– ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డికి అస్వస్థత
– పరీక్షించిన వైద్యులు.. విశ్రాంతి తీసుకోవాలని సూచన
కామారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: కామారెడ్డిలో ఉద్రిక్తత కొనసాగుతున్న వేళ ఎమ్మెల్యే కె.వెంకట రమణారెడ్డి సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రెండుమూడు రోజులుగా కొనసాగుతున్న రాజకీయ పరిణామాల ఒత్తిడి నేపథ్యంలో ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన గృహ నిర్భంధంలో ఉండగా డాక్టర్లు ఇంటికి వెళ్లి ప్రాథమిక వైద్య పరీక్షలు చేశారు. నియోజకవర్గంలో భూ వివాదానికి సంబంధించి జరుగుతున్న గొడవ సవాళ్లు, ప్రతి సవాళ్లకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే ఆరోగ్యంపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. కొన్ని రోజులపాటు ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్ల నేపథ్యంలో స్థానికంగా హైటెన్షన్ వాతావారణం నెలకొంది. సోమవారం జిల్లా కలెక్టర్‌తో ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి భేటీ కావాలనుకున్నారు. తనపై చేసిన ఆరోపణల నేపథ్యంలో అందుకు సంబంధించిన సాక్ష్యాలు తీసుకురావాలంటూ కాంగ్రెస్ నేతలకు ఆయన సవాల్ విసరగా ఈ సవాల్‌ను వారు స్వీకరించారు. అందుకు సంబంధించిన సాక్ష్యాలను కలెక్టర్ వద్దకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. మరోవైపు డిగ్రీ కాలేజీ భూముల విషయంలో తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని వెంకట రమణారెడ్డి ప్రకటించిన విషయం విదితమే. రాజీనామాకు సిద్ధం కావాలంటూ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ నేతలు సవాల్ విసిరారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూములపై స్పష్టత ఇవ్వాలంటూ అధికారులను బీజేపీ డిమాండ్ చేసింది. ఇలా ఇరు పార్టీనేతల విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. బీజేపీ ఎమ్మెల్యేకు మద్దతుగా కామారెడ్డి వెళ్లేందుకు యత్నించిన బీజేపీ చీఫ్ రామచందర్ రావును ఆదివారం హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన్ను అదుపులోకి తీసుకుని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కామారెడ్డి వెళ్తుండగా ఆయన్నూ పెద్దశంకర్‌పేట వద్ద అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించిన విషయం విదితమే.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.