింపు స్థానాలు గెలుపొందాలని లక్ష్యంగా పెట్టుకుంది.
పలుచోట్ల ఉద్రిక్తతలు
పలు జిల్లాల్లో స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మహబూబాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కార్యకర్తల మధ్య ఘర్షణలు, నినాదాలు, దొంగ ఓట్ల యత్నాలు వంటి ఘటనలు వెలుగుచూశాయి. పోలీసులు వేగంగా స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మహబూబాబాద్ పట్టణంలోని 32, 33 పోలింగ్ బూత్‌ల వద్ద స్వల్ప ఘర్షణలు జరిగాయి. 14వ వార్డులో పోటీలో ఉన్న కాంగ్రెస్, బీఆరఎస్ అభ్యర్థుల కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఘర్షణకు దిగాయి. కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆరఎస్ కార్యకర్తలు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనతో పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత పెరిగింది. సమాచారం అందుకున్న వెంటనే భారీగా పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు 14వ వార్డులో భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లాలో బుధవారం ఉదయం 9 గంటల వరకు 14 శాతం పోలింగ్ నమోదైంది. నగరంలోని కోటగల్లీ 25వ డివిజన్‌లో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు పరస్పరం నినాదాలు చేసుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని గమనించిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. బోధన్ పట్టణంలో ఎంఐఎం, బీఆరఎస్ కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేస్తూ ఉద్రిక్త వాతావరణం సష్టించారు. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. నిజామాబాద్ జిల్లాలోని రాకాసిపేట్ పోలింగ్ కేంద్రంలో ఇద్దరు వ్యక్తులు దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బూత్ నెంబర్ 24,78లలో ఇతరుల పేరుతో ఓటు వేసేందుకు ఇద్దరు యువకులు వచ్చారు. తప్ప్పుడు గుర్తింపు పత్రాలతో పోలింగ్ కేంద్రంలోకి రావడంతో అధికారులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. దీంతో 21వ వార్డు పరిధిలోని అరీసాసాగర్ నగర్‌లో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఒకేచోట బీఆరఎస్, ఎంఐఎం కార్యకర్తలు గుమిగూడి పరస్పర నినాదాలు చేసుకున్నారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో వారిని అడ్డుకుని కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ 15వ వార్డులోనూ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రానికి వెళ్తున్న ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ బీజేపీ, బీఆరఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగి ఇరు వర్గాల మధ్య బాహాబాహీ చోటుచేసుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని 28వ వార్డు పోలింగ్ కేంద్రంలో ఓ వ్యక్తి దొంగ ఓటు వేయడానికి ప్రయత్నించాడు. అప్పటికే మరో పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన ఆ వ్యక్తి 28వ వార్డులో కూడా ఓటు వేసేందుకు వచ్చినట్లు గుర్తించారు. అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పోలింగ్ అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఆ వ్యక్తి చేతి వేలికి సిరా గుర్తు వేసి పోలింగ్ కేంద్రం నుంచి పంపించారు. చట్టపరంగా ఆ వ్యక్తిపై తదుపరి చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు తెలిపారు.
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. కేంద్ర మంత్రి బండి సంజjáYT కరీంనగర్‌లోని జ్యోతినగర్ ఎసఆర్ హైస్కూల్‌లో ఓటు వేశారు. అలాగే రాష్ట్ర మంత్రులు కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి కోదాడలోని 14వ వార్డు 34వ పోలింగ్ బూత్‌లో, భట్టి విక్రమార్క మధిర 9వ వార్డు ఇందిరా డెయిరీ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఎన్నికల అధికారుల తీరుపై ఎంపీ ఆగ్రహం
నిజామాబాద్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ హల్‌చల్ చేశారు. హరిచరణ్ మార్వాడీ స్కూల్ పోలింగ్ కేంద్రంలో పోలీసులు, ఎన్నికల సిబ్బందిపై అర్వింద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థిని పోలీసులు బయటకు పంపేశారని, ఎన్నికల సిబ్బంది తమకు సహకరించడం లేదని ఎంపీకి కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఎంపీ.. పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. సంగతి చూస్తానని పోలీసులను హెచ్చరించారు. ఈ విషయంపై జిల్లా ఎన్నికల అధికారికి సమాచారం పంపిన ఎంపీ అర్వింద్.. బీజేపీ అభ్యర్థిని బయటకు పంపిన అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వోటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ వోటు హక్కును వినియోగించుకున్నారు.
పోలీసుల తీరుపై జగ్గారెడ్డి ఆగ్రహం
పట్టణంలోని 34వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న సీఐ.. 34 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టుకున్నారని ఆరోపిస్తూ సీనియర్ నేత జగ్గారెడ్డి పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. పోలింగ్ ఆపేస్తామంటూ బూత్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, జగ్గారెడ్డికి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. బీఆర్‌ఎస్ అభ్యర్థి రిగ్గింగ్‌కు సీఐ సహకరిస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. సీఐని సస్పెండ్ చేయకపోతే ఎన్నికలు బహిష్కరిస్తామని హెచ్చరించారు.



తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





