– సిర్పూర్‌లో అత్యంత కనిష్ఠంగా 7.1 డిగ్రీలు
– అప్రమత్తంగా ఉండాలని వైద్యుల హెచ్చరిక
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13: రాష్ట్రంలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఏజెన్సీ గ్రామాల్లో సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. గురువారం ఉదయం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో అత్యంత కనిష్ఠంగా 7.1 డిగ్రీలుగా నమోదుకాగా తిర్యాణిలో 8.2 డిగ్రీలు నమోదైంది. ఉదయం 8 గంటలు దాటినప్పటికీ చలి తీవ్రత తగ్గకపోవడంతో స్కూళ్లు, కార్యాలయాలు, రోజువారీ పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు ఇబ్బంది పడుతున్నారు. ఇక హైదరాబాద్‌లో హెచ్‌సీయూలో అతి తక్కువగా 11.8 డిగ్రీలు రికార్డయింది. రాజేంద్రనగర్‌లో 12.9, మారేడుపల్లిలో 13.6 డిగ్రీల రికార్డయింది. నగర శివార్లలోని ఇబ్రహీంపట్నలో ఉదయం 6 గంటలపుడు 11.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో నాలుగు ఐదు రోజుల్లో చలి తీవ్రత మరింత పరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడిరచింది. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా ఒక్కసారిగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని, చలి మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రం తీవ్ర చలి ప్రభావిత జోన్‌లో ఉందని, ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందని వాతావరణ నిపుణులు తెలిపారు. కనిష్ట ఉష్ణోగ్రతలు 8.5 డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలకు చలి తీవ్రతకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకంటే తక్కువకు పడిపోవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. మిగతా జిల్లాల్లో 10- 12.5 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. చలి తీవ్రతతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ గ్రామాలు వణికిపోతున్నాయి. ఉదయం 9 వరకు పొగ మంచు కమ్ముకుంటోంది.
ఆరోగ్యం జాగ్రత్త
చలి వాతావరణంలో జాగ్రత్తగా ఉండాలని, లేకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శ్వాసకోశ సమస్యలు, జలుబు, దగ్గు, జ్వరాలతో హాస్పిటల్స్‌కు వస్తున్న రోగుల సంఖ్య పెరుగుతోంది. జ్వరం, దగ్గు, గొంతు తడి ఆరిపోవడం, నొప్పులు ఉంటే నిర్లక్ష్యం చేయవద్దని తెలిపారు. గర్భిణులు, ఐదేండ్లలోపు చిన్నారులు, వృద్ధుల్లో సీజనల్ ఫ్లూ లక్షణాలు ఉంటే వెంటనే సవిూపంలోని దవాఖానలకు వెళ్లాలని కోరారు. అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే తక్షణమే దగ్గరలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో చికిత్స పొందాలని సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





