– 5700 టాయ్‌లెట్ల నిర్మాణం పూర్తి
– టాయ్‌లెట్ల నిర్వహణకు 255 మంది సిబ్బంది
– పారిశుధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23: మేడారం సమ్మక్క జాతరకు హాజరయ్యే కోట్లాది మంది భక్తులకు సురక్షిత తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు, పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తోంది. ప్రధానంగా ఈ జాతరకు హాజరయ్యే భక్తులకు తాగునీటి సౌకర్యం, అన్ని టాయిలెట్ బ్లాక్స్ వద్ద నిరంతర నీటి సదుపాయం, అన్ని ప్రభుత్వ శాఖల వద్ద తాగునీటి సౌకర్యం, పెద్ద సంఖ్యలో టాయిలెట్ బ్లాకుల నిర్మాణం చేపట్టారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం- మిషన్ భగీరథ ఆధ్వర్యంలో దాదాపు 5500 తాత్కాలిక నల్లాలు ఏర్పాటు చేశారు. వీటిలో, 517 బ్యాటరీ ఆఫ్ టాప్స్, 47 సిస్టెర్న్స్, 312 సిస్టర్న్ టాప్స్ , 10 చలివేంద్రాలున్నాయి. 2024 జాతరలో 5222 నల్లాలు మాత్రమే ఏర్పాటు చేయగా ఈసారి జాతరకు 5500 నల్లాలు ఏర్పాటు చేశారు. ఈ జాతరకు రూ.
13.70 కోట్ల వ్యయంతో గ్రామీణ నీటి సరఫరా విభాగం- మిషన్ భగీరథ శాఖ ద్వారా 57 పనులను చేపట్టింది. గతంలో ఉన్న సదుపాయాలకు అదనంగా, ఒక అధికుల సామర్ధ్యం కలిగిన బోర్ వెల్, రెండు బోరెవెల్-పంప్స్, ఐదు కొత్త సిస్టర్స్, ఒక కొత్త ఓ.ఎచ్.ఎస్.ఆర్, 26 టాయిలెట్ బ్లాక్స్, ఒక క్యూ-లైన్ నిర్మాణం, మరో 9 ఇతర పనులను చేపట్టి పూర్తి చేశారు. మేడారం ప్రధాన ఆలయం పరిసరాలు, జాతీయ రహదారి, పార్కింగ్ ప్రాంతాలు, వివిధ గ్రామాల నుండి వచ్చే దారులు, చెరువుల సమీపంలో ఈ తాగునీటి సౌకర్యంతోపాటు టాయిలెట్ లను ఏర్పాటు చేసారు. మేడారానికి వచ్చే లక్షలాది భక్తుల సౌకర్యార్థం మేడారం తోపాటు చుట్టూ పక్కల ప్రాంతాల్లో దాదాపు 5700 టాయిలెట్లను తాత్కాలికంగా నిర్మించారు. మొత్తం 285 టాయిలెట్ బ్లాకులుగా ఏర్పాటు చేసి వీటిని పరిశుభ్రంగా నిర్హహించేందుకు 255 సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. భక్త జన సమూహానికి ఏవిధమైన ఇబ్బందులు కలుగ కుండా ఉండేందుకు ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అధిక సంఖ్యలో 5000 మంది పారిశుధ్య సిబ్బందిని ప్రత్యేకంగా నియమించింది. రోజుకు మూడు షిఫ్టులుగా పనిచేసి ఈ పారిశుధ్య సిబ్బంది, జాతర మొత్తం ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు వ్యర్థాలు, చెత్తను ఏరివేస్తారు. పంచాయితీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు, జాతర మొత్తాన్ని 25 సెక్టారులుగా విభజించి 526 పర్యవేక్షక అధికారులను నియమించారు. సేకరించిన వ్యర్థాలు, చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడానికి, 100 టాక్టర్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా, దుమ్ము, ధూళి లేవకుండా రహదారులపై నీటిని స్ప్రే చేయడానికి 150 వాటర్ ట్యాంకర్లను కూడా ఉపయోగిస్తున్నారు. వీటితోపాటు పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణలో, వరంగల్ నగర పాలక సంస్థ, ఇతర మున్సిపాలిటీలనుండి 40 స్వచ్ఛ ఆటోలను, 16 డోజర్లు, 13 మొబైల్ టాయిలెట్స్, 18 స్వీపెంగ్ యంత్రాలు, 12 జె.సి.బి లను కూడా ప్రత్యేకంగా ఉపయోగిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




