టెండ‌ర్ ర‌ద్దు చేశారంటే అవినీతి జ‌రిగిన‌ట్టే క‌దా!

– మ‌సిబూసి మారేడుకాయ చేయొద్దు
– డిప్యూటీ ముఖ్య‌మంత్రి  సోలార్ స్కాంపై మాట్లాడ‌రేం?
– రేవంత్ బావ‌మ‌రిది కోస‌మే ఈ త‌తంగ‌మంతా
– ఎక్స్ వేదిక‌గా హ‌రీష్‌రావు విమ‌ర్శ‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 24: బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని సూటిగా చెప్పలేక, భట్టి విక్ర‌మార్క‌ విషయాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని హరీష్ రావు ఆరోపించారు. ఈమేర‌కు ఆయ‌న ఎక్స్ లో పోస్ట్ చేశారు.  నైనీ టెండర్ రద్దు చేయడమే అవినీతికి నిదర్శనమని, అదే తరహాలో పిలిచిన మిగిలిన టెండర్లను ఎందుకు రద్దు చేయడం లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భట్టి గారూ.. బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని చెప్పకుండా బీటింగ్ అరౌండ్ ద బుష్ లా ఏదో చెప్పి, మసిబూసి మారేడు కాయ చేసారు. మీరెన్ని సాకులు చెప్పినా మీ కాంగ్రెస్ పాలనలో బొగ్గు కుంభకోణం జరిగింది నిజం. అందులో రేవంత్ రెడ్డి బామ్మర్ది రింగ్ మెన్ గా పాత్ర పోషించింది నిజం. నేను సూటిగా అడుగుతున్నా.. ఏ స్కాం జరగకుంటే నైనీ టెండర్లను రద్దు చేస్తున్నట్లు ఎందుకు ప్రకటించారు? నిన్న నేను బయటపెట్టిన మరో కుంభకోణం.. సోలార్ పవర్ స్కాం గురించి ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు? నైనీని రద్దు చేసినట్లే మిగతా అన్ని టెండర్లను ఎందుకు రద్దు చేయడం లేదు? సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనను బిఆర్ఎస్ మీద నెట్టే ప్రయత్నం చేయడం వల్ల నిజాలు అబద్దాలు అయిపోవు.. జరిగిన స్కాంలు, స్కీంలుగా మారిపోవు. సైట్ విజిట్ నిబంధనను 2018లోనే మొదలైందని చెప్పి, దానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఉదాహరణలుగా చెప్పి ఏం చెప్పదలుచుకున్నారు? అది తప్పు కాకుంటే నైనీ ఎందుకు రద్దు చేసినట్లు? ఇదే సైట్ విజిట్ విధానం సింగరేణిలో కూడా అమలు చేసామని ఇప్పటికైనా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. సైట్ విజిట్ అమలయ్యింది, నైనీ రద్దు జరిగింది అంటే.. స్కాం జరిగినట్లే కదా? భట్టి గారూ.. మీరంటే నాకు చాలా గౌరవం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై విచారణ జరగాలంటే సిట్టింగ్ జడ్జీ లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సీబీఐ మాత్రమే చేయగలవు అన్న ఉద్దేశ్యంతోనే లేఖ రాసాను. మీరు నిజంగా రేవంత్ రెడ్డి, అతని బావమరిది కుంభకోణం మీద నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తాను అని హామీ ఇస్తే మీకూ లేఖ రాయడానికి సిద్దమ‌న్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *