- నేటి నుండి ఆగస్ట్ 3 వరకు మావోయిస్టు సంస్మరణ వారోత్సవాలు
– అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్న భద్రత బలగాలు
– దంతెవాడ జిల్లాలో మావోయిస్టుల స్మారక చిహ్నాలు కూల్చివేత
– సరిహద్దుల్లో విస్తృతంగా పోలీసుల తనిఖీలు
భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 28 : తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. సోమవారం నుండి ఆగస్ట్ 3వ తేది వరకు మావోయిస్టులు సంస్మరణ వారోత్సవాలు నిర్వహించుకోవాలని అనేకసార్లు లేఖలు ద్వారా సమాచారం ఇచ్చారు. ఈ నేపధ్యంలో తెలంగాణ, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం ఉంది. ఇటు పోలీసులు సరిహద్దు రాష్ట్రాల వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. మావోయిస్టులు ఇటీవల కాలంలో 357 మందిని కోల్పోవల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరిని స్మరించుకుంటూ సంస్మరన వారోత్సవాలు నిర్వహించుకుంటున్నారు. ఇందుకోసం ఛత్తీస్‌గడ్ అటవీ ప్రాంతంలో సభలు, సమావేవాలు ఏర్పాటు చేసుకుని మృతి చెందిన మావోయిస్టుల ఆత్మకు శాంతి చేకూరాలని నినాదాలు చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే అటవీ ప్రాంతంలో భారీగా బ్యానర్లు ఏర్పాటు చేసి వారి నిరసన తెలిపినట్లు తెలుస్తుంది. ఇటు భద్రత బలగాలు కూడ అటవీ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో జల్లెడపడుతుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టుల స్మారక చిహ్నాలను ఏర్పాటు చేసుకున్నారు. వీటిని గమనించిన భద్రత బలగాలు భారీ సంఖ్యలో ఆ ప్రాంతానికి చేరుకుని వాటిని తొలగిస్తున్నారు. అలాగే మావోయిస్టులు కూడ భద్రత బలగాలకు సవాలుగా వారోత్సవాలను విజయవంతం చేసే దిశగా ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. సంస్మరణ వారోత్సవాలను భగ్నం చేసేందుకు భద్రత బలగాలు అటవీ ప్రాంతంలో కూంబింగ్ ముమ్మరం చేసారు. చర్ల, దుమ్ముగూడెం,భద్రాచలం,వెంకటాపురం, పినపాక, కరకగూడెం సరిహద్దు ప్రాంతాల్లో పోలీస్ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అందులో భాగంగానే భద్రాచలం సరిహద్దు ప్రాంతంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతేకాక ఆర్టీసి బస్టాండ్‌లో కూడ వ్యక్తులను తనిఖీలు చేస్తూ అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే మావోయిస్టు పార్టీ కేంద్ర, రాష్ట్ర క్యాడర్‌ను పూర్తిగా నష్టపోయింది. ఈ నష్టాన్ని మళ్ళీ పూడ్చుకునే దిశలో ఈ వారోత్సవాలను వేదికగా చేసుకుంటునట్లు తెలుస్తుంది. వారోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఆర్.కొత్తగూడెం గ్రామంలో మావోయిస్టుల కరపత్రాలు, బ్యానర్లు వెలిసాయి. ప్రజా ఉద్యమాల ద్వారా ఆపరేషన్ కగార్‌ను కలిసి కట్టుగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. మావోయిస్టుల వారోత్సవాల తరుణంలో ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర భయాంధోళన చెందుతున్నారు. ఇటు మావోయిస్టులు అటు భద్రత బలగాల మద్య అమాయక ఆదివాసీలు భయ భ్రాంతులకు గురి అవుతున్నారు. భద్రత బలగాలు మావోయిస్టుల కదలికను తెలుసుకునేందుకు ఆయా ప్రాంతాల్లోని ఆదివాసీలను ప్రశ్నలతో వేధింపులకు గురిచేస్తున్నారని తెలుస్తుంది. ఏ సమయంలో ఏమి జరుగుతుందోనని టెన్షన్ సరిహద్దు ప్రాంతంలో ఉంది.





